ఎర్రజెండా రంగు ఇంకా చిక్కబడాలి... తెలంగాణ పోరాటంలోనూ, నైజామ్ నవాబును ఎదిరించడంలోనూ... స్వాతంత్ర్యం వచ్చాక కూడా 1960 వ దశకం వరకు... ఎర్రగా...చిక్కగా... రక్తవర్ణంలో మిల మిల మెరిసిపోతూ.. మురిసిపోయిన ఎర్ర జెండా ఆ తర్వాత క్రమేపీ రంగు వెలిసిపోతూ వచ్చింది. దీనికి కారణం... కమ్యూనిస్ట్ పార్టీ ముక్క చెక్కలై... చీలికలు, పీలికలు అవడం ఒకటి కాగా, రెండవది... కమ్యూనిస్ట్ పార్టీ తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరగడం. ఎర్రదండు ఓట్ల రాజకీయాల కోసం సిద్ధాంతాలను వదిలివేసింది. దీంతో ఎన్నికల చట్రంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా మిగతా పార్టీల్లో లాగానే అన్ని అవలక్షణాలు ప్రవేశించాయి. ఈ మార్పు తోలి దశలో వెస్ట్ బెంగాల్, కేరళ, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో అధికారాన్ని అప్పగించినా... అవే అవలక్షణాలు చివరకు ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీని గద్దె దించేలా చేశాయి. ఎర్ర జెండా ఎప్పుడైతే వెలిసిపోవడం మొదలైనదో కాషాయం అప్పుడు చిక్కబడుతూ వచ్చింది.
మన దేశంలో 1925 నుంచి ఈ రెండు జెండాలు సమాంతరంగా ఎదుగుతూ వచ్చాయి. 1920 అక్టోబర్ 17 న భారత కమ్యూనిస్ట్ పార్టీని తాశ్కెంట్ లో ఎం.ఎన్.రాయ్ స్థాపించినా ... అధికారికంగా ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26 న ఏర్పాటయింది. అయితే అదే సంవత్సరం అంతకు మూడు నెలలకు ముందే సెప్టెంబర్ 27న మన దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) ను కె.బి.హెడ్గేవార్ ప్రారంభించడం గమనార్హం. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు రాజకీయంగా కూడా బలపడుతూ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తున్న దశ లోనే 1951 ఆక్టోబర్ 21 న జనసంఘ్ ఏర్పాటయింది. కమ్యూనిస్ట్ పార్టీ కి పోటీగా జనసంఘ్ రాజకీయాలు నడుపుతూ వచ్చింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని ఎదుర్కోవడానికి ఆర్.ఎస్.ఎస్, జనసంఘ్ బలం చాలడం లేదనుకుందో ఏమో కానీ ఆ రెండిటికి తోడుగా 1964 ఆగష్టు 29 న విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించింది. ఈ విధంగా మన దేశంలో ఎర్రజెండాకు ప్రత్యామ్నాయంగా కాషాయ జెండా ఎగురుతూ వచ్చింది. ఎర్రజెండా అంటే దేశ ప్రజల్లో, ముఖ్యంగా పేద, బలహీన వర్గాల్లో ఒక ఆరాధనా భావం ఉండేది. అది ఎప్పుడైతే ఓట్ల రాజకీయంలో పడి తన మూలాల్ని వదిలేసిందో అప్పుడు ప్రజలు దానిని కూడా మిగతా పార్టీల లాగే చూడడం ప్రారంభించారు. ఈ మార్పు కాషాయం బలపడడానికి దోహదపడింది. కమ్యూనిస్ట్ పార్టీలు ఆత్మావలోకనం చేసుకుని తమ లోపాలను సవరించుకుని ఓట్లు, సీట్ల కోసం ప్రాకులాడకుండా... నిజాయితీ, సైద్దాంతిక నిబద్దతతో రాజకీయాలు నడిపితే పూర్వ వైభవం సంతరించుకోవడమే కాక... కాషాయ ఆగడాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న సి.పీ.ఎం జాతీయ మహా సభల్లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని ఎర్రజెండా అభిమానుల కోరిక.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి