Translate

  • Latest News

    26, ఆగస్టు 2020, బుధవారం

    రాహుల్ బాబూ...ముందు నువ్వు జనంలోకి రా నాయనా...


    కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీ ని కన్నది... అన్నాడు ప్రముఖ విప్లవ కవి  శివసాగర్ ఉరఫ్ కేజీ సత్యమూర్తి... ఏ ఏ కాలానికి అనుగుణంగా ఆ యా కాలాల్లో ఒక తరాన్ని లేదా పార్టీని నడిపించే నాయకులు పుట్టుకొస్తుంటారు... అది కవిత్వంలో నైనా... రాజకీయ పార్టీలో నైనా...కాంగ్రెస్  పార్టీ కి అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత ఎవరు... అన్నప్పుడు కాలం లాల్ బహదూర్ శాస్త్రి ని ప్రసవించింది. సరే ఆయన ఆకస్మిక మరణంతో రెడీమేడ్ గా ఉన్న ఇందిరా గాంధీ ఆటోమాటిక్ గా ప్రధాని అయింది. 1984 లో ఇందిర హత్య సమయంలోనూ ఇదే విధంగా రెడీమేడ్ నాయకుడు రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. అయితే 1991 ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్య సమయంలో మళ్ళీ కాలం కడుపుతో ఉండి పి.వి.నరసింహారావు ను కన్నది... ఆ తర్వాత మన్మోహన్ సింగ్ పదేళ్లు గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధానిగా చేసిన ఘనత దక్కించుకున్నాడు.... మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పురిటి నొప్పులు పడుతోంది... మళ్ళీ కాలం కడుపుతో ఉండి ఒక శాస్త్రి బాబునో... ఒక నరసింహారావు నో... ఒక మన్మోహన్ సింగ్ నో కనడానికి భూమిక ను సిద్ధం చేసుకుంది. కానీ వచ్చిన చిక్కల్లా కాంగ్రెస్ మాతకు ఇప్పుడు అలాంటి నిజాయితీ, నిష్కల్మష రాజకీయ నాయకులు ఎవరూ ఈ తరంలో కనపడటం లేదు... ఉన్న ఒక్కరిద్దరూ బాగా వృద్ధులై పోయారు... మిగతా వారంతా... పార్టీకి మేము ఏమిచ్చాం అనే వాళ్ళు కాకుండా... పార్టీ మాకు ఏమిచ్చింది... అనే బాపతు వాళ్ళే ఉన్నారు... అందుకే పాపం ఎవర్ని కనాలో అర్ధం కానీ సందిగ్దా స్థితిలో నెలలు నిండినా ప్రసవం కాక కొట్టుమిట్టాడుతోంది. ఇక సిజేరియాన్ ఆపరేషన్ తప్పదు... శ్రీశ్రీ అన్నట్టు వ్యవస్థ కుళ్లిపోయినప్పుడు శస్త్ర చికిత్స అనివార్యం. అయితే ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ రాహుల్ అస్త్ర సన్యాసం చేసి తప్పుకున్నాడు. వృద్ధ మాత సోనియమ్మ ఆపరేషన్ చేసే పరిస్థితిలో లేదు. ఆపరేషన్ చేసేందుకు మిగతా డాక్టర్ లు ఎవరూ ముందుకు వచ్చే సాహసం చేయడం లేదు. ఇదే నేడు కాంగ్రెస్ పార్టీలో ఎడ  తెగని సమస్య....
    త్రిశంకు స్వర్గంలో కాంగ్రెస్
    రాహుల్ గాంధీ  దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇందిర హయాం నుంచి కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబమే అన్నది జనంలో కూడా బాగా నాటుకుపోయింది. ఆ కుటుంబం లో వారు కాకుండా వేరే ఎవరు నాయకత్వం చేపట్టినా పార్టీ అస్తిత్వానికే ప్రమాదం అన్న భయం కూడా ఆ పార్టీలో బలంగా ఉంది. అందుకే భూమి సూర్యుని ఛుట్టూ తిరుగుతున్నట్టు  కాంగ్రెస్ పార్టీ ఎటు పోయి ఎటు వచ్చినా గాంధీ కుటుంబం చుట్టూనే తిరుగుతోంది. ఈ దశలో రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేసి ఆ పార్టీని త్రిశంకు స్వర్గంలో పడవేసాడు. అటు స్వర్గానికి వెళ్ళలేదు.. ఇటు భూమిమీద ఉండలేదు. ఇటువంటి స్టేజి లో ఎక్కువ కాలం కొనసాగడం ఆ పార్టీ ఉనికికే ప్రమాదం. తొందరగా ఏదో ఒకటి తేల్చుకుని 2024 ఎన్నికలకు సమాయత్తం కావాల్సి ఉంది. అసలే అవతల శత్రువు చాలా బలంగా ఉంది. సో.. కాంగ్రెస్ ఎంత త్వరగా ఈ త్రిశంకు స్వర్గం నుంచి బయట పడితే అంట మంచిది.
    కింకర్తవ్యం ఏమిటి... 
    రాహుల్ అనే పేరు బహుశా నాయనమ్మ ఇందిరా గాంధీ యే పెట్టి ఉంటుంది. ఆమె మంచి చదువరి కూడాను. రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావంతో ఆ పేరు పెట్టి ఉండవచ్చు. రాహుల్ కు మంచి ఆదర్శాలు ఉన్నాయి. తమ కుటుంబం నుంచి కాక  పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే వారి చేతుల్లో పార్టీ ని పెట్టాలని... కానీ దురదృష్టవశాత్తు ఈ తరంలో అటువంటి  నాయకులు కాగడా పెట్టి వెదికినా దొరకని పరిస్థితి. సీనియర్ల వలన పార్టీ ఎదగడం లేదని అనుకుంటే సింధియా, పైలట్ లాంటి యూత్ కూడా పార్టీ కి హాత్ ఇస్తుంటే ఎవరిని నామములో అర్ధంకాని గందరగోళం. మరి ఇప్పుడు ఏం చేయాలి. ఎవరిని నమ్మాలి... రాహుల్ ఇప్పుడు తెలుసుకోవాల్సిందల్లా నాయకులని కాదు నమ్మడం.. జనాన్ని నమ్మాలి. రాహుల్ తనకు ఆ పేరు పెట్టినందుకయినా ముందు దేశాటన చేయాలి. అంతఃపురం వదిలి జనంలోకి రావాలి.. కేవలం ఆదర్శాలు వల్లిస్తే చాలదు. జనం లోకి వచ్చి. జనంతో మమేకం అయినప్పుడే జనం ఓన్ చేసుకుంటారు. జనం సమస్యలపై ఉద్యమాలు చేస్తే జనం బ్రహ్మ రధం పడతారు. అప్పుడు పార్టీ కూడా తప్పనిసరై  ఆ నాయకుడి వెంట నడుస్తుంది. సో... రాహుల్ తక్షణం చేయాల్సిన పని ఇది. ఎందుకంటే ఇది ఒక్క రాహుల్ కోసమో... కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు.. దేశంలో సరైన ప్రతిపక్షము లేక కేంద్రంలో ఏక ధ్రువ పాలన సాగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సూచన. దేశంలో ప్రజాస్వామ్య పరి రక్షణ కోసమైనా రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం వీడి తక్షణం జనం లోకి రావాల్సిన అవసరం ఎంతయినా ఉంది.


    • Blogger Comments
    • Facebook Comments

    4 comments:

    1. అతను ఒక నిరర్ధక నిరాశా జీవి. ప్రజల గురించి ఆలోచించే అంత సాహసం చేయ లేడు. పోరాటంలోంచి ఎదగాలనే ఆలోచన ఎవరూ ఇవ్వలేదు.ప్రస్తుతం దావానం లో చిక్కుకున్న పార్టీని రక్షించుకోవడానికి అతను ఫీనిక్స్ లా మంటల్లో నుంచి పుట్టుకుని రాగలిగిన కర్తవ్య దీక్షా పరాయణుడు కాదు. నిజమే మీరు అన్నట్లు అతను జనంలోకి రావాలి. అప్పుడే పార్టీని కష్టాల్లో కి నెట్టేస్తున్న అవకాశవాద ముఠాకు అడ్డుకట్ట పడుతుంది. ఆంధ్రలో 2004 లో వైఎస్, 2014లో బాబు, 2019లో జగన్ ఈ ఫార్ములా ను విజయవంతంగా, సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. ప్రయత్నిస్తే విజయం ఖాయం.ఎవరన్నా చెప్పందయ్యా.

      రిప్లయితొలగించండి

    Item Reviewed: రాహుల్ బాబూ...ముందు నువ్వు జనంలోకి రా నాయనా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top