Translate

  • Latest News

    2, జులై 2020, గురువారం

    లాక్ డౌన్ భయంతోనే ఏపీ వైపు పరుగులు


    లాక్‌డౌన్...  ఈ పేరు వింటే చాలు ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. గ‌త లాక్‌డౌన్ అనుభ‌వాల‌ను గుర్తు చేసుకొని భ‌విష్య‌త్తును బేరిజు వేసుకుని భయపడుతున్నారు. తెలంగాణలో మ‌రోసారి క‌ఠిన లాక్‌డౌన్ అమ‌లు అవుతుంద‌న్న స‌మాచారం అక్క‌డి ప్ర‌జ‌ల్లో భ‌యాన్ని నింపుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏ క్షణంలో అయినా లాక్ డౌన్ ప్రకటించే ప్రమాదం ముంచుకువస్తోంది. ఈ నేపథ్యంలో  తెలంగాణాలో ఉన్నఏపీ  ప్ర‌జ‌లు బ‌తుకు జీవుడా అని ఎప్పుడెప్పుడు అక్క‌డి నుంచి బ‌య‌ట పడదామా అని  స‌రిహ‌ద్దుకు చేరుకుంటున్నారు. మ‌రోవైపు ఏపీ ప్ర‌భుత్వం పాసులు ఉంటేనే రాష్ట్రంలోకి అడుగు పెట్టాల‌ని, అదీ ఉద‌యం 7గంట‌ల నుంచి రాత్రి 7లోపు మాత్ర‌మే స‌రిహ‌ద్దువ‌ద్ద అనుమ‌తి ఇస్తామ‌ని తేల్చిచెప్పింది.  దీంతో సరిహద్దుల్లో మళ్ళీ అలజడి మొదలైనది... సరిహద్దులు అంటే ఇండియా..చైనా సరిహద్దు కాదండోయ్... ఆంద్ర...తెలంగాణ సరిహద్దులు...
     హైదరాబాద్ లో సెటిలర్స్ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు కావడంతో జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని  డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. సరిహద్దు లోకి వచ్చిన వారికి ఈ పాస్ పరిశీలిస్తామని, అలాగే వారిని క్వారంటైన్ కి తరలిస్తామని,వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి హోమ్ క్వారంటైన్ కు  అయినా అంగీకరిస్తామని అంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి  వచ్చిన వారికి సరిహద్దుల్లో ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే వారిని అనుమతిస్తామని  పేర్కొన్నారు.అంతే కాదు రాత్రి 7 గంటలు దాటిన తర్వాత పాసులు ఉన్న వారిని సైతం అనుమతించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
     తెలంగాణ  రాష్ట్రం నుంచి ఏపీలోకి ప్ర‌వేశించ‌టానికి పాస్ త‌ప్ప‌నిస‌రి కావ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌ల అగ‌చాట్లు, ఇబ్బందులు చెప్పనలవి కాదు.  స్పంద‌న యాప్  నుంచి ఏపీలోకి అడుగు పెట్ట‌డానికి పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అయితే ఒక్క‌సారిగా  సైట్‌కు ర‌ద్దీ పెరిగి సైట్ ఓపెన్ కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక వేళ ఓపెన్ అయి దరఖాస్తు చేసుకున్నా కేవలం మెడికల్ గ్రౌండ్స్ ఉంటేనే పాస్ ఇస్తున్నారు... అదీనూ... దరఖాస్తుదారు తాలూకూ వ్యక్తులు చనిపోయారని పెడితే... డెడ్ బాడీ ఫోటో అటాచ్ చేయాలంటున్నారు. లేదూ... హాస్పిటల్ లో ట్రీట్మెంట్ లో ఉన్నారంటే... హాస్పిటల్ మెడికల్ సమ్మరీ ఫైల్ అటాచ్ చేయమంటున్నారు... అంతా చేసి పాస్ వచ్చి వెళ్లినా మళ్ళీ సరిహద్దుల్లో స్క్రీనింగ్ పేరుతొ 2 గంటలపాటు పడిగాపులు పడవలసివస్తోంది. మెడికల్ ఎవిడెన్స్ లు లేని వారు ఏదో ఒక రకంగా దొంగ చాటుగా రావాల్సిందే... దీంతో చాలామంది. అవతలి వైపు సరిహద్దు దాకా కారులో వచ్చి అక్కడ దిగి ఓ రెండు, మూడు కిలోమీటర్లు నడిచి , ఇవతల తమ వాళ్ళతో కారు తెప్పించుకుని ఆ కారులో ఎంచక్కా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. మన దేశంలో చట్టాలు...చట్టాలే... అడ్డ దారులు... అడ్డ దారులే.... చట్టాలకు బొక్కలేరడంలో మనవాళ్ళు మహా ముదుర్లు అన్న సంగతి వేరే చెప్పాలా...
    ఏది ఏమైనా... క‌ష్ట‌కాలంలో ఎవ‌రైనా త‌మ వాళ్ల‌తో క‌లిసి ఉండాల‌ను కుంటారు. ఇది సామాజిక జీవిగా ఉన్న మ‌నిషి ప్రాథమిక వాంఛ‌. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇలా ఆశించ‌టం త‌ప్పుకూడా కాదు. కాని ప్ర‌స్తుతం ఆ చిన్న కోరిక నెర‌వేర‌టం కూడా  గగనంగా మారటం  ఈ ప్రజాస్వామ్య దేశంలో అత్యంత విషాదకరం. 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: లాక్ డౌన్ భయంతోనే ఏపీ వైపు పరుగులు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top