Translate

  • Latest News

    17, సెప్టెంబర్ 2020, గురువారం

    యండమూరి రాంగోపాల్ వర్మ



    అదేమిటీ... ఇద్దరి పేర్లు కలిపేశారు అనుకుంటున్నారా... అవును నిజమే.. యండమూరి వీరేంద్రనాధ్ ప్రముఖ రచయిత. పెన్మెత్స రామ్ గోపాల్ వర్మ ప్రముఖ సినీ  దర్శకుడు. మరి వీరిద్దరి పేర్లు ఎందుకు కలిపి రాశానంటే...వీరిద్దరిలో చాలా కామన్ థింగ్స్ (సారూప్యాలు) ఉన్నాయి.  వీరిద్దరూ వారి వారి రంగాల్లో  అద్భుత ప్రతిభా పాటవాలు కలిగినవారు. యండమూరి తన రచనలతో కోట్లాది మంది పాఠకుల మనసు దోచుకున్నాడు. వర్మ తన సినిమాలతో కోట్లాది  ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు. కానీ ఇద్దరూ పూర్తి కమర్షియల్ దృక్పధం కలవారు. తమ రచనలను లేదా సినిమాలను పాపులర్ చేసుకోవడానికి చీప్ ట్రిక్ లు అవలంబించినవారే. అందుకోసం తమ ప్రతిభను పక్క దారి పట్టించిన వారే... వెన్నెల్లో ఆడపిల్ల లాంటి అద్భుత మైన రొమాంటిక్ నవల రాసిన యండమూరి తులసి దళం లాంటి క్షుద్ర పూజలకు సంబంధించిన నవల రాసి విమర్శలకు గురయ్యాడు. రచయితగా తొలి రోజుల్లోనే ఓ పాఠకురాలి ఆత్మ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తులసి దళం తోనే ఆయన ప్రతిభ అణగారి పోలేదు... ఆ తర్వాత అంతర్ముఖం లాంటి గొప్ప నవలను పాఠకులకు అందించాడు. ఆ తర్వాత పూర్తిగా కమర్షియల్ బాట పట్ట్టాడు. వ్యక్తిత్వ వికాస పుస్తకాల వైపు దృష్టి సారించాడు.  అది కాక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందలాది విద్యా సంస్థల్లో కౌన్సిలింగ్ ఉపన్యాసాలు ఇస్తూ లక్షలు గడిస్తున్నాడు. నిజానికి ఆయనకు సంపాదన లేక కాదు. ఆయన పేరున్న చార్టెడ్ అకౌంటెంట్... పైగా ఇప్పుడు ఆయన కొడుకు సంపాదన చూస్తే వార్షిక వేతనం కోట్లలోనే... కానీ యండమూరి కి అదో  పిచ్చి.. వ్యసనం...  ఎప్పటికప్పుడు పాఠకుల ఆసక్తిని గమనించి అందుకు అనుగుణంగా రచనలు చేస్తూ ఆర్జన చేయడంలో ఆయనకు సాటి తెలుగునాట మరెవరూ లేరు.
    ఇక రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతూ పెడుతూనే  శివ సినిమాతో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఆ తర్వాత క్షణ క్షణం, గాయం,  అంతం  లాంటి సినిమాలతో తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. ఆ అనంతరం రంగీలా తో బాలీవుడ్ లో ఎంటర్ అయి సత్య, సర్కార్, కంపెనీ లాంటి సినిమాలు తీసి రికార్డులు సృష్టించాడు. ఇంతవరకు బాగానే ఉంది.  ఆ తర్వాతే పక్క దారి పట్టాడు. కేవలం సంచలనాల పైనే దృష్టి పెట్టాడు. రక్త చరిత్ర, వంగవీటి లాంటి నిజజీవిత గాధల్ని తీసి చీప్ పబ్లిసిటీ తో పబ్బం గడుపుకోవడం మొదలెట్టాడు. ఇది కొంతవరకు నయం అనుకుంటే... ఇప్పుడు పూర్తిగా సెమి పోర్న్ సినిమాలు తీస్తూ ప్రజల బలహీనతలతో ఆటలాడుకుంటున్నాడు. ఆడది అయన దృష్టిలో భోగ వస్తువు మాత్రమే.
    కాకపొతే... యండమూరి, రామ్ గోపాల్ వర్మ ఇద్దరిలో ఉన్న గొప్ప విషయం ఏమిటి అంటే ఇద్దరూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారు. వర్తమానంలో వస్తున్న నవీన ధోరణులను, సాంకేతికతను అంది పుచ్చుకుంటారు.  నూతన ఆవిష్కరణలను తమకు అనుకూలంగా మార్చుకుని వాటిని సొమ్ము చేసుకుంటారు. ఈ విషయంలో వీరిద్దరిని మెచ్చుకోక తప్పదు. వర్మ కరోనా కాలంలో కూడా నెలకో సినిమా తీసి దానిని అంతర్జాలంలో పెట్టి, సినిమాకు రేటు కట్టి డబ్బులు చెల్లించి చూసే విధానం పెట్టాడు. తన సినిమాలు చూడాలనుకున్నవాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళే చూస్తారని ధీమా ఆయనది. అలాగే ఇప్పుడు యండమూరి కూడా ఆన్లైన్ ప్లాట్ ఫారం మీదకు వచ్చేశాడు. నిశ్శబ్ద విస్ఫోటనం పేరుతొ ఒక ఆన్ లైన్ సీరియల్ మొదలు పెడుతున్నాడు. సామాజిక అరాచకాలపై పోరాడిన ఒక చిన్న స్కూల్ టీచర్ కథ  అట... ఇది చదవాలనుకున్న వాళ్ళు డబ్బులు చెల్లించి చదవాల్సిందే. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ, యండమూరి వీరేంద్ర నాధ్ ఇద్దరూ ఇద్దరే.. మహా ముదుర్లు...
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: యండమూరి రాంగోపాల్ వర్మ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top