Translate

  • Latest News

    6, ఏప్రిల్ 2020, సోమవారం

    చిన్న సినిమాలకు వరం కానున్న ఓ.టి.టి


    దృశ్య మాధ్యమంలో వచ్చిన విప్లవాత్మక పరిణామం ఓ.టి.టి.. (ఓవర్ ద టాప్ ). ప్రేక్షకులు సినిమాలు చూడడం కోసం థియేటర్లకు వెళ్లకుండా... ఇంట్లోనే ... అది కూడా కేబుల్ నెట్వర్క్, బ్రాడ్ కాస్ట్, శాటిలైట్ ప్లాట్ ఫామ్ లను అన్నిటిని బైపాస్ చేసి, కేవలం ఇంటర్నెట్ సదుపాయంతో  ఏడాదికి  నామమాత్రపు రుసుముతో (దాదాపుగా ఉచితంగా) చూసే అవకాశం కల్పించడం... సరే ప్రేక్షకులకు ఇది పరమానందమే.... అయితే ఓ.టి.టి ప్రేక్షకులకే కాదు... చిన్న, లో బడ్జెట్ నిర్మాతలకు, ఔత్సాహిక సినీ నిర్మాతలకు, దర్శకులకు కూడా వరం కానుంది. ఇప్పటివరకు ఎవరన్నా ఔత్సాహికులు కష్టపడి సినిమా తీసినా అది విడుదల చేద్దామంటే థియేటర్లు దొరికేవి కావు... ఎవరన్నా పెద్ద నిర్మాతలు దయతలిస్తే ఎలాగోలా కనీసం జిల్లా కేంద్రంలో ఒక ధియేటర్ ఇప్పిస్తే... ఎలాగో విడుదల చేశాం అనిపించుకునే వాళ్ళు. అది కూడా కుదరక ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోకుండా డబ్బాల్లోనే ఉండిపోయేవి... అయితే ఇప్పుడు ఓ.టి.టి రావడం నిజంగా చిన్న నిర్మాతలకు వర ప్రసాదమే... ఎలాగోలా కష్టపడి సినిమా తీస్తే చాలు... దానిని డైరెక్టుగా ఓ.టి.టి లోనే విడుదల చేసుకోవచ్చు. ఓ.టి.టి యజమానులు దానిని కొని  వాళ్లే ప్రసారం చేసుకుంటారు. చిన్న నిర్మాతలకు వాళ్ళ డబ్బులు వాళ్లకు వచ్చేస్తాయి. అంతే కాదు....చిన్న చిన్న షార్ట్ ఫిలిం లు తీస్తున్న నేటి యువతరం కూడా ఇంకాస్త రిస్క్ చేసి మినిమం  బడ్జెట్లో చలనచిత్రం తీసే సాహసం చేయవచ్చు. అప్పుడు కేవలం కమర్షియల్, మాస్ మసాలా సినిమాలు కాకుండా తమిళ్, మలయాళం లో లాగా కాస్త వాస్తవికతతో కూడిన సినిమాలు రావడానికి కూడా అవకాశం ఉంది. మంచి సినిమాలను కోరుకునే ప్రేక్షకులకు కూడా ఇది శుభ పరిణామమే.
    ఆమెజాన్  ప్రైమ్, ఆహా తరహాలో మరికొందరు వచ్చే అవకాశం
    ఇప్పటికే జాతీయ స్థాయిలో ఈ విధంగా చాలా వచ్చాయి. అమెజాన్, నెట్ ఫ్లెక్స్, సన్ నెక్స్ట్, హాట్ స్టార్ వంటివి ఎన్నో ఉన్నాయి.  తెలుగు సినిమాలు మాత్రం నిన్న మొన్నటి దాకా ఒక్క అమెజాన్ ప్రైమ్ లోనే ఉండేవి. అమెజాన్ ప్రైమ్ ఏడాది చందా వెయ్యి రూపాయలు. ఇటీవల అల్లు అరవింద్ ఆమెజాన్  ప్రైమ్ తరహాలోనే ఆహా అని ఓ.టి.టి ఒకటి పెట్టాడు. ఏడాది చందా కేవలం 365 రూపాయలు మాత్రమే పెట్టాడు. కేవలం 3 నెలల్లోనే 5 లక్షల సబ్స్క్రిప్షన్లు వచ్చాయంటే ఈ ప్లాట్ ఫామ్ కి ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో తెలుస్తోంది. దీనిని చూసి భవిష్యత్తులో మరి కొందరు కూడా ఓ.టి.టి బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. వీటిలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా పెడుతున్నారు. హిందీలో ఇప్పటికే ఇవి బాగా పాపులర్ అయిపోయాయి. బాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోలు, హీరోయిన్లు కూడా డిజిటల్ ప్లాట్  ఫామ్ లోకి దిగిపోయి వెబ్ సిరీస్ లలో యాక్టు చేస్తున్నారు. తమిళ్ లో కూడా మొదలయింది. తెలుగులో కూడా అతి త్వరలోనే ఆ పరిణామాలు రావచ్చు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చిన్న సినిమాలకు వరం కానున్న ఓ.టి.టి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top