Translate

  • Latest News

    25, జనవరి 2021, సోమవారం

    హంతకులు తల్లిదండ్రులా... పాలకులా...మీడియానా...





    వీరిని ఏమనాలి... చదువుకున్న మూర్ఖులు అనాలా... మూఢ విశ్వాసాలు నమ్మే అజ్ఞానులు అనాలా... ఏమనాలి... చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి శివారు శివ నగర్ నివాసి ఎన్. పురుషోత్తం నాయుడు ఎం.ఎస్సి. ఎం.ఫిల్  చదివి  చిత్తూరు జిల్లా మదనపల్లి లో ప్రభుత్వ మహిళా కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీగా , కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కూడా పనిచేస్తున్నారు.  ఆయన భార్య  పద్మజ ఎం.ఎస్సీ మాథ్స్...గోల్డ్ మెడలిస్ట్... మాస్టర్ మైండ్స్ అనే వేలాది మంది విద్యార్థులు చదివే ఒక ప్రైవేట్ కాన్వెంట్ అధినేత.   వారి పెద్ద కూతురు అలేఖ్య (27) ఎం.బి.ఏ చేసి భోపాల్ లో ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమార్తె సాయి దివ్య(22) ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కాలేజ్ లో మ్యూజిక్ నేర్చుకుంటోంది... ఈ విషయం చెప్పగానే... మంచి ఎడ్యుకేటెడ్ ఫామిలీ అనుకుంటారు... అనుకునేది ఏమిటీ.. నిజమే... అందరూ బాగా చదువుకున్న విద్యావంతులు... కానీ వారి ఆలోచనలు మాత్రం వేల ఏళ్ల క్రితం నాటి బూజు పట్టిన భావాలతో నిండి ఉన్నాయి. కలి యుగం అంతం అయిపోతుందని సత్య యుగం వస్తుందని వారి నమ్మకం... గత ఏడాది ఆగస్టు లోనే లాక్డౌన్ సమయంలోనే శివ నగర్ లో అత్యాధునికంగా మంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నారు.  ఇంట్లో తరచూ పూజలు చేసేవారు... అయితే వాళ్లకు భక్తి ఎక్కువ కాబోలు అనుకున్నారు చుట్టుపక్కల వారు... ఇంట్లో మెహర్ బాబా ఫోటోలు...కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు... కాన్వెంట్లో జగ్గీ వాసుదేవ్ ఫోటోలు... ఇది సాధారణమే ... కానీ  బయటకు కనిపించని అసాధారణ ప్రవృత్తి వారిలో ఉందని తోటి అధ్యాపకులు కానీ... చుట్టుపక్కల వారు కానీ కనిపెట్టలేకపోయారు. 
    ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇంట్లో ఇద్దరు కూతుళ్లను నగ్నంగా కూర్చోబెట్టి,  క్షుద్ర పూజలు చేశారు. ఆ తర్వాత  మొదట చిన్న కూతురిని తల్లి శూలం తో పొడిచి చంపింది. తర్వాత పెద్ద కూతురు నోట్లో రాగి చెంబు పెట్టి, నెత్తి మీద డంబెల్ తో కొట్టి చంపింది... తండ్రి అక్కడే ఉన్నాడు... ఇద్దరు కూతుళ్ళని చంపాక వాళ్ళు బతికి వస్తారనేది వారి నమ్మకం. ఈ విషయం తండ్రి తాను  పనిచేసే కాలేజ్ లో తోటి అధ్యాపకుడి కి చెప్పారు... ఆయన పోలీసులను తీసుకుని పురుషోత్తం నాయుడు ఇంటికి వచ్చి అక్కడ దృశ్యం చూసి నిశ్చేస్టు లయ్యారు.  తల్లి దండ్రులు వారి ఇద్దరు కూతుళ్ళని వారే ఎందుకు చంపుకున్నారన్నది అంతు చిక్కడం లేదు... పైగా మీరు తలుపులు తీసి బూటు కాళ్లతో లోపలికి వచ్చారు... అందుకే మా కూతుళ్ళ ఆత్మలు రాలేకపోయాయి... లేకపోతే వాళ్ళ ఆత్మలు లోపలికి వచ్చి మళ్ళీ మా కూతుళ్లు బతికేవాళ్లు అని తల్లిదండ్రులు ఇద్దరూ పోలీసులతో ఎదురు వాదిస్తుండడంతో వాళ్ళను ఏమనాలో పోలీసులకు అర్ధం కావడం లేదు. 
