ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పంతాన్ని నెగ్గించుకునే యోచనలో ఉన్నట్లుగా ఉంది.ఏకకాలంలో దేశ వ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరపాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు.విడతల వారీగా కాకుండా దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవలి కాలంలో తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇదే అంశాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో బయటపెట్టారు. తద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవ్వడమే కాకుండా..ఎంతో విలువైన సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు.
ఏకకాలంలో ఎన్నికలు సాధ్యమేనా
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఉంటుంది. మరి 29 రాష్ట్రాలతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా..? ఏ పార్టీ అయినా ఐదేళ్ల పాటు అధికారంలో ఉండాలనే అనుకుంటుంది.. అంతేకానీ గడువు తీరకుండా అధికార కుర్చీని దిగడానికి ఎవరైనా ఇష్టపడతారా..? అయితే ప్రధాని మాత్రం ఇందుకు అవసరమైన రాజకీయ, రాజ్యాంగ, పాలనాపరమైన కసరత్తు వేగం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో తాము ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలమని ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. ఈ ప్రక్రియకు కావాలసిన వివరాలు, ఈవీఎంలు, డబ్బు గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే 40 లక్షల ఎన్నికల పరికరాలు కావాలి..వీవీపాట్ కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని రావత్ అన్నారు. తమ అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులు అందించడంతో తమ పని ప్రారంభించామని.. అదనపు పరికరాల కోసం ఆర్డర్లు ఇచ్చామని.. సెప్టెంబర్ 2018 నాటికి అన్ని పరికరాలు అందుబాటులోకి వస్తాయని, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తాము పూర్తి స్థాయిలో సిద్ధమని తెలిపారు.
దేశంలో జమిలి ఎన్నికలు! లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి నిర్వహణ! ఈ దిశగా మోదీ సర్కారు చేస్తున్న ఆలోచన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు జమిలి సాధ్యమేనా? ఒకేసారి ఎన్నికలకు ఉన్న అడ్డంకులపైనా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి మూడు ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగాయి. అయితే ఆ తర్వాత మారిపోయిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏటా ఏదో ఒక శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటం, కేంద్రం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే... ఆ రాష్ట్ర ఎన్నికలు అడ్డుకావడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
జమిలి ఎన్నికలు నిర్వహించడం అంత తేలికేనా?
వాస్తవానికి ఒకేసారి ఎన్నికలు అనేవి చాలా సంక్లిష్టమైన వ్యవహారమని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్టాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది గుజరాత్, కర్ణాటక, నాగాలాండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం రాష్టాలకు 2019లో ఏపీ, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, ఛతీస్ఘడ్, సిక్కిం, మధ్యప్రదేశ్ హర్యానా, మహారాష్ట్ర, ఒడిసాలకు ఎన్నికలు జరగాలి. 2021లో అసోం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ లలో ఎన్నికలు జరగాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఏకకాలంలో ఎన్నికల నిర్వహరణ కొన్నిరాష్టాలతో సమస్య వస్తోంది. మొత్తం మీద 2018 నవంబరులో ఎన్నికలు జరిగితే 17 రాష్టాలతో పెద్దగా సమస్యలుండవు. కానీ 2021, 2022లో ఎన్నికలు జరగాల్సిన రాష్టాలతో ఇబ్బంది.
రాజ్యాంగ సవరణ చేయాల్సిందే....
శాసనసభల పదవీకాలాన్ని పొడిగించాలన్నా, తగ్గించాలన్నా రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. ఆర్టికల్ 83, 172లలో లోక్‌సభ, శాసనసభల గడువులు ఒక ఏడాది పొడిగించడానికి అవకాశం ఉంది. కానీ ముందుగానే రద్దు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కచ్చితంగా కావాలి. లేదంటే రాజ్యాంగంలో, ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనేక సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది. ఇంతచేసినా...ఏదైనా ఒక రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తే? కోర్టులనాశ్రయిస్తే ఏం జరుగుతుందన్న దానిపై న్యాయనిపుణులు కూడా అంచనాకు రాలేకపోతున్నారు. మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తానూ ఏదయినా అనుకుంటే అది చేసి తీరుతారు. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి విషయంలో అలాగే చేశారు. జనంలో ఎంత వ్యతిరేకత వచ్చినా తాను చేసింది కరెక్ట్ అని సమర్ధించుకున్నారు కూడా. కాబట్టి జమిలి ఎన్నికల్లో కూడా తన పంతాన్ని నెగ్గించుకునే అవకాశం ఉంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి