అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.... మీడియాను తొక్కిపెట్టి వాస్తవాలను దాచలేరు....
ప్రస్తుతం దేశంలో ఒక అప్రజాస్వామికమైన, అత్యంత విషాదకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజల గొంతును వినిపించే ఫోర్త్ ఎస్టేట్ సైతం రాజ్యం గుప్పిట్లోకి వెళ్లిపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అత్యంత సన్నిహితుడైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేతుల్లో 21 ఛానల్స్ ఉన్నాయి. దాదాపు అన్ని ప్రాంతీయ భాషలోనూ వీటి ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక ప్రధాన పత్రికల్లో సైతం అధిక భాగం అధికార పక్షానికి బాకా ఊదుతున్నాయి. మీడియా మేనేజ్ మెంట్లో మోడీ కంటే రెండాకులు ఎక్కువే తిన్న చంద్రబాబు సంగతి వేరే చెప్పనవసరం లేదనుకుంటా.ఇటువంటి పరిస్థితుల్లో అటు కేంద్రంలో కాని ఇటు రాష్ట్రంలో కాని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలేవీ పత్రికల్లో కాని, న్యూస్ ఛానల్స్లో కానీ కనపడకపోవటంలో ఆశ్చర్యంలేదు. బాధితులు, పీడుతుల పక్షపాతిగా ఉండాల్సిన మీడియా కార్పోరేట్ శక్తుల కబంధ హస్తాల్లో ఉండటంతో సామాన్యుడి స్వరం వినిపించటంలేదు.
ఇటీవల జీఎస్టీకి వ్యతిరేకంగా పలు రాష్ట్రాలో జరిగిన అందోళనలు ప్రధాన వార్తా స్రవంతిలో చోటు చేసుకోకపోవటం గమనార్హం. ఇందులో భాగంగానే మోడికి పెట్టని కోట అయిన గుజరాత్ రాష్ట్రంలోని ప్రధాన వర్తకవాణిజ్యకేంద్రమైన సూరత్ లో లక్షలాది మంది వ్యాపారులు రోడ్డెక్కి ఆందోళన చేశారు.
డార్జిలింగ్ లో ఓ పేటకు బీజేపీ నాయకులు వెళ్లినప్పడు ప్రజలు వారిని తరిమితరిమికొట్టారు. ఈ రెండు సంఘటనలు కొద్దిగా ఆలశ్యంగానైనా సోషల్ మీడియా ద్వారా వెలుగుచూసాయి. ఇవి బయటకు వచ్చాకే ఖంగుతిన్న మోడీ జీఎస్టీ సరళీకరణ అంటూ ప్రకటన చేయాల్సి వచ్చింది. సో.:ఫోర్త్ ఎస్టేట్ ను గుప్పిట్లో పెట్టుకున్నా .... ప్రస్తుత ఎలక్రానిక్ యుగంలో సామాన్యుడి చేతిలో ఆయుధంగా మారిన ఫిఫ్త్ ఎస్టేట్ (సోషల్ మీడియా ) ను ఏమార్చలేరు. బి వేర్ ఆఫ్ ఫిఫ్త్ ఎస్టేట్.
-మానవేంద్ర
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి