ఉత్తరాది రాష్ట్రాలన్నిటి లోనూ తన సత్తా నిరూపించుకున్న బి.జె.పీ అటు కమ్యూనిస్టుల కంచుకోట వెస్ట్ బెంగాల్ లో కూడా గణనీయమైన పట్టు సంపాదించింది. ఇక ఇప్పుడు బి.జె.పీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించనుంది. ఇప్పటికే దక్షిణాదిలో కర్ణాటకలో కూడా బలంగా విస్తరించి ఉంది. మొన్నటి ఎం,పీ ఎన్నికల్లో తెలంగాణ లో సైతం నాలుగు ఎం.పీ స్థానాలను గెలిచి తన బలం నిరూపించుకుంది. తెలంగాణలో గెలిచిన నలుగురు ఎం.పీ లలో కాంగ్రెస్ నుంచి వలస వెళ్లిన డి.శ్రీనివాస్ కుమారుడు డి.అరవింద్, టి.ఆర్.ఎస్ నుంచి వెళ్లిన సోయం బాపూ రావు ఉన్నారు.
ఇక 2024 ఎన్నికల్లో ఏపీలో పాదం మోపడానికి బి.జె.పీ ఇప్పటినుంచే తన ప్రణాళిక అమలు చేయనుంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎం.ఎల్.ఏ లకు వల విసరనుంది. వారితో పాటు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రులు కూడా పలువురు ఇప్పటికే బి.జె.పే నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో సి.సి.ఐ కుంభకోణంలో ఎక్కడ సి.బి.ఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో ప్రత్తిపాటి పుల్లారావు, మైనింగ్ కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్న యరపతినేని శ్రీనివాసరావు ఆయా కేసుల నుంచి బయటపడడానికి తప్పనిసరిగా అధికార పార్టీ ఆసరా కావలసిందే... బి.జె.పీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వీరి ప్రవేశానికి సుముఖత చూపకపోవడంతో పురందేశ్వరి, కావూరి సాంబశివరావుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే విజయనగరం రాజా వంశీకుడైన అశోక గజపతిరాజు ఎన్ డి.ఏ మంత్రివర్గంలో కేంద్ర విమానయాన శాఖా మంత్రిగా చేసిన సంగతి తెలిసిందే... ఆ సమయంలో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో మంచి సంబంధాలు ఉన్నాయి. మోడీ ఇప్పుడు రాజు గారికి గవర్నర్ పదవి ఆశ చూపుతున్నట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో విజయనగరం నుంచి ఎం.పీ గా పోటీచేసి ఓడిపోయిన అశోకగజపతి రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి గవర్నర్ గా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు చరిష్మా మసకబారిపోయిన నేపథ్యంలో ఆయన నాయకత్వంపై తెలుగుదేశం పార్టీలో విశ్వాసం క్రమేణా సన్నగిల్లుతోంది. ఇదే అదనుగా బి.జె.పీ అధిష్టానం తెలుగుదేశం నాయకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అధికారానికి అలవాటు పడిన వారు ఇప్పుడు అధికారం లేకుండా ఉండలేరు... అలా అని చూస్తా...చూస్తా... వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరలేరు... కొద్దో...గొప్పో... నాలుగేళ్లు సహజీవనం చేసిన బి.జె.పీ లో చేరడానికి వారికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. సో... తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎం.ఎల్.ఏ లలో తప్పకుండా కొందరు ఎం.ఎల్.ఏ లు బి.జె.పీ బుట్టలో పడే అవకాశం ఉంది. వారితో పాటు కొందరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా బి.జె.పీ లో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విధంగా ఈ ఐదేళ్లలో బలం పుంజుకుని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ.పీ లో సొంత బలంతో ఖాతా తెరవడానికి బి.జె.పీ ఇప్పటినుంచే తన ఎత్తుగడలకు పదును పెట్టనుంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి