రాజకీయం...అవినీతి అనేది అవిభక్త కవలల్లా పెనవేసుకుపోయిన బంధమనేది అందరకూ తెలిసిన విషయమే... ఈ రెండిటినీ విడదీయాలంటే... ఒక పెద్ద శస్త్ర చికిత్స జరగాల్సిందే... ఈ వ్యవస్థ కుళ్లిపోయింది... దీనికి శస్త్ర చికిత్స జరగాల్సిందే అని అన్నాడు శ్రీశ్రీ... ఆయన కోణం వేరు... వారిది ప్రజాస్వామ్యం మీద నమ్మకం సడలి... బ్యాలెట్ ద్వారా కాకుండా... బుల్లెట్ ద్వారా.... సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సిద్దిస్తుందనేది వారి ఆలోచన... మరి జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తి నమ్మకం కలిగి... ఆ వ్యవస్థ ద్వారానే... ప్రజల చేత ఎన్నికయిన ముఖ్యమంత్రి. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో పెనవేసుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో నిర్మూలించడం సాధ్యమేనా...
ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇండియా టుడే ప్రతినిధి రాజ్దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ నిజంగానే సంభ్రమాశ్చర్యాలను కలిగించింది. నెటిజెన్లు అయితే జగన్ ను పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. ఒకాయన అయితే జగన్ బాహుబలి అఫ్ ఆంధ్ర పొలిటికల్ హబ్ అని పేర్కొన్నారు. ఏది ఏమైనా అవినీతి రహిత రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ ను తీర్చిదిద్దుతానని, రాజకీయాలను ప్రక్షాళన చేస్తానన్న మాటలను ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో చంద్రబాబు వదిలివెళ్లిన రాష్ట్రాన్ని... ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేని రాష్ట్రాన్ని జగన్ ఎలా ఒడ్డున పడేస్తాడన్నదే ప్రజలందరి మనసుల్లో మెదులుతున్న అనుమానం. అయితే నిన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ అనేకానేక అనుమానాలు, సందేహాలను కొంతమేరకు నివృత్తి చేసింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలను తవ్వి తీసి అవినీతి టెండర్లను రద్దు చేస్తానని, ఇకపై ఇచ్చే టెండర్లన్నీ ఒక జ్యూడిషియల్ కమిటీ వేసి , ఒక సిట్టింగ్ జడ్జ్ ని వేసి ప్రతి టెండర్ ను ఆయన ముందు ఉంచి అంతా పారదర్శకంగా వ్యవహరిస్తానని చెప్పడం... ఆ విధంగా ప్రజల సొమ్ము వృధా కాకుండా చూస్తానని చెప్పడం... నిజంగా అభినందనీయం. అయితే ఇవన్నీ చేస్తూనే... ఈ ఐదేళ్లలో దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని, 2024 ఎన్నికల నాటికి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తానని చెప్పడం ఒక సాహసమే...
కానీ ఇదంతా ఆచరణలో జరిగే పనేనా... నిన్నటి ఎన్నికల్లో ఒక్కొక్క ఎం.ఎల్.ఏ 30 కోట్లు... 40 కోట్లు... 50 కోట్లు ఖర్చు పెట్టి అధికారం లోకి వచ్చారు... మరోమో... ఇప్పుడు జగన్ అవినీతి రహిత పాలన అంటున్నారు... అలాగే ఇన్నాళ్లు రాజకీయ నాయకులతో అధికారులు కుమ్మక్కయి జీతాలతో సంబంధం లేకుండా లంచాలకు మరిగి కోట్లు కూడబెట్టుకోవడానికి అలవాటు పడ్డారు... మరి ఇప్పుడు చేతులు తడుపుకోకుండా ఉండగలరా... అటు ఎం.ఎల్.ఏ లు, ఇటు అధికారులు అందరూ సహకరిస్తేనే జగన్ కల నెరవేరేది... అడుగడుగునా అవినీతి అల్లుకుపోయిన వ్యవస్థలో అవినీతి రహిత పాలన ఎలా చేయవచ్చో ఢిల్లీ లో ఆప్ పార్టీ కొంతమేరకు చూపించింది. కానీ పర్యవసానం మొన్నటి ఫలితాలు ఆ పార్టీకి పెద్ద షాక్... మరి ఇంతటి సంచలనాత్మక నిర్ణయాలు ప్రకటించిన జగన్ కు అందరూ సహకరించి జగన్ అనుకున్నవన్నీ సఫలం కావాలని భిన్నస్వరం హృదయపూర్వకంగా కోరుకుంటోంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి