Translate

  • Latest News

    25, ఏప్రిల్ 2019, గురువారం

    వై.ఎస్.ఆర్.సి.పీ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ నిజమేనట...


    చట్టాన్ని అడ్డు పెట్టుకుని తప్పుడు పనులు చేయడం పాలకులకు అలవాటై పోయింది. చట్టాన్ని....అధికారంలో ఉన్న వారు తమ చుట్టంగా భావిస్తూ... తాము చేసే తప్పుడు పనులు అన్నిటికి దానిని సాధనంగా వాడుకుంటున్నారు... మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు దాటినా ... ఇప్పటికీ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలే స్వతంత్ర భారత దేశంలో కొనసాగుతుండడం విచారకరం.  డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగానికి ఇప్పటి వరకు మన పాలకులు ఈ 70 ఏళ్లలో 122 సార్లు సవరణలు చేశారు. కానీ ఎప్పుడో... 150 ఏళ్ల క్రితం నాటి కాలం చెల్లిన బ్రిటిష్ చట్టాలను మాత్రం అలాగే ఉంచారు... ఎందుకంటే... అవి ఎప్పుడూ అధికారంలో ఉన్నవారికి అవసరార్ధం ఉపయోగ పడేవే... విపక్షంపై కక్ష తీర్చుకోవడానికి దోహద పడేవే... అందుకే కేంద్రంలో అధికారం ఎన్ని చేతులు మారినా... ఈ చట్టాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. ఇప్పటివరకు చేసిన సవరణలు అన్నీ దాదాపుగా అధికారంలో ఉన్న వారు... తమ తమ స్వప్రయోజనాల కోసం చేసినవే... (తొలి రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ హయాం లో మినహాయిస్తే..) రాజ్యాంగానికి తొలి సవరణ 1951 జూన్ 18న జరిగింది. అది ప్రజల ప్రయోజనం కోసం చేసిందే... రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించి ఆ సవరణ చేశారు... కానీ ఆ తర్వాత...తర్వాత చేసిన సవరణాలన్నీ దాదాపుగా పాలకులు తమ అధికార పీఠాన్ని బలోపేతం చేసుకోవడానికి చేసినవే... వాటిలోప్రముఖంగా చెప్పుకునేది 42 వ రాజ్యాంగ సవరణ... అదే ఎమెర్జెన్సీ... 1975 జూన్ 25 అర్ధరాత్రి చేసిన నల్ల చట్టం. ఆ తర్వాత మన పాలకులు మరో 80 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు. కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కే చట్టాల జోలికి మాత్రం ఏ పాలకుడు పోలేదు. చివరి సవరణ 2018 జనవరి 13 న జి.ఎస్.టి చట్టం..

    చట్ట ప్రకారమే చేశారట... 
    తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్ట ప్రకారం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశామని హైకోర్టు ముందు అంగీకరించింది. టెలిగ్రాఫ్ చట్టం 1885 సెక్షన్ 5(2) ప్రకారమే చేశామని సగర్వంగా చెబుతోంది. తనతో పాటు తమ పార్టీకి చెందిన నాయకుల ఫోన్లను అధికార పార్టీ వారి కోసం పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు రాగా రాష్ట్ర ప్రభుత్వం అది నిజమేనని అంగీకరించింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ టెలిగ్రాఫ్ చట్టం 1885 సెక్షన్ 5(2) ప్రకారమే ట్యాపింగ్ చేశామని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆ వివరాలను కౌంటర్ రూపంలో లిఖిత పూర్వకంగా తమ ముందు ఉంచాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఉప్పాక దుర్గా ప్రసాద్ ల తో కూడుకున్న ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
     టెలిగ్రాఫ్ చట్టం 1885 సెక్షన్ 5(2) ఏం చెబుతోంది... 
     టెలిగ్రాఫ్ చట్టం 1885 సెక్షన్ 5(2) ప్రకారం... దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు భంగం వాటిల్లజేసేవారు... విదేశాలతో స్నేహ సంబంధాలు నెరపే వారు.. నేరాలని ప్రేరేపించే వారిని నిరోధించడం కోసం.. .ప్రజల సంరక్షణ కోసం..   ఇటువంటి వారి ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేయవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని చేశానని గర్వంగా చెబుతోందంటే... వై.ఎస్.ఆర్.సి.పీ నాయకులపై  పై వాటిలో ఏ ముద్ర వేసిందో... ఏ విధంగా దేశ ద్రోహులుగా పేర్కొందో... లేదా ఉగ్రవాదులుగా పేర్కొందో  కూడా కోర్టుకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది.




    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వై.ఎస్.ఆర్.సి.పీ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ నిజమేనట... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top