Translate

  • Latest News

    29, మార్చి 2020, ఆదివారం

    జయహో భారత్..


    ప్రపంచంలోనే జనాభాలో రెండో అతి పెద్ద దేశం మనది. చైనా తర్వాత 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశం జనాభాలోనే కాదు...ప్రపంచంలోనే అత్యంత మేధో శక్తులు కలిగిన మానవ వనరులు కలిగిన దేశం. అయితే దురదృష్టవశాత్తు... మన పాలకులు ఇక్కడ సరైన మౌలిక సౌకర్యాలు కల్పించలేని పరిస్థితుల్లో మేధో వలసతో మన వాళ్ళ తెలివితేటలన్నీ పరాయి దేశాల వారికే ఉపయోగపడుతున్నాయి. నిజంగా మన వాళ్ళ మేధస్సంతా మన దేశానికే ఉపయోగించుకుని ఉంటే ఈ పాటికే మన దేశం ప్రపంచంలో అగ్ర రాజ్యంగా భాసిల్లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇది కేవలం మన దేశ పాలకుల వైఫల్యమే... నేటికీ అమెరికా వంటి అగ్ర రాజ్యంలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ల లో కానీ, ఇతర ఫార్చూన్ 500 కంపెనీల లో కానీ మన దేశస్తులే సీఈఓ లు గా ఉన్న మాట అందరికి తెలిసిందే... అంతే కాకుండా అమెరికాలో ఉన్న ప్రముఖ వైద్యుల్లో కూడా మన వాళ్ళ శాతం చెప్పుకోదగినదే.. మన దేశ ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు వైద్యం కోసం విదేశాలకు వెళితే...తీరా అక్కడ వీరికి చికిత్స చేసింది మన దేశం నుంచి అక్కడకు వలస వెళ్లిన వారే అన్న సంగతి మనం చాలా సార్లు పత్రికల్లో చదివే ఉంటాం... 
    ప్రపంచంలోనే అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు  కలిగిన ఇటలీ, అమెరికాలే  కరోనా దెబ్బకు చిగురుటాకులా విలవిల్లాడిపోతుంటే... 130 కోట్ల జనాభా కలిగి, వైద్య సదుపాయాలు అంతగా లేని భారత దేశం పరిస్థితి దారుణంగా ఉంటుందని, మృతుల సంఖ్య లక్షల్లో ఉంటుందని గత వారం పది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఊదరగొడుతున్నారు... అయితే దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో మన వైద్యులు, నర్సులు, శాస్త్రవేత్తలు, పోలీసులు, ఇతర అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది  ప్రదర్శిస్తున్న అంకిత భావం  వేనోళ్ళ కొనియాడదగినది. 
    ఒక్క రాత్రిలో 6370 ఐసోలేషన్ బెడ్లు రెడీ... 

    చైనా కరోనా కట్టడికి కేవలం పది రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి కట్టిందని, మన వల్ల ఏమవుతుందని అనుకున్నారు.... కానీ వాళ్లు కుమారస్వాములు అయితే... మన వాళ్ళు గణపతులు...  కుమారస్వామి కష్టపడి నవలోకాలు తిరిగి వస్తే... వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి ఎంచక్కా క్రెడిట్ కొట్టేశాడు... అలాగే... మన వాళ్ళు చైనా వాళ్ళ లాగ కష్టపడి కొత్తగా ఆస్పత్రి కట్టకుండా... ఖాళీగా ఉన్న మన రైలు బోగీలనే ఐసోలేషన్ సెంటర్లుగా మార్చి వేశారు... ఇది ఏ ఒక్కరి ప్రతిభో కాదు... ఒక సామాన్యుడి బుర్రలో మెరిసిన ఈ ఆలోచన వ్వాట్సాప్ ద్వారా ఢిల్లీ పెద్దల దాకా వెళ్లడం... వారికి ఈ ఆలోచన నచ్చి... వెంటనే దానిని ఆచరణలో పెట్టడం చక చకా జరిగిపోయాయి.. దీంతో ఒక్క రాత్రిలో మన వాళ్ళు 637 కోచ్ లను ప్రస్తుతం కరోనా కోసం  6370 బెడ్స్గ మార్చి  రెడీ చేశారు...ఇది  మన వాళ్ళ మేధస్సుకు నిదర్సనం. 
    కరోనా టెస్టింగ్ కిట్ తయారు చేసిన మినాల్ దఖావే భోస్లే... 

    పూణే లో  వైరాలజిస్ట్ గా పనిచేస్తున్న మినాల్ దఖావే  భోస్లే... ప్రస్తుతం 9 నెలల గర్భిణి. ప్రెగ్నెన్సీ కారణంగా ఫిబ్రవరి నుంచి  సెలవులో ఉంది  అయినా... ఆమెకు  ఇంట్లో ఊరికే కూర్చోబుద్ది కాలేదు. దేశం కోసం ఏదో ఒకటి చేయాలని ఆమె మనసు తపించింది. ఆ తపనే ఈ రోజు ఆమెను హీరోను చేసింది. 10 మంది  టీమ్ తో కలిసి కరోనా టెస్టింగ్ కిట్ తయారు చేసింది.  దానిని మార్చి  18 న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజి (ఎన్.ఐ .వి) కి  పంపింది. ఆ తర్వాత ఇండియన్ ఎఫ్.డి.ఏ, డ్రగ్స్ కంట్రోల్ అధార్టీ లను వాణిజ్య పరంగా తయారు చేసేందుకు అనుమతి కోరింది.  వెంటనే అనుమతి లభించింది. ఈ కిట్ ద్వారా ఒకే శాంపిల్ ను పది సార్లు టెస్ట్ చేసినా ఫలితాలు ఒకేలా వస్తాయి. అందువల్ల ఈ కిట్ కు అనుమతి లభించింది.  ప్రస్తుతం మన దేశం కరోనా టెస్టింగ్ కిట్ ను విదేశాల నుంచి 4,500 రూపాయలకు దిగుమతి చేసుకుంటోంది. మినాల్  తయారు చేసిన కిట్ కేవలం   ఇప్పుడు 1200 రూపాయలకే  లభ్యమవుతోంది. ఇదంతా మినాల్ దఖావే భోస్లే ఘనతే...  దేశమంతా ఇప్పుడు  ఆమెకు నీరాజనాలు  పలుకుతోంది. 
    కరోనా తల్లో జేజమ్మ అయినా... మనకు పాదాక్రాంతం అవ్వాల్సిందే... 
    కాస్ట్మి ఓవర్ అయిందంటారా... ఏమి కాదు... మినాల్ దఖావే భోస్లే లాంటి మేధస్సు ఉన్న యువతరం, మానవ వనరులు మనకు కోకొల్లలుగా ఉన్నారు... వారంతా మనసు పెట్టి... వారికోసం...వారి కుటుంబం కోసం అని కాకుండా వారి మేధస్సును అంతా దేశం కోసం వినియోగిస్తే... మన వాళ్ళు అద్భుతాలు సృష్టించగలరనడంలో ఎటువంటి సందేహం లేదు. మీకు డౌటా... నో డౌట్ ఎటాల్. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జయహో భారత్.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top