.
ఇప్పుడు పాదయాత్రల సీజన్ నడుస్తోంది. అధికారం అందుకోవటానికి తండ్రి చూపిన షార్ట్ కట్ మార్గం గా జగన్ పాదయాత్ర నే ఎంచుకున్నారు . గతం లో ఎన్నిక ల అప్పుడే ప్రచారం నిర్వహించే వారు. కానీ జనం లో ఉండటానికి పాదయాత్ర కన్నా మరో మార్గం లేదని భావిస్తున్నారు .కడప జిల్లాలో ఇడుపులపాయతో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తన పాదయాత్రను ముగించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌ను.. పర్యటన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఏపీలో అధికార మార్పిడి జరగాలంటే తండ్రి నెలకొల్పిన పాదయాత్ర అనే సంప్రదాయాన్నే ఫాలో అయ్యి లక్ష్యాన్ని అందుకోవాలని జగన్ ఆరాటపడుతున్నారు.
ఒకప్పుడు పాదయాత్రలు ప్రజలను చైతన్య పరచడానికి జరిగేవి.మహాత్మ గాందీ ఉప్పు సత్యాగ్రహం సమయంలోను, అలాగే అస్పృశ్యత నివారణ కోసం పాదయాత్రలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక భూదాన ఉద్యమ నేత వినోబాబావే 1951లో పాదయాత్ర చేశారు.మాజీ ప్రధాని చంద్రశేఖర్ జాతీయ సమ్యైక్యత బావన కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర సాగించారు. మన తెలుగువారికి సంబందించి ఇచ్చాపురం నుంచి మద్రాస్ వరకు రైతు సమస్యలపై రైతు సంఘాల నేతలు పాదయాత్ర చేసిన చరిత్ర ఉంది. అలాగే ఆయ ఆ సమస్యలపై ఆయా నేతలు పాదయాత్రలు చేశారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి,మైసూరారెడ్డి తదితరులు రాయలసీమ సేద్యపు నీటి సమస్యపై పాదయాత్ర చేశారు.అలాగే కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆయా సందర్భాలలో ఇలాంటి పాదయాత్రలు చేశారు. ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం నాయకత్వం జిల్లా అంతటా పాదయాత్ర చేశారు.అలాగే నల్లగొండ జిల్లాలో అఖిలపక్ష నాయకత్వం ఆధ్వర్యంలో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా చేయాలంటూ పాదయాత్ర జరిగింది. మహభూబ్ నగర్ జిల్లాలో గతంలో సమరసింహారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. అలాగే ప్రస్తుత మంత్రి డి.కె. అరుణ ఆధ్వర్యంలో కూడా ఒక పాదయాత్ర జరిగింది. తెలంగాణ కోసం మాజీ మంత్రి జూపల్లె కృష్ణారావు కొంతకాలం పాదయాత్ర చేశారు.తెలంగాణకు చెందిన దేవేందర్ గౌడ్, హరీశ్వర్ రెడ్డి తదితరులు ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారు.
ఎన్టీఆర్ పాదయాత్రలు చేయకపోయినా చైతన్య రథం మీద అన్ని ప్రాంతాలూ తిరిగి తెలుగు రాజకీయాల్లో ప్రజాయాత్ర అనే అధ్యాయానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ కు ముందు ఇలా పాదయాత్రలు గానీ, ప్రజాయాత్రలు గానీ చేయాల్సిన అవసరం... అప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు లేకపోయింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, అధికార మార్పిడే లక్ష్యంగా ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రావడంతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు, ప్రతి పల్లెనూ పలకరించేందుకు చైతన్య రథాన్ని ఆశ్రయించారు. అనుకున్న లక్ష్యాన్ని అఖండ విజయంతో అందుకున్నారు.తెలుగునాట పాదయాత్ర అనే ఫార్ములాను ఇప్పుడు ఎవరు ఫాలో అయినా.. దాన్ని మొదలుపెట్టింది మాత్రం దివగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే. ఎన్టీఆర్ తరువాత కాంగ్రెస్ లో నిత్య అసమ్మతివాదిగా ముద్రపడ్డ వైఎస్ రాజశేఖరరెడ్డి.. అప్పటికి దాదాపు పదేళ్లుగా పరిపాలనలో ఉన్న చంద్రబాబునాయుడిని గద్దె దించేందుకు పాదయాత్ర అనే కొత్త సూత్రాన్ని అమలు చేశారు. అలా వైఎస్ 11 జిల్లాల్లోని 56 నియోజకవర్గాల్లో దాదాపు 1470 కిలోమీటర్ల దూరాన్ని 68 రోజులపాటు పర్యటించారు. అనుకున్నట్టుగానే వైఎస్ పాదయాత్రకు తెలుగు ప్రజలు హారతి పట్టారు. మండు వేసవిలో రాజశేఖరరెడిడ నిర్వహించిన పాదయాత్రకు తోడు అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసివచ్చింది. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదిగిన వైఎస్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఇక వైఎస్ తరువాత 2014లో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర అనే ఫార్ములానే ఎంచుకున్నారు. వైఎస్ రెండోసారి అధికారంలోకి రావడం, టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం అలముకొని... ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ పవర్లోకి రాలేమన్న అభిప్రాయాలు బలంగా రావడంతో లేటు వయసులోనూ పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. ఉమ్మడి ఏపీలోని 13 జిల్లాల్లో 117 రోజులపాటు బాబు దాదాపు 2వేల కిలోమీటర్ల దూరాన్ని చుట్టి వచ్చారు. ఫలితంగా అధికారం మళ్లీ టీడీపీ హస్తగతమైంది.
వై.ఎస్ పాదయాత్రకు చంద్రబాబు పాదయాత్రకు తేడా ఉన్నా.. ఇద్దిరికీ పాదయాత్రలు, వపర్‌ను కట్టబెట్టాయి. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమవుతన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలను, హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ జగన్ పాదయాత్రకు రేడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతిమంగా ఆంధ్రప్రదేశ్‌లో పవర్ దక్కాలంటే పాదయాత్ర తప్పకుండా అన్న చందంగా తయారైంది పరిస్థితి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రైతు రుణమాఫీ మొదలుకుని డ్వాక్రా రుణాల హామీని పూర్తిగా అమలు చేయకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీ, రాజధాని నిర్మాణంలో అక్రమాలు, ఇసుక దోపిడీ, మైనింగ్ అక్రమాలు, యువతకు నిరుద్యోగ భృతి కల్పనలో విఫలం వంటి అంశాలను టార్గెట్‌గా చేసుకుని జగన్ రంగంలోకి దూకబోతున్నారు. జగన్ ఏపీలో అధికారంలోకి ఉన్న చంద్రబాబును అధికారం దించేందుకు ఓ బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నారు. జగన్ పాదయాత్ర మొత్తం మీద ఎన్నికల ప్రచారానికి తెర లేపనుంది
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి