Translate

  • Latest News

    7, జులై 2020, మంగళవారం

    ఈ మార్పు మంచిదే...


    చైనాతో ఏర్ప‌డిన ఉద్రిక్తతల న‌డుమ ఇప్పుడు స్వ‌దేశీ వ‌స్తువులు వాడాల‌ని, స్వ‌దేశీ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించాల‌ని ఆశించ‌టం త‌ప్పుకాదు. స్వ‌దేశీ సాంకేతిక ప‌రిజ్ఞానం పెంచుకోవ‌టానికి ప్ర‌భుత్వం ఎప్పుడైతే స‌మాయత్త‌మ‌యిందో  అప్పుడే దేశంలో ఉన్న యువ‌త త‌మ సామ‌ర్ధ్యాన్ని పెంచుకొనేందుకు వీలౌతుంది. టిక్‌టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌‌ను భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ ఇటీవల భారత ప్రభుత్వం నిషేధించింది. 
    చైనాకు చెందిన 59 యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో దేశీ యాప్స్‌కి ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. షేర్‌చాట్, రొపొసొ, చింగారీ మొదలైన యాప్స్‌ డౌన్‌లోడ్లు, యూజర్‌ సైన్‌ అప్స్ గణనీయంగా ‌ పెరిగాయి. గడిచిన వారం  రోజుల్లో భారీ వృద్ధి నమోదు చేసినట్లు ప్రాంతీయ భాషల్లోని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం షేర్‌చాట్‌ వెల్లడించింది. వీటిలో ముఖ్యంగా చింగారి అప్ డౌన్లోడ్స్ గత వారం రోజుల్లో 10 మిలియన్లు దాటాయి. భారీ ప్లాట్‌ఫాం రూపొందించే దిశగా భారతీయ డెవలపర్లకు ఈ నిషేధంతో మంచి అవకాశాలు దొరికినట్లయింది. ఇలాంటి పలు యాప్స్‌ ప్రస్తుతం ప్రారంభ స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయ దిగ్గజాల్లాగే స్థానిక డెవలపర్లకు కూడా అవకాశాలు దొరికే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే జూమ్ యాప్ కు బదులుగా కొత్తగా వీడియో మీట్ అనే స్వదేశీ యాప్ వచ్చేసింది. దీంతో ఒకేసారి 2 వేల మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించవచ్చు. రాజస్థాన్ కు చెందిన డేటా ఇంజినియస్ గ్లోబల్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. పైగా దీనిని ఉచితంగా వాడుకోవచ్చట. ఈ యాప్ ఆడియో, వీడియో అనుమతులు మాత్రమే తీసుకుంటుంది. గోప్యతకు ఎటువంటి ప్రమాదం లేదని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. 
    గ‌తం నుంచి విదేశీ  వ‌స్తువులంటే మ‌న‌కు మ‌క్కువ ఎక్కువే. దీంతో పాటు చైనాతో స‌హా అనేక దేశాల‌కు భార‌త్ ఒక వాణిజ్య కేంద్రం. అనేక ఎల‌క్ట్రానిక్ వస్తువుల మొద‌లు పిల్లలు ఆడుకొనే ఆట బొమ్మ‌ల వ‌ర‌కు చైనా నుంచే దిగుమ‌తి అవుతుంటాయి. స్వ‌దేశీ మార్కెట్‌లో త‌యార‌య్యే వ‌స్తువుల క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే ల‌భ్య‌మౌతుంటాయి.  ఒక్క ఫోన్ల విష‌య‌మే తీసుకుంటే మ‌న  స్వ‌దేశీ మార్కెట్‌లో ఉన్న ఫోన్ల క‌న్నా చైనా ఫోన్లే మ‌న మార్కెట్‌లో అత్య‌ధిక వాటా క‌లిగి ఉంటాయి. మిగిలిన దేశాల్లో ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఉంటుంది. అక్క‌డి వ‌స్తువులు, స్థానికంగా  తయారయ్యే వాటికే డిమాండ్ ఉంటుంది. ఇండియా ‌లోనే ఇటువంటి ప‌రిస్థితి ఎందుకు ఉంటుంద‌న్న విష‌యంలో మ‌నం పున‌రాలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. చైనా కంటే ఏవిధంగా తీసిపోని రీతిలో అద్బుత మైన సామ‌ర్ధ్యాలు ఉన్న భార‌త్‌లో కొత్త ఆలోచ‌న‌ల‌ను ఆవిష్క‌రించ‌టానికి, నూత‌న వ‌స్తువుల తయారీకి ప్ర‌తిబంధంగా  ఉన్న అడ్డంకులు ఏమిటిన్న విష‌యంపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌ర‌గాలి. ఇది చైనాతో వైరంతో, మ‌రో ఇత‌ర తాత్కాలిక విష‌యాల‌తోనే అలోచించాల్సిన విష‌యం కాదు.  స్వ‌దేశీ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌భుత్వం ప్రోత్సాహం అందించి చూడమనండి.. ప్ర‌పంచంలో అద్బుత‌మైన అవిష్క‌రణలు  ఇండియానుంచే మొద‌లౌతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఈ మార్పు మంచిదే... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top