Translate

  • Latest News

    21, ఏప్రిల్ 2020, మంగళవారం

    హ‌లీం రుచి చూసే భాగ్యం లేదు…


    మరో నాలుగు రోజుల్లో రంజాన్‌ మాసం మొదలవుతోంది. సాధారణ రోజుల్లోనైతే హలీం ప్రియులకు ఇది పండగే! రోజూ ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా హైదరాబాద్‌లో ప్రధాన హోటళ్ల ఎదుట బట్టీల నుంచి ఘుమఘుమలాడే హలీం నోరూరిస్తుంటుంది. సరదాగా బయటకు వెళ్లి.. మటన్‌, చికెన్‌తో తయారు చేసే ఈ విభిన్న వంటకాన్ని రుచి చూడాలని మతాలకు అతీతంగా మాంసాహార ప్రియులు కోరుకుంటారు. ఆ రకంగా ఇప్పటికే హలీం కోసం ప్రధాన హోటళ్ల వద్ద బట్టీల ఏర్పాట్లు, కౌంట్‌డౌన్‌ బోర్డులు, ధరల వివరాలతో కూడిన బోర్డులు కనిపించాలి. అయితే.. ఈ ఏర్పాట్లు ఎక్కడా మొదలు కాలేదు. ప్యారడైజ్‌, షాదాబ్‌, ఆదాబ్‌, నయాగరా, నాయాబ్‌, షాగౌస్‌, పిస్తాహౌజ్‌, బావర్చి, రుమాన్‌, రియాన్‌లాంటి హోటళ్లు ఇప్పటికే మూసి ఉన్నాయి. చార్మినార్‌, యాకుత్‌పురా, చంచల్‌గూడ, మలక్‌పేట్‌, సంతో్‌షనగర్‌, బాబానగర్‌, చాంద్రాయణగుట్ట, రియాసత్‌నగర్‌, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, కిషన్‌బాగ్‌, నాంపల్లి, మల్లేపల్లి, ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌, సికింద్రాబాద్‌, హైదర్‌గూడ, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, బోరబండ, మెహదీపట్నం, టోలిచౌకీ, గోల్కొండ, కార్వాన్‌ లాంటి ప్రాంతాల్లో బట్టీల ఏర్పాట్లు కనిపించడం లేదు. రంజాన్‌ నెలంతా హలీం తయారీదార్లు, వ్యాపారులు, గొర్రె, మేక మాంసం సరఫరా దారులకు చేతినిండా పని ఉంటుంది.

    ఉదయం మాంసం సిద్ధం చేసుకోవడం మొదలు కిరాణా వస్తువులు, బట్టీల్లో కట్టెలు, హలీం తయారీ.. విక్రయాలు ఇలా రోజుకు 20 గంటలపాటు కష్టపడతారు. హలీం తయారీకే 4 నుంచి 6గంటల సమయం పడుతుంది. రంజాన్‌ నెలంతా నిరంతరంగా శ్రమించే వ్యాపారులు భారీగా సంపాదించుకుని ఉత్సాహంగా పండుగ చేసుకుంటారు.  హలీం తయారీ, అమ్మకం మీద ఆధారపడ్డ లక్షలమంది కరోనా ప్రభావంతో ఈ ఏడాది  నష్టపోయినట్లే, ఉపాధి కోల్పోయినట్లే. రానున్న రోజుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేసినా... భౌతికదూరం.. పాటించాల్సిన కీలక తరుణంలో హలీం వంటకానికి ఈ సారి స్వస్తి పలకాల్సిందే. ఈ ఏడాది హలీం రుచి చూసే అవకాశం ఎవరికీ లేనట్టే... ఇందుకోసం మరో ఏడాది వేచి చూడాల్సిందే. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హ‌లీం రుచి చూసే భాగ్యం లేదు… Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top