Translate

  • Latest News

    21, జులై 2019, ఆదివారం

    వానా కాలం వ్యాధులు ముసిరే కాలం


    ఏ టా వానా కాలంలో ఎక్కువగా డెంగీ, మలేరియా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. రెండేళ్లుగా డెంగీ వణికిస్తోంది. గతేడాది వందల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. అపరిశుభ్ర పరిసరాలు, ఓపెన్‌ నాలాలు, మురుగు నీటి నిల్వ ఉన్న చోట దోమలు పెరగడానికి అవకాశం ఎక్కువ. తొలుత దోమలను నివారించడం ద్వారా డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చు.
    మలేరియాతో జాగ్రత్త 
    మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్‌, ప్లాస్మోడియం ఫాల్సీపారమ్‌ అనేవి రెండు రకాలు. ఇందులో రెండో రకం చాలా ప్రమాదమైంది. మలేరియా లక్షణాలు కన్పించిన వెంటనే రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధా´రించి త్వరగా చికిత్స అందించాలి. లేదంటే కాలేయాన్ని, కిడ్నీలను, రక్త కణాలను దెబ్బతీస్తుంది. ఒక్కో సారి మెదడుపై దాడి చేసి రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
    కలుషిత నీటితో ముప్పు.. 
    వర్షా కాలంలో తాగు నీరు కలుషితం ఎక్కువ. ఆ నీరు తాగడం వల్ల కలరా, డయేరియా, పచ్చకామెర్లు తదితర వ్యాధులు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. ఒక్క హైదరాబాద్‌లో ఏటా 3-4 వేల డయేరియా కేసులు నమోదు అవుతుంటాయి. ఇందుకు 80 శాతం నీళ్లు, ఆహార కాలుష్యమే కారణం. ఈకోలి, ఈకోలి ఎర్సినీయా, సాల్మనెల్లా తదితర బ్యాక్టీరియా కారణంగా డయేరియా వస్తుంది.
    లక్షణాలు: రోజులో 20-25 సార్లు వాంతులు, విరోచనాలు అవుతాయి. కడుపు నొప్పి, అధిక దాహం, నోరు ఎండిపోవడం, చర్మం ముడతలు పడటం. మూత్ర విసర్జన పూర్తిగా తగ్గిపోవడం.
    వెంటనే ముదిరే కలరా..:
     విరోచనాలు ఆరంభమై కొద్ది వ్యవధిలోనే బియ్యం కడిగిన నీళ్లలా అవుతుంటే కలరాగా అనుమానించాలి. కలరా సోకితే గంటల వ్యవధిలోనే సమస్య ముదురుతుంది. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. విబ్రియో కలరే అనే బ్యాక్టీరియా ఈ వ్యాధికి కారణం.
    ఇంట్లో టైగర్‌.. ఒంట్లో ఫీవర్‌ 
    టైగర్‌ (ఈడిన్‌ ఈజిఫ్టె)గా పిలిచే దోమ వల్ల డెంగీ సోకుతుంది. నల్లగా ఒంటిపై చారలతో ఉండటం వల్ల అలా పిలుస్తారు. ఇది కుట్టిన 7-8 రోజుల తర్వాత డెంగీ లక్షణాలు కన్పిస్తాయి.
    లక్షణాలు: తీవ్రమైన జ్వరం, కళ్లు కదిలించలేని పరిస్థితి, కండరాల్లో భరించ లేని నొప్పి, వాంతులు, వికారం, రక్తంతో కూడిన మల విసర్జన, కడుపు నొప్పి ఉంటాయి. రక్తపోటుతోపాటు ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గిపోతుంది. ప్రాణాపాయం సంభవించే అవకాశమూ ఉంది. ముందే గుర్తించడం వల్ల పూర్తి స్థాయిలో చికిత్స అందించవచ్చు.
    చల్లదనంతో స్వైన్‌ ఫ్లూ 
    చల్లదనానికి స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుంది. కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైంది. పందుల్లో ఫ్లూ జ్వరానికి కారణమయ్యే ‘ఎ’ రకం (హెచ్‌1ఎన్‌1) వైరస్‌ ఇది. 2009లో ఇక్కడ కన్పించింది. 2015-16లో ఈ వ్యాధికి 200 పైగా మృతి చెందారు. ఎక్కువగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలపై ప్రభావం చూపుతుంది.
    లక్షణాలు: సాధారణ ఫ్లూలో కన్పించే లక్షణాలన్నీ ఇందులో ఉంటాయి. ముక్కు కారటం, దగ్గు, గొంతు నొప్పి, తుమ్ములు, కళ్ల వెంట నీళ్లు, జ్వరం, ఒళ్లు నొప్పులు, విరోచనాలు, వాంతులు కన్పిస్తాయి. వ్యక్తిగత పరిశుభ్రతతో ఈ వ్యాధికి దూరంగా ఉండొచ్చు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటే త్వరగా సోకడానికి ఆస్కారం ఉంది.
    తగిన జాగ్రత్తలు మేలు.. 
    వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుస్తు జాగ్రత్తల వల్ల వ్యాధులు, ఇతర రోగాలు సోకకుండా నియంత్రించవచ్చనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కాలంలో దోమలను నియంత్రించడం చాలా అవసరం.
    * దోమకాటు బారిన పడకుండా చూసుకోవడం అన్నింటికన్నా ప్రధానం. బయటకు వెళ్లేటప్పుడు కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచే బట్టలు వేసుకోవడం అవసరం.
    * ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పేరుకుపోయిన పాత సామగ్రిలో డెంగీ దోమలు పెరగకుండా చూడాలి.
    * కూలర్లు, పూల కుండీలు, నీటి డ్రమ్ములు, వాటర్‌ ట్యాంకుల్లో లార్వా పెరుగుతుంది. వీటిలో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తుండాలి.
    * సంపులపై, ట్యాంకులపై మూతలు పెట్టాలి. వారానికి ఒకసారైనా వీటిని శుభ్రం చేయడం వల్ల ఒకవేళ లార్వా ఉంటే చనిపోతుంది.
    * పాత టైర్లు, కప్పులు, పాత్రలు, కొబ్బరి చిప్పలు వంటివి పరిసరాల్లో ఉండకూడదు. ఉన్నా వెంటనే తీసివేయడం ఉత్తమం.
    * పడుకునే సమయంలో దోమ తెరలు వాడాలి.
    * ఇంట్లో కర్టెన్‌లు మార్చుతూ ఉండాలి. కిటీలకు జాలీలను అమర్చుకోవడం వల్ల చాలా వరకు దోమలు ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు.
    * దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జ్వరం వస్తే తొలుత మలేరియా లేదంటే డెంగీగా అనుమానించి వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి.
    * కలుషిత నీటి ముప్పు ఎదుర్కొనేందుకు పిల్లలకు, పెద్దలు అంతా కాచి వడపోసిన నీటిని తాగాలి. ఫిల్టర్లు పెట్టుకోవడం మంచిది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వానా కాలం వ్యాధులు ముసిరే కాలం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top