పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు 2019 జనవరిలో ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం గుంటూరు జిల్లా పార్టీ నేతలతో మాట్లాడుతూ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలలకు ఒప్పుకోమని, షెడ్యూల్(ఏప్రిల్-మే) ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కేంద్రం ఒక వేళ రాజ్యాంగ సవరణ చేసి శాసన సభకు ముందుగా ఎన్నికలు పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్పారు. అయితే ఆ మాట అంటూనే లోక్ సభకు ముందుగా ఎన్నికలు వచ్చేటట్టయితే అందరూ సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపిచ్చారు. కేంద్రం లోక్ సభకు ముందుగా పెట్టదలచుకుంటే తప్పనిసరిగా రాష్ట్రాల శాసనసభలకు కూడా పెడుతుంది. నిర్దేశిత గడువు కన్నా ఆరు నెలలు ముందుగా అంటే జనవరి లోనే ఎన్నికలు జరిపే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంది. ఎన్నికల కమిషన్ కేంద్రం చేతిలో కీలు బొమ్మే కదా... సో జనవరిలో ముందస్తు ఎన్నికలు ఖాయం.
ఆరు నెలలు జనం లోనే...
అందుకే చంద్రబాబు అరు నెలలు జనం లోనే ఉండేందుకు గ్రామ దర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాలు ప్రకటించారు. ఈ నెల 16 వ తేదీ నుంచి ఆరు నెలల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. నవ్యఆంధ్రా లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు అయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్టు పైకి చెబుతున్నప్పటికీ ఇది పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిందే... ప్రతిపక్ష నాయకుడు జగన్ ఓ పక్క పాదయాత్రతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో పక్క బస్సు యాత్రతో నిత్యం జనంలో ఉంటుండడంతో చంద్రబాబు కూడా ప్రభుత్వ కార్యక్రమాలతో నిత్యం జనంలో ఉండేందుకు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా అధికారులు, సిబ్బంది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వ పధకాల గురించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తారు. దీనితో పాటు మరో మెగా ఈవెంట్ కూడా జరపనున్నారు. ద్వాక్రా వ్యవస్థ ఏర్పాటు చేసి 25 ఏళ్ళు (1994) అయిన సందర్భాన్ని పురస్కరించుకుని డ్వాక్రా రజతోత్సవం పేరుతొ భారీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ విధముగా మరి చంద్రబాబు గారు ముందుకు పోతున్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి