Translate

  • Latest News

    29, ఆగస్టు 2021, ఆదివారం

    శభాష్ స్టాలిన్




    ముత్తువెల్ కరుణానిధి స్టాలిన్(ఎం. కె.స్టాలిన్) ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన మూడు నెలలకే దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకోవడం బహుధా ప్రశంసనీయం. గతంలో చెన్నై నగర మేయర్ గా (1996-2002), ఉప ముఖ్యమంత్రిగా(2009-2011) పాలనానుభవం ఉన్నప్పటికీ ఆయన పనితనం ప్రజలకు చెప్పుకోదగ్గ స్థాయిలో అనిపించలేదు. పైగా చేసిన కొన్ని కుర్రతనపు చేస్టల తాలూకూ నీలి నీడలు ఆయన రాజకీయ చరిత్రపై మాయని మచ్చగా మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు 68 ఏళ్ల  వయసులో (చూపులకు అంతలా అనిపించదు... ఇప్పటికీ ఇంకా యువకుడి లానే కనిపిస్తాడు) పరిణితి చెందిన అసలు సిసలైన స్టాలిన్ తమిళనాడు ప్రజలకు కనపడుతున్నాడు.  
    వాస్తవానికి పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు స్టాలిన్ లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. 14 ఏళ్ల వయసులోనే తండ్రితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 20 ఏళ్ల వయసు లోనే డి.ఎం. కె. జనరల్ కమిటీకి ఎన్నికయ్యాడు. 22 ఏళ్ల వయసులో 1975 లో ఎమర్జెన్సీ లో జైలు జీవితం అనుభవించాడు. 31 ఏళ్ల వయసులో 1984 లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ కి పోటీగా చేశారు. అయితే అప్పుడు ఎం.జి .ఆర్ వేవ్ ఉధృతంగా వేయడంతో  అన్నా డి.ఎం. కె అభ్యర్థి కె. ఎ. కృష్ణస్వామి చేతిలో పరాజయం పాలయ్యారు. 1989 లో అదే నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీ కి ఎన్నికయ్యారు. అయితే రెండేళ్లకే మళ్లీ ఎన్నికలు రాగా  1991 ఎన్నికల్లో ఓటమి చెంది 1996 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. అప్పటినుంచి వరుసగా అదే నియోజకవర్గం నుంచి 2001, 2006, 2011, 2016, 2021 ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడిలా అప్రతిహాతంగా విజయఢంకా మోగిస్తోఉన్నారు. 
    అయితే ఇదంతా ఒక ఎత్తు.  మూడున్నర నెలల ముఖ్య మంత్రి పాలన ఒక ఎత్తు. కేవలం ఈ మూడు నెలల స్టాలిన్ రాజకీయ జీవితం ఆయన్ను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించింది. స్టాలిన్ ఈ ఏడాది మే 7 న ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 17 న ఇండియా టుడే తాజాగా ప్రకటించిన ర్యాంకు లలో దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా 42 శాతం తో టాప్ 1 ర్యాక్ సాధించారు. కేవలం  ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే ఈ ఘనత సాధించడం రాజకీయ పండితులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (38శాతం), కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయం(35 శాతం) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. అసలు ఇంత తక్కువ వ్యవధిలో ఇంత పెద్ద ఘనత ఎలా సాధించారు అంటే... స్టాలిన్ అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన ముద్రను బలంగా వేయడం ప్రారంభించారు. ద్రవిడుల ఆత్మను పట్టుకున్నారు. పెరియార్ రామస్వామి నాయకర్ ప్రబోధించిన మూల సూత్రాలను ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. సి.ఎం ఛాంబర్ కే పరిమితం కాకుండా నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల సాధక బాధలు వింటూ, ప్రజల ముఖ్యమంత్రి ని అనిపించుకున్నారు.
    అసలు ఈ మూడు నెలల్లో ఏం చేశారంటే...
     ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు. ప్రజలకు కోవిడ్ రిలీఫ్ ఫండ్ కింద 2 వేల రూపాయలు ఉచితంగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రైవేట్ హాస్పటల్స్ లో ప్రభుత్వ ఇన్సూరెన్స్ సదుపాయం తో కోవిడ్ ట్రీట్మెంట్ సదుపాయం కల్పించారు.  కళా శాలలు, విశ్వవిద్యాలయం లలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సుల్లో 7.5 % కోటా ప్రకటించారు. తమిళనాడు లో పెట్రోల్, డీజిల్ ధరలను 3 రూపాయలు తగ్గించారు.  (దీనివల్ల 1130 కోట్లు ప్రభుత్వానికి లోటు అయినా సరే)  కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేశారు. ఎం.బి.బి.ఎస్, పి.జి చేసిన 112 మంది విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయడానికి విముఖత చూపితే, అయితే మీపై ప్రభుత్వం ఖర్చు పెట్టిన 50 లక్షల రూపాయలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలంటూ సంచలనాత్మక నిర్ణయం ప్రకటించారు.
    తాజాగా అసెంబ్లీ లో తనను పొగిడే ఎం.ఎల్. ఏ లపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం గమనార్హం. మొత్తానికి ఈ మూడు నెలల్లోనే దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా ఎన్నికై తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. శభాష్ స్టాలిన్...శభాష్...
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: శభాష్ స్టాలిన్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top