ఆయన బహు భాషా వేత్త.. ప్రపంచంలోని 17 భాషలు మాట్లాడగలిగిన ఒకే ఒక్క రాజకీయ వేత్త... తన మాతృ భాష అయిన తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడ, మరాఠి, హిందీ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, ఉర్దూ భాషల్లో నిష్ణాతుడు... అంతే కాదు... ఇంగ్లీష్, ఫ్రెంచి, స్పానిష్, జర్మన్, పర్షియన్, అరబిక్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి. విశ్వనాదః సత్యన్నారాయణ కు జ్ఞాన్ పీఠ్ అవార్డు వచ్చిన తెలుగు నవల వెయ్యి పడగలు ను హిందీ లో అనువాదం చేసిన పండితుడు. ... ప్రధానిగా ఉన్న సమయంలో స్పెయిన్ వెళ్ళినపుడు ఆ దేశ ప్రధానితో స్పెయిన్ లో మాట్లాడి అబ్బురపరిచిన వ్యక్తి.
సాహితీ పిపాసకుడు...
రాజకీయం... సాహిత్యం... ఈ రెండూ భిన్న ధృవాలు... అయినప్పటికీ రెండిటినీ ఏక కాలంలో సమర్ధవంతంగా నిర్వహించగలగడం ఆయనకే చెల్లు... ఆఖరికి ప్రధాన మంత్రి పదవి నుంచి దిగాక ఓ పక్క కేసులు, కోర్టుల చుట్టు తిరుగుతూ కూడా 80 ఏళ్ల వయసులో తెలుగులో జయప్రభ రాసిన ప్రేమ కవిత్వాన్ని ఇంగ్లిష్ లోకి అనువదించారంటే ఆయన సాహిత్య పిపాసను అర్ధం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో తంతే... కేంద్రం బూరెల గంపలో పడ్డాడు...
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూ సంస్కరణలు ప్రవేశపెట్టి సొంత పార్టీ లోనే తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నాడు... మరి పేదలకు మంచి చేస్తానంటే మన రాజకీయ నాయకులు ఊరుకుంటారా... ముఖ్యమంత్రి గద్దె నుంచి దించి... ఆ స్థానంలో వెలమ దొర వెంగళ రావును కూర్చోబెట్టారు... అదే పి.వి. కి వర ప్రసాదమయింది. ఆయన లోని అపార ప్రతిభా పాటవాలను గుర్తించిన ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు సముచిత స్థానం కల్పించింది. ముందు ఏ.ఐ.సి.సి లోకి తీసుకుంది... తర్వాత ఇక కేంద్రంలో ఆయన ఏ మంత్రిత్వ శాఖ చేపడితే... ఆ శాఖ ను సమర్ధవంతంగా నిర్వహించాడు. పదవుల్ని ఆయన కోరుకోలేదు... పదవులే ఒక్కొక్కటిగా వచ్చి ఆయన ఒళ్ళో పడ్డాయి.. చివరకు ప్రధాన మంత్రి పదవి కూడా అలాగే... కీలక సమయంలో ప్రధాని పదవి చేపట్టి... అటు పార్టీని...ఇటు దేశాన్ని కూడా ఒడ్డున పడేశాడు.. ఆయన హయాం లోనే నవోదయ విద్యాలయాలు వచ్చాయి. రక్షణ రంగంలో ఆయన వేసిన పునాదుల తోనే ఆయన అనంతరం వాజ్ పేయ్ ప్రధాని అవగానే పోఖ్రాన్ అణు పరీక్ష చేయగలిగాడు... పేరు వాజ్ పేయ్ కి వచ్చినా... నిజానికి ఆ క్రెడిట్ అంతా పి.వి. దే .
దేశ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసిన దార్శనికుడు...
మన దేశ రాజకీయ ముఖచిత్రంపై పి.వి.నరసింహారావు ఒక అరుదయిన వ్యక్తి... ఆర్ధిక సంస్కరణల ద్వారా దేశాన్ని 21వ శతాబ్దానికి తీసుకువెళ్ళడానికి పునాదులు వేసిన దార్శనికుడు. ఆర్ధికంగా కుదేలు అయిపోయి... దేశంలో బంగారం నిల్వలు కూడా తాకట్టు పెట్టిన దుర్భర స్థితిలో ఉన్న దేశాన్ని ఆ దుస్థితి నుంచి గట్టెక్కించిన పాలనాదక్షుడు. ఆయనకు సాటి మరెవరూ లేరు. ఈనాడు మనం అనుభవిస్తున్న గ్లోబలైజేషన్ ఫలాలన్నీ ఆయన పుణ్యమే... ప్రపంచీకరణకు ఆద్యుడు అని పొగిడినా... గ్లోబలైజేషన్ కు బీజాలు వేసి...దేశంలో ఇప్పటి సర్వ అవలక్షణాలకు... దుస్థితికి కారకుడు అని కమ్యూనిస్టులు శాపనార్ధాలు పెట్టినా అన్నీ ఆయనకే చెందుతాయి... కాంగ్రెస్ పార్టీలో గాంధీయేతర కుటుంబం నుంచి వచ్చి ఐదేళ్లు దేశ ప్రధాని గ చేసిన మొట్టమొదటి వ్యక్తి... (ఆ తరవాత ఆయన తీసుకువచ్చిన మన్మోహన్ సింగ్ పదేళ్లు చేసినా ఆ ఘనత కూడా పి. వి. కే దక్కుతుంది.) అయితే అదే ఆయనకు శాపం అయింది... అధికారాన్ని గాంధీ కుటుంబానికి దూరం చేశాడని సోనియా గాంధీ ఆయనపై కక్ష గట్టింది... ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ఆయనపై కేసులు పెట్టి వేధించింది. 80 ఏళ్ల వయసులో కోర్టుల చుట్టూ తిప్పించింది. చివరకు ఆయన చనిపోయాక ఆయన పార్థివ మృతదేహాన్ని కూడా ఢిల్లీ లో ఉండనీయకుండా హడావుడిగా హైదరాబాద్ కు పంపించేసింది... నిజానికి దేశ ప్రధానులుగా చేసిన వారు అందరికి ఢిల్లీ లోనే ఘాట్ లు కేటాయించవలసి ఉంది.. ఆ సాంప్రదాయాన్ని కూడా తోసిరాజని సోనియమ్మ పి. వి పట్ల చాలా దారుణంగా వ్యవహరించింది.. ఎవరు ఏమి చేసినా... చరిత్రను చేత్తో తుడిపేయడం ఎవరి వల్ల కాదు... ఈ రోజు పి.వి. శత జయంతి ఉత్సవాలు ప్రపంచంలో 50 దేశాల్లో జరుగుతున్నాయంటేనే ఆయన గొప్పదనం అర్ధం చేసుకోవచ్చు... కానీ ఎన్ని చేసినా... ఆయనకు భారత రత్న ప్రకటిస్తేనే ఆయనకు జాతి ఇచ్చే ఘనమైన నివాళి అవుతుంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి