ప్రజలకు చేరువకావటానికి ఇటు అధికారంలో ఉన్న టీడీపీ , అటు ప్రతి పక్షంలో ఉన్న వైకాపా రెండు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన కార్యక్రమాలు అట్టర్ ప్లాప్ షో లు గా మిగిలాయి. అధికారంలో ఉన్న టీడీపీ తన మూడున్నర ఏళ్ల పాలనలో చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలు వివరించి వారి మద్దతు కోరటానికి చేపట్టిన పథకం ఇంటింటికి తెలుగుదేశం. ఈ పథకంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నాయకులు మొదలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ పథకంలో భాగస్వాములు కావాలి. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు అప్లోడ్చేయాలి. ఇది కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఉద్దేశం మంచిదే కాని ఆచరణలో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో సక్సెస్కాలేకపోయింది. కిందిస్థాయి క్యాడర్ పనిచేయకపోవటం, మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన సమయంలో మాత్రమే గానాభజన చేసి వారు లేని సమయంలో మిన్నకుండి పోయారు. దీంతో పాటు పార్టీలో ఉన్న అసంతృప్తి కూడా కార్యక్రమ పరాజయానికి కారణమైందని చెబుతున్నారు. దీంతో పార్టీ అధినేత , సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాలఉప ఎన్నికలు, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలతో డీలాపడ్డపడ్డ వైకాపాఆధ్వర్యంలో కొనసాగిన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం సైతం ముందుకు సాగటంలేదు. గతంలో గుంటూరు జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత జగన్ నవరత్నాలను ప్రవేశపెట్టారు. ఈ నవరత్నాలను పూర్తి స్థాయిలో ప్రజల్లో తీసుకువెళ్లటం, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలచేత ప్రజాబ్యాలెట్ పూర్తి చేయించి వారి చేత మార్కులు వేయటం , వారిని పార్టీలో చేర్చటం ఇది వైకాపా కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఎన్నికల ఫలితాలతో స్థబ్దత ఆవరించిన క్యాడర్ పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మమ అనిపించారు. దీంతో వైకాపా కార్యక్రమం కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. అధికార పార్టీకి భయపడి ప్రభుత్వ పథకాలు తొలగిస్తారన్న అందోళనతో ప్రజలు సహకరించలేకపోయారు. కార్యకర్తలు, నాయకుల తీరు కూడా ఇలాగే ఉండటంతో ఈ కార్యక్రమం విజయవంతం కాలేదు. రానున్న ఎన్నికలన దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లటానికి ఏర్పాటు చేసుకొన్న రెండు పార్టీల కార్యక్రమాలు ప్రజలకు చేరువకాకపోవటంతో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకుల్లో అంతర్మధనం మొదలయింది
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి