Translate

  • Latest News

    24, ఏప్రిల్ 2020, శుక్రవారం

    ప్రకటనలకే పరిమితం అయిన ఆర్.బి.ఐ నిబంధనలు


    ఇటు చూస్తే అప్పుల వాళ్ళు...అటు చూస్తే బిడ్డల ఆకలి... ఉరి పోసుకు చనిపోవడమో... సముద్రమున పడిపోవడమో... సమస్యగా ఘనీభవించిందొక సంసారికి... అన్నాడు శ్రీ శ్రీ ... మహా ప్రస్తానం లోని సంధ్యా సమస్యలు గీతంలో... కరోనా కోరల్లో చిక్కి ప్రపంచం మొత్తం విలవిలలాడుతున్న వేళ కడుపు నిండిన సినిమా స్టార్లు ఇంట్లో వంటలు చేస్తున్నట్టు...బట్టలు  ఉతుకుతున్నట్టు ఫోజులు ఇస్తూ వీడియోలు తీసి చానళ్లకు పంపడం... పని పాటా లేని ఆ చానళ్ల వాళ్ళు అవి మనకు చూపిస్తూ... ఆహా...చూడండి... మీ అభిమాన దేవుళ్ళు...దేవతలు ఎంత కష్ట పడిపోతున్నారో అన్నట్టు మనకు చూపించడం... ఆ కడుపు నిండినోళ్ల బాగోతాలు చూస్తుంటే... ఓ పక్క ఇక్కడ కడుపు మండిపోతున్న సామాన్యుడికి ఎలా ఉంటుంది... కడుపులో దేవేసినట్టు ఉండదూ...
    ఓ పక్క తినడానికే  తిండిలేదు.. మరో పక్క గతంలో తీసుకొన్న అప్పులు తీర్చాల‌ని అప్పులోళ్ల గోల‌.. స‌గ‌టు మ‌నిషి లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. క‌రోనా వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌టానికి ప్ర్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. . ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే చాలు పోలీసులు వెంట‌ప‌డి త‌రుముతున్నారు. స‌రే ఇంటి ప‌ట్టునే  ఉందామంటే సంసార సాగర సుడిగుండాల్లో చిక్కుకుని ఊపిరాడని సంకట స్థితి.  తాను తిన‌క పోయినా అన్న‌మో రామచంద్ర అని అల్లాడే పిల్ల‌లకు, వృద్దులైన త‌ల్లిదండ్రుల‌కు ఒక్క పూట అన్నం పెట్ట‌లేని దుస్థితి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో చేతివృత్తులు కుదేల‌య్యాయి. దినసరి కూలీల కష్టాలు ఇక చెప్పేదేముంది. ఒక‌రేమిటి అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు నానా  ఇబ్బందులు ప‌డుతున్నారు. మరోపక్క పరిస్థితి చూస్తుంటే... లాక్ డౌన్ మే నెలాఖరు వరకు పొడిగిస్తారనేది అభిజ్ఞ వర్గాల భోగట్టా...  ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే క‌రోనాతో చ‌నిపోయేవారి క‌న్నా ఆక‌లితో చ‌నిపోయేవారే ఎక్కువ‌గా ఉంటార‌న్న‌ది నిర్వివాదాంశం.
    సామాన్యుడికి లభించని ఊరట
    ఇది ఇలా ఉంటే అప్పులోళ్ల ఫోన్లు ఇబ్బందికి గురిచేస్తున్నాయి. అదేమిటి ఆర్‌బీఐ మూడు నెల‌ల పాటు కిస్తీలు చెల్లించ‌వ‌ద్ద‌ని చెప్పిందిక‌దా మ‌రి ఇబ్బంది ఏమిటి..అనేగా మీ సందేహం .. అక్క‌డికే వ‌ద్దాం. ఆర్‌బీఐ మూడునెల‌ల మారిటోరియం విధించిన మాట వాస్త‌వ‌మే. అయితే ఇక్క‌డే ఒక లాజిక్ ఉంది. ఎవ‌రైతే బ్యాంకుల‌కు బకాయి ఉన్నారో వారు ఒక ద‌ర‌ఖాస్తు ఆయా బ్యాంకులకు ఆన్‌లైన్ నుంచి అందించాల్సి ఉంటుంది. అదీ  ఇంగ్లీషులో...  ఆన్‌లైన్‌లో.. అర్ధ‌మైందా.. మ‌న‌లో ఎంత‌మందికి ఈ విష‌యం తెలుసు. అంటే ఈ సదుపాయం కూడా ఎగువ మధ్య తరగతి...ఆ పై వర్గాలకు మాత్రమే ఉపయోగపడే విషయం అన్నమాట... సామాన్యుడికి మాత్రం బ్యాంకులో  డ‌బ్బులు ఉంటే చాలు బ్యాంకులు లాగేసుకుంటున్నాయి. ఇక మ‌రో విష‌యానికి వ‌ద్దాం. అత్య‌దిక‌మంది బ‌జాజ్‌, శ్రీ‌రామ్‌చిట్స్ లాంటి సంస్థల  నుంచి వాహ‌నాలు, ఇంట్లో అవ‌స‌ర‌మైన వ‌స్తువులు కొనుగోలు చేసుకుంటారు. ఇవి  అధిక‌వ‌డ్డీకి రుణాలు ఇస్తుంటాయి.  వారికి నెల‌నెల కిస్తీలు చెల్లించాలి. ఆర్‌బీఐ ఆదేశాల‌తో వారికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నా వారు ఇవేమి ప‌ట్టించుకోరు. ఇక  ప్రైవేటు ఫైనాన్సు వారు. వీరు రోజువారి వ‌సూలు  ప‌ద్ద‌తిన రుణాలు ఇస్తుంటారు. ఏ రోజు కిస్తీ క‌ట్ట‌లేదో మ‌రుస‌టి రోజు వ‌డ్డీ దారుణంగా ఉంటుంది. ఒక‌వేళ తీసుకొన్న డ‌బ్బులు క‌ట్ట‌లేక‌పోతే భౌతిక‌దాడులు, ఇంట్లో ఉన్న వ‌స్తువులు జ‌ప్తు చేసుకోవ‌టం ష‌రా మాములే. వీరు కాక ఆన్‌లైన్‌లో చిన్న చిన్న రుణాలు ఇస్తామ‌ని వెంట‌ప‌డి ప‌దివేల లోపు రుణాలు అందించ‌టానికి ప‌లు సంస్థ‌లు సిద్దంగా ఉంటాయి. వారికి సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొనే క్ర‌మంలోనే మ‌న ఫోటోలు, కాంటాక్ట్ నంబ‌ర్లు, లొకేష‌న్ ఒక‌ట‌మేమిటి అన్నింటికి ప‌ర్మిష‌న్ ఇస్తేనే... అధిక వ‌డ్డీతో రుణాలు మంజూరు చేస్తుంటాయి. వారు సూచించిన స‌మ‌యంకు డ‌బ్బులు  క‌ట్ట‌లేదా న‌ర‌కం చూపిస్తారు. నిమిషానికి ఒకరు వేర్వేరు నంబ‌ర్ల‌తో ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు. డ‌బ్బులు క‌ట్ట‌క‌పోయినా, వారి ఫోన్లు ఎత్త‌క‌పోయినా మ‌న కాంటాక్ట్‌లో ఉన్న వారికి ఫోన్ చేసి డ‌బ్బు తీసుకుని చెల్లించ‌టం లేదంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్ప‌డుతుంటారు. వీరి గురించి మ‌రో సంద‌ర్బంలో వివ‌రంగా చెప్పుకుందాం..సో... చూశారుగా ఆర్‌బీఐ నిబంధ‌న‌లు ఎవ‌రికైనా వ‌ర్తిస్తున్నాయా...ఏ సామాన్యుడికైనా ఊర‌ట ల‌భించిందా...?

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రకటనలకే పరిమితం అయిన ఆర్.బి.ఐ నిబంధనలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top