    సరే... మీడియాకు మంచి న్యూస్ దొరికింది... ఎలక్ట్రానిక్ మీడియా అయితే దీనిపై ఒక వారం రోజులు  ఊదర కొట్టచ్చు... ఆ తర్వాత అందరూ మర్చిపోతారు... కానీ ఈ ఘటనకు మూల కారణాలేంటి... భవిష్యత్తులో ఇలా ఎవరూ చేయకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఎవరూ పట్టించుకోరు...ఇలాంటివి గతంలోనూ జరిగాయి..  ఇవాళ పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు... రేపు ఇంకొకరు... ఇది ఆది కాదు... అంతం కాదు... కానీ ఇటువంటి మూఢ విశ్వాసాలను అంతం చేయటానికి ఏ ప్రభుత్వం కృషి చేయక పోగా.... వాటిని పెంచి పోషించటానికి పోటీలు పడతారు... ఎందుకంటే... ఓట్ల కోసం... మన దేశంలో ఓట్ల రాజకీయాలు రాజ్యమేలినంత కాలం.... మూఢ విశ్వాసాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి... తిలా పాపం... తలా పిడికెడు.... అన్నట్టు... సమాజంలో మూఢ విశ్వాసాలను పెంచి పోషించడంలో పాలకులే కాదు మీడియా కూడా కారణమే... తెల్లారి లేస్తే ఏ ఛానల్ పెట్టినా జ్యోతిష్యులు, రంగు రాళ్ల మాయగాళ్లు... న్యూమరాలజీ గాళ్ళు... ఇంకా రకరకాల తంత్ర గాళ్ళు, స్వామిజిలు దర్శనమిస్తారు... చానెళ్లు డబ్బుల కోసం వీరిని పెంచి పోషిస్తున్నాయి... ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం... తామేదో పరిశుద్ధులం అన్నట్టు వాళ్ళను ఉతికి ఆరేస్తుంటారు... గురివింద గింజ సామెతగా... నిజంగా ఛానెళ్ల కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇలాంటి కార్యక్రమాలు అన్నీ నిలిపివేయాలి.... కానీ అవి ఆపేస్తే ఆ చానెళ్లు మూతపడతాయి... సో... ఇది తేలే వ్యవహారం కాదు... కానీ ఇలాంటి హత్యలకు కారకు...ప్రేరకులు మాత్రం నిస్సందేహంగా పాలకులు...మీడియానే.... మదనపల్లి జంట హత్యలు చేసింది తల్లిదండ్రులే అయినా... ఇలాంటి వాటికి ప్రేరేపించింది పాలకులు, మీడియా పెంచి పోషిస్తున్న మూఢ విశ్వాసాలే . 
    • Blogger Comments
    • Facebook Comments

    2 comments:

    1. విశ్లేషణ బాగుంది సార్.. ప్రాథమిక స్థాయిలో మూఢనమ్మకం ఉంటే మారే అవకాశం ఉండొచ్చు. కానీ, ఈ తల్లిదండ్రుల మూఢనమ్మకం ముదిరిపోయింది.. పిల్లల ప్రాణాలు తీసే దాకా వెళ్లింది

      రిప్లయితొలగించండి

    Item Reviewed: హంతకులు తల్లిదండ్రులా... పాలకులా...మీడియానా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top