Translate

  • Latest News

    6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

    సెంచరీ వీరుడు జగన్ పాలన ఎలా ఉంది ... ?


    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల పాలనలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఐతే  ఏపీ  సీఎం జగన్ 100 రోజుల పాలనపై  మిశ్రమ స్పందన కనిపించింది. సాక్షి సహజంగానే జగన్ ప్రవేశ పెట్టిన పథకాలపై ఫోకస్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి విమర్శలు బాతాలు ఎక్కు పెట్టాయి.  

    జగన్ ప్రజల కష్టాలు దగ్గరి నుంచి చూశారు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.. కులం, మతం, రాజకీయం చూడకుండా సాయం చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే వాయువేగంతో నిర్ణయాలు.. నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రీకారం.. విప్లవాత్మక బిల్లులతో పారదర్శక పాలన దిశగా అడుగులు.. సమాజంలో సగం ఉన్న మహిళలకు అన్నింట్లో సగం.. సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వంద రోజుల్లో వందకు పైగా కీలక నిర్ణయాలు.. ఇదో చరిత్ర.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నవ చరిత్ర.

    ప్రజలకిచ్చిన హామీల అమల్లో నాన్చుడు లేదు.. మీన మేషాలు లెక్కించడం అసలే లేదు.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోంది. కనీసం ఆరు నెలలైనా గడవందే పాలనపై ఓ అంచనాకు రావడం కష్టం. అలాంటిది కేవలం వంద రోజుల్లోనే వందకు పైగా కీలక నిర్ణయాలు తీసుకుని ‘ఇది అందరి ప్రభుత్వం’ అని నిరూపించారు. గత పాలకుల తీరుకు భిన్నంగా సీఎం వైఎస్‌ జగన్‌ వంద రోజుల పాలన ఐదు కోట్ల ప్రజానీకానికి కళ్లకు కట్టినట్లు కనిపించింది. మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌.. జూన్‌ 10వ తేదీన నిర్వహించిన తొలి కేబినెట్‌ భేటీలోనే నవరత్నాల్లో ప్రజలకిచ్చిన హామీల్లో 80 శాతం మేర అమలుకు నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ గ్రామ స్వరాజ్యానికి గాంధీ జయంతి రోజు నుంచి నాంది పలుకుతున్నారు. ఈ మేరకు తొలి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేశారు ... అంటూ సాక్షి ఒక  పేజీ రాసుకొచ్చింది 

    కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత... పాత ప్రభుత్వంలోని మంచి చెడ్డలను సమీక్షించడం సహజమే. మంచిని కొనసాగించడం, చెడు ఉంటే ఆపేయడం షరా మామూలే. అయితే... కొత్త సర్కారు మంచీ చెడు విచక్షణ ప్రదర్శించకుండా, అన్నింటినీ ఒకే గాటన కట్టేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు సర్కారు ‘సంపద సృష్టి’ మంత్రం జపించగా... జగన్‌ ప్రభుత్వం ఇప్పటిదాకా దీనిపై దృష్టి సారించనే లేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేసే కార్యక్రమాలకు బ్రేక్‌ పడిందన్న భావన ప్రజల్లో నెలకొంది. మొత్తం రాష్ట్రానికే ప్రధానాకర్షణగా, ఒక ఆర్థిక చోదక శక్తిగా మారాల్సిన ‘అమరావతి’ ప్రణాళిక ఇప్పుడు మూలన పడిపోయింది. ఎన్నికల ముందు దాకా పరుగులు తీసిన పోలవరం ప్రాజెక్టు ‘రివర్స్‌’ దెబ్బతో నిలిచిపోయింది. పవన, సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ)లపై పునఃసమీక్ష నిర్ణయం జాతీయ స్థాయితోపాటు అంతర్జాతీయంగానూ వివాదాస్పదంగా మారింది. ‘అవినీతిపై చర్యలు తీసుకుంటే సరే! కానీ... పాత పనులన్నింటినీ నిలిపివేయడం, గత నిర్ణయాలను తవ్వుకుంటూ పోవడం సరికాదు! ఇలా చేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు’ అని పరిశ్రమవర్గాలు కూడా తేల్చిచెప్పాయి.... పోలవరం సహా కీలక ప్రాజెక్టుల రివర్స్‌ టెండరింగ్‌, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల సమీక్ష, ‘అమరావతి’పై అయోమయం సృష్టించడం, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన వాటి సంగతి తేల్చకుండానే... హైదరాబాద్‌లోని భవనాల అప్పగించడం.. ఇదీ స్థూలంగా జగన్ 100 రోజుల పాలనపై  ఆంధ్రజ్యోతి జగన్ పాలనపై విశ్లేషించే ప్రయత్నం చేసింది 

    ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐతే  ‘‘వంద రోజుల పాలనలో ఒక్క పని కూడా జరగలేదు. అన్నీ ఆపేశారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రివర్స్‌ పాలన సాగిస్తున్నారు’’ అని టీడీపీ అధ్యక్షుడు, విపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో చులకన అయిపోయిందని... ఇంత తక్కువ సమయంలో అప్రతిష్ఠపాలైన సీఎం దేశంలో జగన్‌ మాత్రమే అని తెలిపారు. రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కనిపిస్తోందని ధ్వజమెత్తారు. 
    ఇంతకీ... అసలు జగన్ 100 రోజుల పాలన పై ప్రజల స్పందన ఎలా ఉంది ... 

    విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెట్టి ఆసలు  జనం ఏం  అనుకుంటున్నారు అనేదే ఇక్కడ ముఖ్యం .. 
    జగన్ వంద రోజుల పాలనలో ఎన్నో మెరుపులు ఉన్నాయి. అయిదేళ్ళలో చేయాల్సిన పనులు వంద రోజుల్లో జగన్ చేశారని అంటున్నారు. అర్టీసీని ప్రభుత్వంలో కలపడం కానీ, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల పేరిట నాలుగు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన ఘనతను జగన్ దక్కించుకున్నారు. ఇక అమ్మఒడి, రైతు భరోసా, చేనేత కార్మికులు, బీసీలకు, బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు అందరికీ అన్ని రకాలుగా సాయం చేస్తూ వస్తున్న జగన్ పాతిక లక్షల ఇళ్ళను ఉగాది నుంచి కట్టాలనుకుంటున్నారు. దానికి సంబంధించి  సర్వే సాగుతోందిపుడు. ఇదిలా ఉండగా జగన్ ఆశ వర్కర్లకు  వేతనాలు 10 వేలకు పెంచడం, పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం పెంపు ద్వారా  తనకు తానే సాటి అనిపించుకున్నారు.

    ఓ విధంగా జగన్ ఈ వంద రోజుల్లో పాలనను గాడిన పెట్టారనే చెప్పాలి. ప్రతిపక్షాలు యధా ప్రకారం విమర్శలు చేస్తూ వస్తున్నా కూడా వెరవకుండా తాను మరో ముప్పయ్యేళ్ళ పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాను అందువల్ల ఇది తన ఇల్లు అనుకుని అన్ని రకాలైన కార్యక్రమాలను శాశ్వత ప్రాతిపదికన చేస్తున్నారు. ఇక పాలనలో కూడా వినూత్న  మార్పులు  తెస్తున్నారు. సమసమాజ స్థాపనకు కూడా ఆయన  కృషి  చేస్తున్నారు. అందుకు మంత్రి వర్గ కూర్పుతో పాటు, నామినేటెడ్ పదవులలో బీసీలకు, బడుగులు, దళితులకు అవకాశం కల్పించడమే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. అయినప్పటికీ మొదటి వంద రోజుల్లో ఆయన పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందనే మాట నిజం... దానికి కారణం... ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లి... వారు ఆ ఫలాలు అనుభవించడానికి కనీసం ఆరు నెలలు సమయం అవసరం. ఈ మధ్య సంధి కాలంలో ప్రజల్లో ఏర్పడిన అయోమయమే ప్రస్తుతం మనకు అసంతృప్తి గా కనపడుతోంది. 2020 మార్చి తర్వాత ప్రజలు ఆ ఫలాలు అందుకున్నప్పుడు ఈ అసంతృప్తి అంతా ఉఫ్ అని ఎగిరిపోతుంది... అప్పుడు వాతావరణము అంతా జగన్ కు అనుకూలంగా మారుతుంది.. ఈ  లోపు  చంద్రబాబు అండ్ కో... విమర్శల బాణాలు సాధించుకుని తృప్తి పడనీయండి.... ఆరు నెలల తర్వాత అవన్నీ పూల బాణాలుగా మారిపోతాయిలెండి... మొత్తం మీద చూసుకుంటే సెంచరీ వీరుడు జగన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను  నమోదు చేసేందుకు  రెడీ అవుతున్నారు. 







    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సెంచరీ వీరుడు జగన్ పాలన ఎలా ఉంది ... ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top