Translate

  • Latest News

    21, ఏప్రిల్ 2020, మంగళవారం

    అక్షరాస్యతే వారి విజయ రహస్యం


    నేడు ప్రపంచం మొత్తం కరోనా అనే ఓ అనకొండ విషపు కౌగిట్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. మేము సింహాలం... ఈ అడవికి మేమే రాజులం అని విర్రవీగిన అమెరికా సింహం కూడా ఆఖరికి చేష్టలుడిగి దిక్కూ మొక్కూ లేకుండా దీనంగా బేల చూపులు చూస్తోంది. పులులు...మదపుటేనుగుల్లాంటి మిగతా ఐరోపా దేశాలు సైతం కరోనా కొండచిలువ కౌగిట్లో బందీలయ్యాయి. ఇక సాదు జంతువు అయిన ఇండియాను కూడా కరోనా కొండచిలువ చుట్టుముట్టినా అగ్ర దేశాల కంటే కొంతవరకు పరిస్థితి బెటరే అని చెప్పవచ్చు. ఇండియాలో కూడా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ వంటి సింహాలు, పులులు, మదపుటేనుగులు కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతుంటే... మిగతా చిన్న రాష్ట్రాలు కరోనా కొండచిలువతో దీటుగా పోరాడుతున్నాయి. ముఖ్యంగా దేశంలోనే తొలి పాజిటివ్ కేసు నమోదు అయిన కేరళ రాష్ట్రం కరోనా ను సమర్ధంగా ఎదుర్కొని శభాష్ అనిపించుకుంది. కరోనా ధాటికి మహా మహా మృగరాజులు డీలా పడితే కుందేలు పిల్ల లాంటి కేరళ కరోనా ను ఎలా కట్టడి చేయగలిగింది... ఆ చిదంబర రహస్యం ఏమిటి...
    కరోనా ను కట్టడి చేయడంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సి.పీ.ఎం ప్రభుత్వం ముఖ్యమంత్రి విజయన్ నేతృత్వంలో సమర్ధవంతంగా ఎదుర్కొంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకు ముందే ఆ రాష్ట్రం నిఫా వైరస్ ను విజయవంతంగా కట్టడి చేయగలిగింది. ఆ అనుభవంతో ఈ సారి మొదటి కరోనా కేసు బయటపడగానే యుద్ధ ప్రాతిపదికపైన కరోనా కట్టడికి చర్యలు తీసుకుంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం కంటే ఎక్కువగా ఒక్క కేరళ రాష్ట్రమే 20 వేల కోట్లు కేటాయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇప్పటివరకు కేరళ లో కేవలం  402 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా, మరణాలు 3 మాత్రమే... పాజిటివ్ వచ్చిన 402 మందిలో కూడా 270 మంది కోలుకోవడం గమనార్హం... దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత  సమర్ధవంతంగా కరోనా ను కట్టడి చేయలేకపోయింది. వాస్తవానికి కేరళలో జనసాంద్రత ఎక్కువ. ఒక చదరపు కిలోమీటరుకు 860 మంది జనాభా నివసిస్తారు. ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న కేరళ కార్మికులు కూడా ఎక్కువే...
    ముస్లిం, క్రిస్టియన్ల జనాభా కూడా చాలా ఎక్కువ
    నిజానికి కేరళ దేశంలోనే ఒక విభిన్న రాష్ట్రం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ హిందువులు దాదాపు 55 శాతం ఉంటె... ముస్లింలు, క్రిస్టియన్లు కలిపి 45 శాతం జనాభా ఉండడం గమనార్హం. (ముస్లిం 26.56 శాతం , క్రిస్టియన్లు 18.38 శాతం) మూడు మతాలకు చెందినవారు ఇంత శాతం ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు సెక్యులరిజం వైపే మొగ్గు చూపుతారు. ఘర్షణ వైఖరికి పోరు... ఇక్కడ గత నాలుగు దశాబ్దాలుగా అధికారం కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య మార్పిడి జరుగుతోంది. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ... ఇక్కడ ఎంత భయానకమైన వైరస్ వచ్చినప్పటికీ ఇక్కడి ప్రజలు దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టగలరు. దానికి ఒకే ఒక కారణం అక్కడి ప్రజల్లో ఉన్న అక్షరాస్యత... దేశంలో అక్షరాస్యత శాతంలో ప్రధమ స్తానం కేరళ. మన దేశ అక్షరాస్యత శాతం 74.04 అయితే... కేరళలో అక్షరాస్యత శాతం 93. 91 కావడం గమనార్హం. ఈ కారణంగానే కేరళలో ప్రజలు ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణతో భౌతిక దూరం సక్రమంగా పాటించి కరోనా కట్టడిలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించారు.మరి  మన రాష్ట్రంలో చూస్తున్నారుగా... నిత్యావసరాల కోసం ఉదయం ఓ మూడు గంటలు టైం ఇస్తే రోడ్ల మీద జనం ఎలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారో. ఇక్కడ చదువుకున్న వారికి కూడా కనీసం కామన్ సెన్స్ లేకుండా పోవడంతో ఎటువంటి కాంటాక్ట్ లేకపోయినా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇకనైనా మన జనం కేరళ వారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అక్షరాస్యతే వారి విజయ రహస్యం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top