Translate

  • Latest News

    9, అక్టోబర్ 2017, సోమవారం

    అయిపోయిన పెళ్లికి భాజా భంత్రి ... మరోసారి ప్రత్యేక హోదా పై జగన్ పోరుబాట


    అయిపోయిన పెళ్లికి భాజా భంత్రి .. అన్న చందంగా మారింది . వైకాపా పరిస్థితి .  రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని స్పష్టం చేసి ప్యాకేజి తో సరిపెట్టు కోవాలని గతం లో మోడీ సర్కార్ స్పష్టం చేసిన తరుణంలో  మిన్నకుండి పోయారు.  అప్పుడే  హోదాను ఇవ్వని కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే బావుండేది. ఇప్పుడు మరోసారి యువత వద్దకు వెళ్లేందుకు వైకాపా నిర్ణయించడం వ్యూహాంలో భాగమేనంటున్నారు.  రాష్ట్రపతి,  ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వకుండా నిరసన తెలిపి ఉంటే వైకాపా ఖ్యాతి పెరిగేది. కానీ అలా చేయకుండా ఇప్పుడు తిరిగి హోదా సంగతిని ప్రస్తావించడం రాజకీయంగా లబ్ది పొందడానికే అన్న వాదన సాగుతోంది. 
    ప్రత్యేక హోదా ఇవ్వని మోడీ సర్కార్ పై  జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని, అసంతృప్తి ని  తనకు అనుకూలంగా వాడుకోవచ్చు. . అడగకముందే అందరికన్నా ముందు రాష్ట్రపతి పదవికై బిజెపి అభ్యర్థికి జగన్ మద్ధతు పలికారు. రాష్ట్రంలో ఎన్డీఏ తో పోరాడుతూ అదే కూటమి అభ్యర్థికి వైకాపా   ఓటు వేసి వ్యూహత్మక తప్పిదానికి పాల్పడింది.  రాజకీయేతర అవసరాలే ఇందుకు దోహదపడ్డాయని విమర్శలు వెల్లువెత్తాయి .  ప్రత్యేక హోదా ఇస్తేనే మద్ధతునిస్తామన్న కనీస షరతు అయినా పెట్టి వుంటే వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు లాభం ఉండేది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు తమ ఎంపీలు రాజీనామా కూడా చేస్తారంటూ గతంలో జగన్ అల్టిమేటం ఇచ్చారు. కానీ అది మర్చిపోయి బేషరతుగా బిజెపి సరసన చేరారు.
    వాస్తవానికి ప్రత్యేక హోదా కోసం జగన్  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే నన్న   ప్రజల ఆకాంక్షను వివిధ రూపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు.  ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, నిరసనలు ఇలా పలు  మార్గాల్లో పోరాటం సాగించారు . విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో సీఎం చంద్రబాబు మౌనం పాటిస్తే  ప్రతిపక్ష నేతగా  జగన్  ఒక్కరే  గళమెత్తారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా... అని చంద్రబాబు వ్యాఖ్యలు చేసినా  జగన్‌  వెనకడుగు వేయలేదు.  ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఒక రోజు ధర్నా చేశారు.  మార్చ్‌ టు పార్లమెంట్‌ను నిర్వహించి ఢిల్లీ వీధుల్లో అరెస్టయ్యారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి తానే స్వయంగా నిరవధిక నిరాహార దీక్ష చేశారు.   పలుచోట్ల యువకులతో యువభేరి సదస్సులను నిర్వహించారు .ఇక ధర్నాలు ,దీక్షలు ,బంద్ లు ఎన్నో జరిగాయి .  ప్రధానిని ,కేంద్ర మంత్రులను కలసి హోదా అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు.ఎన్ని చేసినా కేంద్రం దిగి రాలేదు . కానీ ఇప్పుడు మరోసారి ప్రత్యేక హోదా పై పోరుబాట పట్టేందుకు ఆ పార్టీ సమయాత్తమవుతోంది. అయితే గతంలో మాదిరి అనుకున్న మేర ప్రజా స్పందన ఉంటుందా అనేది సందేహమే . 

                                                                                      -మానవేంద్ర 


             
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అయిపోయిన పెళ్లికి భాజా భంత్రి ... మరోసారి ప్రత్యేక హోదా పై జగన్ పోరుబాట Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top