భారత దేశం గర్వించదగ్గ మహా నటుడు కమల్ హసన్ ఈ నెల 21 న తాను ప్రారంభించనున్న రాజకీయ పార్టీ పేరు ప్రకటించి, రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆదివారం తన చిరకాల మిత్రుడు, సహ నటుడు రజనీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రజని కాంత్ కూడా ఇప్పటికే రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. అయినప్పటికీ తమ మధ్య ఉన్న స్నేహానికి అదేమీ అడ్డుకాదని నిరూపిస్తూ కమల్ రజని ని కలవడం విశేషం. నటనా రంగంలో ఒకే స్కూల్(బాలచందర్) నుంచి వచ్చిన వీరిద్దరూ రాజకీయంగా వేర్వేరు దృక్పథాలతో వేర్వేరు పార్టీలు పెట్టి రాజకీయ కురుక్షేత్రంలో దిగుతున్నప్పటికీ వీరు స్నేహ పూరిత వాతావరణం లోనే పయనించనున్నారు. నా రంగు కాషాయం కాదు అని ప్రకటించిన కమల్... రజని రంగు కాషాయం కాకుండా ఉంటుందని ఆశిస్తున్నారు. రజని కాషాయం కప్పుకోకుండా ఉంటె కలసి పయనించడానికి కమల్ సిద్ధంగా ఉంటారు. బహుశా ఈ రోజు వారిద్దరి మధ్య సంభాషణల్లో ఆ విషయం తప్పకుండా వచ్చే ఉంటుంది.
నా రాజకీయ పర్యటనను గురించి తెలియజేయడానికి వచ్చాను. నా పర్యటన విజయవంతం కావాలని రజని ఆశీర్వదించారు అని కమల్ చెప్పారు.
ఆయన డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రాలేదు. తమిళనాడు ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. ఆయన ప్రయత్నం విజయవంతం కావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని రజనీకాంత్ అన్నారు.
భిన్నస్వరం మొదటినుంచి చెబుతోంది ఎం.జి.ఆర్, కరుణానిధి లాగ కమల్, రజని లు కూడా రాజకీయంగా కలసి పనిచేయాలని. ఒకే పార్టీ కాకపోయినా, ఒకే ఆశయం కోసం కలసి పని చేసే అవకాశం ఉంది. చూద్దాం... మున్ముందు తమిళనాడు రాజకీయ తెర మీద ఏం జరుగుతుందో...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి