కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన పార్టీ ఇప్పుడు ఆ పార్టీ తోనే తెలంగాణ లో పొత్తు పెట్టుకోనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. 1983 లో ఆత్మగౌరవమే అస్త్రంగా పురుడు పోసుకున్న ఆ పార్టీ ఇప్పుడు అధికారమే పరమావధిగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే అచ్చంగా కాంగ్రెస్ పార్టీ లాగానే గోచరిస్తోంది. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావుల త్యాగాలతో పురుడు పోసుకున్న ఆ పార్టీ నెహ్రు హయాంలో ఎంతో కొంత విలువలతో ఉండేది. రాను రాను ఆయన కూతురు ఇందిరా గాంధీ హయాం వచ్చేసరికి క్రమేణా దిగజారుతూ వచ్చింది. ఎమర్జెన్సీ అనేది ఆ దిగజారుడుకు పరాకాష్ట. 1977 లో ఆ పార్టీ దానికి మూల్యాన్ని చవిచూసింది. 1980 లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఇందిరా గాంధీ ఖలిస్థాన్ తేనెతుట్టెను కదిపి సిక్కుల ఆగ్రహానికి గురై చివరకు వారి చేతిలోనే హత్యకు గురైనది. అలానే తెలుగుదేశం పార్టీ ఎన్ టీ. ఆర్ హయాంలో కొద్దో..గొప్పో విలువలతో కూడుకుని ఉండేది. ఆయన అల్లుడు చంద్రబాబు హయాంలో రాను రాను విలువలు దిగజారుతూ వచ్చాయి. చివరకు కరెంటు చార్జీలు పెంచినందుకు ఆందోళన చేసిన వారిని గుర్రాలతో తొక్కించి... పోలీస్ లతో కాల్పించి చంపించె దాకా వెళ్ళాడు. ఎన్కౌంటర్ ల పేరుతొ నక్సలైట్లను విచ్చలవిడిగా చంపించాడు. వారు అలిపిరిలో పెట్టిన మందుపాతర లో బతికి బయటపడ్డా ఆ తర్వాత 2004 లో జరిగిన ఎన్నికల్లో బతికి బట్ట కట్టలేక పోయాడు. 2009 లో వై.ఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత కాంగ్రెస్ లో ఏర్పడ్డ సందిగ్ధ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుని వారితో అనధికార జట్టు కట్టాడు. కిరణ్ కుమార్ హయాంలో రాష్ట్రంలో పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అనధికారికంగా తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉందా అన్నట్టుగా చెలాయించారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి సీటు కోసం ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని రకాల ఎత్తులు వేసి ఎన్నికల్లో గెలిచి అపర చాణిక్యుడిని అనిపించుకున్నాడు. నాలుగేళ్లు గడిచేసరికి పరిస్థితి తలకిందులైనది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షమైన బి.జె.పీ కి, జన సేనకు బద్ధ శత్రువు అయిపోయాడు.
ఇక రాష్ట్రంలో ఆయనకు మిత్రులు అంటూ ఎవరు కనపడడం లేదు. కలిస్తే... కాంగ్రెస్ తప్ప కనుచూపు మేరలో ఆయనతో కలిసే వాళ్ళు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో తెలంగాణ లో పార్టీ బతికి బట్ట కట్టాలంటే అక్కడ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో జత కడితే... వాళ్లతో సీట్లు బేరాలు ఆడి ఓ పాతిక సీట్లన్నా సంపాదించొచ్చు. అలాగే అదే మైత్రి ఇక్కడ కూడా కొనసాగిస్తే కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్లు తమ పార్టీకి వేయించుకుని మళ్ళీ అధికారం లోకి రావచ్చు అనేది చంద్రబాబు స్ట్రాటజీ. చూద్దాం. ఒక ఉదాత్త ఆశయంతో అన్న ఎన్.టీ .ఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారం కోసం ఇంకెన్ని పిల్లి మొగ్గలు వేస్తుందో..
-మానవేంద్ర
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి