మనుషుల ఇష్టాయిష్టాలు వారి వారి సొంతం... పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం... అన్నారు మహాకవి శ్రీశ్రీ. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ గతంలో హిమాలయాలకు వెళ్లినా, తపస్సు చేసినా, ఆధ్యాత్మిక ప్రబోధాలు ఉద్బోధించినా అవన్నీ ఆయన వ్యకిగత ఇష్టాయిష్టాలు గానే ప్రజలు పరిగణించారు. నటుడిగా ఆయన్ను నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టి జనం లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన సినిమాల పైనా, నిజ జీవితంలో నడవడిక పైనా ఏ విషయంపై అయినా పబ్లిక్కు ఆయన్ను ఏమైనా అనే హక్కు ఉంది.
కాలా సినిమాలో ముంబై మురికివాడల నాయకుడిగా ఆయన హీరోయిజం ప్రదర్శించాడు. ఇక్కడి వరకు ఎవరికీ పెద్ద విభేదం ఉండదు. కానీ అందులో ప్రవచించిన ఆర్య, ద్రావిడ సిద్దాంతం, రామ, రావణ పాత్రలను చిత్రీకరించిన తీరుపైనే రాద్దాంతమంతా... ఇది ఇప్పటివరకు రజని వ్యక్తిగతంగా నమ్మిన సిద్దాంతాలకు, విరుద్ధమైన భావజాలం. ఒక నటుడిగా ఎవరైనా... ఎలాంటి పాత్రలో నైనా నటించవచ్చు. మద్యం ముట్టని వారు సైతం పచ్చి తాగుబోతుగా నటించవచ్చు. అలాగే రజని తాను వ్యక్తిగతంగా నమ్మే సిద్దాంతాలకు పరస్పర విరుద్ధ భావజాలం కలిగిన పాత్రల్లో అయినా నటించవచ్చు. కానీ నిజ జీవితంలో మాత్రం నటించకూడదు. కాలా లో తాను నటించిన పాత్రపై తన వైఖరి ఏమిటో ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ తాను ఆధ్యాత్మిక వాదిగానే ఉంటాడా... హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుని వస్తాడా... బాబాలకు, యోగులకు మొక్కుతాడా... అనేది చెప్పాలి. రజని సహచరుడు కమల్ హస్సన్ ద్రావిడ సిద్దాంతంపై తన అభిప్రాయాన్ని ఏనాడో బల్ల గుద్ది చెప్పాడు. తన రంగు కాషాయం మాత్రం కాదని స్పష్టం చేసాడు. ప్రకాష్ రాజ్ కూడా అలాగే విస్పష్టంగా విన్నవించాడు. ఇప్పుడు చెప్పాల్సిన వంతు రజనీది. కొన్ని కొన్ని విషయాలపైన ఆయన వైఖరి స్పష్టం చేయక పొతే జనం ఆయన్ను నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే... నిన్న గాక మొన్న తూత్తుకుడి విషయంలో రజని ఆందోళనకారులకు వ్యతిరేకంగా... కార్పొరేట్ ను సమర్ధిస్తూ మాట్లాడాడు. మరో పక్క తమిళ నటుడు విజయ్ అర్ధరాత్రి ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, కామ్ గా వెళ్లి, తూత్తుకుడి బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఇచ్చి వచ్చాడు. సో... రజని సార్... ఇప్పడు మీరు ప్రజల్లోకి వచ్చారు కాబట్టి... ప్రజలకు సంబంధించి... ముఖ్యంగా తమిళ ప్రజలు అధిక శాతం విశ్వసించే ద్రవిడ సిద్దాంతంపై మీ వైఖరి స్పష్టం చేయాల్సి ఉంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి