మనుషులు దెయ్యాలను భయపెడితే
`ఆనందో బ్రహ్మ`.
హారర్ సినిమాలు అంటే కేవలం ప్రేక్షకులను భయానికి గురి చేసే కాన్సెప్ట్‌తోనే సాగుతాయి. దీనికి కాస్తా కామెడీని జోడించి హారర్ కామెడీ జోనర్ సినిమాలు టాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. చాలా వరకు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అలాంటి హారర్ కామెడీ జోనర్‌లో వచ్చిన మరో చిత్రమే `ఆనందో బ్రహ్మ`. సాధారణంగా హారర్ చిత్రాలైనా, హారర్ కామెడి చిత్రాలైన దెయ్యాలే మనుషులను భయపెడుతూ ఉంటాయి. మరి మనుషులు దెయ్యాలను భయపెడితే అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమా తెరకెక్కింది. రివర్స ఇప్పటి వరకు వచ్చిన హారర్ కామెడి చిత్రాలకు భిన్నంగా రివర్స్ ఫార్ములాలో వచ్చిన సినిమా కావడంతో పాటు, సినిమాలో తాప్సీ, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ వంటి మంచి కమెడియన్స్ నటించడం సినిమాపై అంచనాలను పెంచింది. మరి సినిమా అంచనాలను ఏ మేర చేరుకుందో చూద్దాం.కథః
రాజు(రాజీవ్ కనకాల) మలేషియాలోని ఎన్నారై. అతని తల్లిదండ్రులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోకి తీర్థయాత్రలకు వెళతారు. కానీ వరదల కారణంగా వారి జాడ తెలియకుండా పోతుంది. దాంతో తల్లిదండ్రులను వెతకడానికి రాజు ఇండియా వస్తాడు. ఎంత వెతికినా, తల్లిదండ్రుల ఆచూకీ దొరకదు. దాంతో ఇండియా నుండి వెళ్లిపోవడానికే నిర్ణయించుకుంటాడు. అందుకని హైదరాబాద్‌లోని తన ఇంటిని ఎవరికైనా అమ్మేయాలనుకుంటాడు. అయితే రాజు స్నేహితుడు(రాజా రవీందర్), యాదవ్(టార్జాన్)లు ఆ ఇంటిపై కన్నేసి, ఆ ప్లేస్‌లో ఓ కాంప్లెక్స్ కట్టాలనుకుంటారు. అందుకోసం ఆ స్థలాన్ని తక్కువ ధరకే కొట్టేయాలనుకుంటారు. అందుకోసం ఆ ఇంటిలో దెయ్యాలున్నట్లు ప్రచారం చేస్తారు. రాజు అవస్థను అర్థం చేసుకున్న ఓ యువకుడు సిద్ధు(శ్రీనివాసరెడ్డి) ఆ ఇంట్లో నాలుగు రోజులు ఉండి వస్తే, ఆ నమ్మకాలు పోతాయని, తనకొక అవకాశం ఇమ్మని అడుగుతాడు. రాజు కూడా సరేనంటాడు. సిద్ధుకు గుండె సమస్య ఉంటుంది. ఆపరేషన్‌కు పాతిక లక్షలు ఖర్చు అవుతుందని అనడంతో రిస్క్ అయినా దెయ్యాలున్న ఇంట్లో ఉండాలనుకుంటాడు. సిద్ధుతో పాటు డబ్బు అవసరమైన సెక్యూరిటీ గార్డు(వెన్నెలకిషోర్), కొడుకు గుండె ఆపరేషన్ కోసం తంటాలు పడే తాగుబోతు తులసి(తాగుబోతు రమేష్), నటుడు కావాలనుకుని మోసపోయిన బార్బర్(షకలక శంకర్)లు కూడా జత కలుస్తారు. అందరూ ఇంట్లోకి వెళతారు? అప్పుడేం జరుగుతుంది? అసలు సమస్యేంటి? ఇంట్లో నిజంగానే దెయ్యాలుంటాయా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణః
హారర్ కామెడి చిత్రాలకు భిన్నంగా ప్లాట్ పాయింట్‌ను ఎంచుకోవడంలోనే దర్శకుడు కాస్తా భిన్నంగా ఆలోచించాడు. అదే దెయ్యాలకు నవ్వంటే భయం. దీంతో పాటు మనుషుల్ని చూసి భయపడే దెయ్యాలు. ఈ రెండు పాయింట్స్‌ను బేస్ చేసుకుని సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు మహి. సీన్‌ను దెయ్యాల కోణంలో ఓపెన్ చేస్తాడు. కానీ ఎక్కడా దెయ్యాలని చూపించకుండా అవి దెయ్యాలని చెప్పే తొలి సీన్ చాలా బావుంది. అక్కడ నుండి కథ ప్రారంభం అవుతుంది. ఓ నలుగురు ఎందుకు చనిపోయాం, ఎవరు చంపారనే విషయాలు తెలియకుండా చనిపోయి ఆత్మలుగా మారుతారు. దెయ్యాలను సెకండ్ సీన్ నుండే చూపిచేస్తారు. అలాగే ఎక్కడా దెయ్యాలంటే జుగుప్స కలిగించేలా చూపించలేదు. ఇక సినిమాలో కీలక పాత్రధారులు విషయానికి వస్తే, గంగ తర్వాత తాప్సీ చేసిన హారర్ కామెడీ ఇది. గంగ చిత్రంతో పోల్చితే తాప్సీ పెర్ఫామెన్స్‌కు పెద్దగా స్కోప్ లేదు. గుండె సమస్య ఉన్న వ్యక్తిగా స్వీయ కామెడీ థెరఫీ చేసుకునే వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి నటన ఆకట్టుకుంది. అలాగే తాగుబోతు రమేష్ షకలక శంకర్ పాత్రల కామెడి సెకండాఫ్‌లో ప్రథమార్థంలో అల్టిమేట్‌గా ఉంది. రేచీకటి, చెవిటివాడుగా ఉంటూ వెన్నెలకిషోర్ చేసే కామెడీ ఆకట్టుకుంది. షకలక శంకర్ హీరోలను ఇమిటేట్ చేస్తూ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్ కామెడి పార్ట్ ఉన్నంతలో బాగానే ఉంది. సినిమా కామెడి పరంగా బాగాఉంది. అయితే సినిమా ఫస్టాఫ్‌లో కామెడి పెద్దగా లేదు. సినిమా చాలా స్లోగా సాగుతుంది. ప్రథమార్థం 58 నిమిషాలే అయినా గంటన్నర పైగా కూర్చున్నట్లు అనిపించింది. సినిమాలో మంచి ఎమోషనల్ పాయింట్ ఉన్న దాన్ని కనెక్ట్ చేయించడంతో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. ద్వితీయార్థంలో కూడా కామెడి పార్ట్ మినహా మరే అంశాలు మెప్పించవు. అనిష్ సినిమాటోగ్రఫీ బావున్నా, కె సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాలో లాజిక్స్ చాలానే మిస్ అయ్యాయి. సినిమా ఫస్టాఫ్‌లో దెయ్యాలుండే ఇంట్లోవెళ్లే జీవా, సుప్రీత్‌లో సుప్రీత్ ఏమవుతాడనే దానిపై క్లారిటీ లేదు. అలాగే విజయ్ చంద్ర్ భార్య శ్రీనివాసరెడ్డి దగ్గరకు ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో తెలియలేదు. సినిమా పార్టులుగా బాగానే ఉన్నా మొత్తంగా చూస్తే సినిమాలో సోల్ మిస్ అయ్యింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి