ఒక్కొక్కప్పుడు పాజిటివ్ పబ్లిసిటీ కంటే నెగిటివ్ పబ్లిసిటీతోనే సినిమాలు ఎక్కువ హిట్ అవుతుండడం మనం చూస్తూనే ఉంటాం. రాంగోపాల్ వర్మ ఈ టెక్నిక్ ఉపయోగించడంలో దిట్ట. సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాల్లో ఏది సూపర్ హిట్ అవలేదు కానీ... రీల్ సినిమా కాకుండా... ఒక రియల్ సినిమా సూపర్ హిట్ అయింది. అదే కోడి పందేల సినిమా. ఈ సినిమా ఇంత హిట్ కావడంలో తమకు తెలియకుండానే హైకోర్టు వారు... తెలిసీ... కోడి పందేలు ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వం అంటూ డంబాలు పలికి.. గొప్పగా నటించిన మన రాజకీయ నాయకులు, పోలీస్ ఉన్నతాధికారులు ఇతోధికంగా సహకరించారు. ఈ నెగటివ్ పబ్లిసిటీతోనే ఈ సారి హైదరాబాద్ నుంచి కూడా చాలామంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలనే ఉత్సుకతతో పర్యాటకుల్లా రావడం విశేషం.
మేము ముందే చెప్పాం...(http://www.bhinnaswaram.com/2018/01/blog-post_5.html)
భిన్నస్వరం ఈ నెల 5 నే పందెం... కోడి పందేలు ఆపలేరని... అంటూ ఓ కధనం వెలువరించింది. భిన్నస్వరం పాఠకులు అది చదివే ఉంటారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తారని.. అందుకోసం ఎంతవరకు అయినా వెళతారని... ఆ విధంగానే ఈ సారి కూడా యధాప్రకారం కోడి పందేలు యధేశ్చగా జరిగాయి. అవి కూడా ఏదో నల్లమల అడవుల్లోనో... అబూజ్ మడ్ లాంటి దుర్భేద్యమైన మావోయిస్టుల కోటల్లోనో కాదు జరిగింది... అధికారం నెత్తికెక్కిన రాజకీయ నాయకుల కోటల్లో... రాజధాని పరిసర ప్రాంతాల్లో... జాతీయ రహదారి పక్కనే మైదాన ప్రాంతాల్లో...పైగా ఈ సారి స్పెషల్ లేడీస్ ఎక్కువ సంఖ్యలో రావడమే కాక... స్వయంగా పందేలు కాయడం... మరి కోర్ట్ తీర్పులు... పోలీస్ ఉన్నతాధికారుల ప్రకటనలు... కృష్ణ నదిలోనూ... గోదాట్లోనూ కలిసిపోయాయి. దాదాపు 500 కోట్ల మేరకు పందేలు జరిగాయి. ఇది షరా మాములే.. మళ్లి వచ్చే ఏడాది కూడా ఇలాగే జరుగుతుంది.. మార్పేమీ ఉండదు. మారితే... అధికారం తప్ప...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి