అనగనగా ఒక రాజ్యం... ఆ రాజ్యంలో రాజు జనరంజకంగా పాలించేవాడు... ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు రచ్చబండ అనే ఒక కొత్త పధకం ప్రారంభించేందుకు వెళుతూ ఒకానొక దుర్దినాన ఆ రాజు విమాన ప్రమాదంలో మరణించారు. వెంటనే రాకుమారుడికి పట్టాభిషేకం చేద్దామని రాజుగారి సన్నిహితులు తలపెట్టినా... రాకుమారుడికి అనుభవం లేదని... ఆయన్ను పక్కన పెట్టి.. అత్యంత సీనియర్ మంత్రి గా ఉన్న ఒక ఆర్ధిక నిపుడిని రాజును చేశారు.. కొంతకాలానికి ఆయన పనికిరాడని ఆయనను తొలగించి సామంత రాజుల్లో ఒకరిని రాజును చేశారు... ఈ లోగా రాకుమారుడు రాజ్యంపై తిరుగుబాటు చేశాడు... తన కుటుంబంతో పాటు మిత్రకూటమితో ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. రాజ్యంతో ఢీ కొట్టాడు... ఈ లోగా ఎన్నికలు వచ్చాయి... రాకుమారుడిని ఓడించడానికి అధికారంలో ఉన్న రాజు తన బలం చాలదని, శత్రువు శత్రువు తమకు మిత్రుడన్నట్టు... గతంలో 9 ఏళ్ళు అదే రాజ్యాన్ని పరిపాలించిన మరో మాజీ రాజుతో చేతులు కలిపాడు.. ఆ రాజు రాజకీయ చాణిక్యంలో మేటి... వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని... తన అనుభవాన్నంతా కలబోసి... ఎన్నికల్లో రాకుమారుడిని ఓడించి మళ్ళీ సింహాసనం అధిష్టించాడు. ఎన్నికల ఫలితాలతో రాకుమారుడు కంగుతిన్నాడు. తన గెలుపు ఖాయమని అతి విశ్వాసం కారణంగానే అతి తక్కువ తేడాతో ఓటమి చవిచూడవలసి వచ్చిందని గ్రహించాడు.
దేశాటనకు నిర్ణయం
పూర్వం రాజ్యాధికారం చేపట్టడానికి యువరాజును రాజు దేశాటన చేయాలని ఆదేశించేవారు. ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఆకాంక్షలకు అనుగుణంగా జనరంజక పాలన అందించటానికి గతంలో ఈ పద్దతి ఫాలో అయ్యే వారు. పట్టువదలని విక్రమార్కుడు లాంటి రాకుమారుడు ఓటమి నుంచి ఆనతి కాలంలోనే తేరుకుని పాదయాత్ర పేరుతొ దేశాటనకు బయలుదేరాడు. దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తున్న ప్రజల కష్ట సుఖాల గురించి స్వయంగా తెలుసుకున్నాడు... తాను అధికారంలోకి వస్తే వారి కష్టాలన్నీ తొలగిస్తానని, తన తండ్రి పాలన మళ్ళీ చవిచూపిస్తానని చెప్పాడు. ప్రజలు ఆయన మాటల్ని విశ్వసించారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి... ప్రజలు రాకుమారుడికి పట్టాభిషేకం చేశారు... (పట్టాభిషేకం జరిగి ఏడాది పూర్తి కావస్తోంది... మరి రాకుమారుడు ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చాడా... రాకుమారుడు అనుకున్న లక్ష్యం సాధించాడా...? ప‌్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నాడా..? ఏడాది పాలన గురించి ప్రజలేమనుకుంటున్నారు...
(నోట్: ఎన్నికల ఫలితాలు వచ్చి మే 23 కి ఏడాది... పట్టాభిషేకం జరిగి మే 30 కి ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఏడాది పాలనపై భిన్నస్వరం వరుస కథనాలను వెలువరించనుంది.)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి