మహేష్... ఆ పేరు లోనే ఓ వైబ్రేషన్ ఉంటుంది.... అంటూ మహేష్ పేరున్న వాడినే పెళ్లి చేసుకుంటానంటుంది... అష్టా..చెమ్మా సినిమాలో హీరోయిన్... అదేమో కానీ... యద్దనపూడి సులోచనా రాణి... ఆ పేరు వింటేనే... తెలుగునాట ఒకప్పుడు పెద్ద వైబ్రేషన్... ముఖ్యంగా 1970 నుంచి 1985...90 వరకు తెలుగు నాట ఏ ఇంట్లో చూసినా ఆడవాళ్లు ఇంటి పని, వంట పని త్వరగా పూర్తి చేసుకుని యద్దనపూడి నవల చేత్తో పట్టుకుంటే... మధ్యాహ్నం టీ పెట్టుకునే టైం కి నవల పూర్తి చేసి పక్కన పడేసే వాళ్ళు.. ఆలా పట్టుకుంటే వదిలిపెట్టలేనంతగా ఏకబిగిన చదివింపచేసే శైలి యద్దనపూడిది.
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజ గ్రామంలో కరణం గారింట పుట్టి, కేవలం కాజ హైస్కూల్ లో ఎస్.ఎస్.ఎల్.సి వరకు మాత్రమే చదివిన ఓ సగటు అమ్మాయి... 18 ఏళ్లకే పెళ్లయి... హైదరాబాద్ వెళ్లిపోయి వంటింటికి పరిమితమై గృహిణి పాత్రలో ఒదిగిపోయిన ఆమె తదనంతర కాలంలో కోట్లాది తెలుగు ప్రజల గుండెల్లో అభిమాన రచయిత్రి గా గూడు కట్టుకున్నారు. దీనికి బీజం కాజ లోనే పడింది. కాజ సెంటర్ లో ఉన్న గ్రంధాలయంలో చిన్నపుడు చదివిన పుస్తకాల ప్రేరణ తోనే ఆమె తన 16 వ ఏట చిత్రనళినీయం అనే కథను రాసి ఇంట్లో ఎవరికీ తెలియకుండా... అక్క కొడుకులతో పోస్ట్ చేయించి ఆంధ్రపత్రిక కు పంపించారు. తీరా ఆంధ్ర పత్రిక నుంచి 15 రూపాయలు పారితోషికం పోస్ట్ లో ఇంటికి వచ్చేసరికి ఆ రహస్యం ఇంట్లో అందరికి తెలిసి... ఆమెను అభినందించారు. హైస్కూల్ లో చదివేటప్పుడు ఏదో రాయాలనే తపనతో తోచినది రాసి సైన్స్ మాస్టారు ఖుద్దూస్ గారికి చూపిస్తే ఆయన చదివి మెచ్చుకునే వారు. పెళ్లయ్యాక తనలో ఉన్న రచనా శక్తి కి పదును పెట్టి చిన్న చిన్న కధలు రాయడం ప్రారంభించారు. తొలిసారిగా 1966 లో సెక్రటరీ నవల రాశారు. ఆ నవల 2016 లో స్వర్ణోత్సవం జరుపుకుంది. సెక్రటరీ తో పాటు ఆమె రాసిన మీనా, జీవన తరంగాలు, రాధాకృష్ణ, అగ్నిపూలు, విజేత(విచిత్ర బంధం), చండీప్రియ వంటివెన్నో సినిమాలుగా వచ్చాయి. ఆ తర్వాత బుల్లితెరపై ఋతురాగాలు, రాధ మధు వంటి సీరియల్స్ ఇంటింటా పుట్టించిన ప్రకంపనలు చెప్పనలవి కాదు. ఈ విధంగా వార పత్రికల కాలంలో ఇంటింటా ప్రత్యక్షమై... ఆ తరవాత వెండి తెరపై ప్రకాశించి,.. ఆ తదనంతరం... బుల్లి తెరపై విశ్వరూపం చూపించి... అన్ని కాలాల్లోనూ తన ప్రభావాన్ని చాటిన ఒకే ఒక్క తెలుగు రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి. యద్దనపూడి... ఆ పేరులోనే ఓ వైబ్రేషన్..ఉంది...అవునంటారా... కాదంటారా.. మీరే చెప్పండి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి