Translate

  • Latest News

    21, ఏప్రిల్ 2020, మంగళవారం

    పోలీసుల దెబ్బ‌ల‌కు వ్య‌క్తి మృతి


    గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి వెంక‌ట‌ప‌తికాలనీకి చెందిన మహ్మద్‌ గౌస్‌ (28) సోమవారం ఉదయం మెడికల్‌ షాపునకు బయల్దేరాడు. టింబర్‌ డిపోలో పనిచేస్తున్న ఆయనకు గుండెజబ్బు ఉంది. ఇటీవల ఆపరేషన్‌  చేయించుకొని క్రమంతప్పకుండా మందులు వాడుతున్నారు.  మందుల కోసం లాక్‌డౌన్‌ విరామ సమయంలో గౌస్‌ బయటకువచ్చారు. ఆయన నివాసానికి సమీపంలోని నరసరావుపేట రోడ్డు చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అనవసరంగా రోడ్డు మీదకు ఎందుకు వచ్చావని గద్దించారు. మందులు తెచ్చుకునేందుకు వెళ్తున్నానని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఎస్‌ఐ రమేశ్‌.. గౌస్‌ను లాఠీతో కొట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలంలో కుప్పకూలిపోయిన గౌస్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులతో పాటు  స్థానికులు పెద్ద సంఖ్యలో గౌస్‌ మృతదేహంతో పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

    పోలీసుల దెబ్బలకే గౌస్‌ ప్రాణాలు పోయాయని ఆగ్రహించారు. ఏఎస్పీ చక్రవర్తి, సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి తదితరులు బాధితులతో మాట్లాడారు. డీజీపీ ఆదేశాల మేరకు ఎస్‌ఐ రమేశ్‌ను సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు. గౌస్‌ ఒంటిపై గాయాలు ఉన్నట్లు తేలితే శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీఇవ్వడంతో ఆందోళనకారులు మెత్తపడ్డారు. గౌస్‌కు భార్య, ఇరువురు చిన్నపిల్లలు ఉన్నారు.

     ముస్లిం యువకుడి మృతిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌస్‌పై పోలీసుల దాడిని ఖండించారు. ఆయన కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించరాదని, ఇలాంటి సమయాల్లో పోలీసులు, ప్రజల మధ్య సమన్వయం ఉండాలని హితవు పలికారు. విపత్కర సమయంలో అందరూ బాధ్యతగా, సోదరభావంతో వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులు చూడాలని కోరారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పోలీసుల దెబ్బ‌ల‌కు వ్య‌క్తి మృతి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top