Translate

  • Latest News

    23, ఆగస్టు 2017, బుధవారం

    నాటి మేటి చిత్రాలు ..... అడవి రాముడు ప్రభంజనం

    నాటి మేటి చిత్రాలు
    అడవి రాముడు ప్రభంజనం

     సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం. వసూళ్ళలో తెలుగు సినిమా చరిత్రలోనే ఒక చరిత్ర. ఆ రోజుల్లో అడవి రాముడు సాధించిన కమర్షియల్‌ రికార్డులు దక్షిణాదితో పాటు, ఉత్తరాది సినీసీమ వారిని కూడా ప్రాంతీయ తెలుగు సినిమా పరిశ్రమ వైపు కళ్ళువిప్పార్చి చూసేలా చేసింది. అప్పటి దాకా తెలుగు సినిమా వసూళ్ళు కోటి మార్కును దాటింది - కేవలం రెండే రెండు సినిమాలు. మొదటిది... ఎన్టీయార్‌ ‘లవకుశ’. రెండోది... ఎన్టీయార్‌ స్వీయ దర్శకత్వంలో మూడు పాత్రలు నటించి, నిర్మించిన ‘దాన వీర శూర కర్ణ’. రెండూ పౌరాణికాలే. కానీ, తొలిసారిగా సాంఘిక కథా చిత్రమైన ‘అడవి రాముడు’ ఏకంగా 4 కోట్ల గ్రాస్‌ సాధించి, అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఏకంగా ఏడాది పాటు ఏకధాటిగా ఆడింది. జనం క్యూలు కట్టి, ఆ సినిమా చూశారు. తెలుగు సినిమా స్టామినా ఎంత ఉందో తొలిసారిగా బాక్సాఫీస్‌ వద్ద రుచి చూపించింది. ఎన్టీఆర్‌ ‘అడవి రాముడు’ ఇచ్చిన ఆ భరోసాతో భారీగా సినిమాలు తీయడానికి దర్శక, నిర్మాతలు ధైర్యం చేశారు. తెలుగు సినిమాల వసూళ్ళూ ఆ దామాషాలో భారీగా పెరిగాయి. అలా తెలుగు సినిమాల్లో నిర్మాణవ్యయం, దానికి తగ్గట్లే వసూళ్ళూ పెరగడానికి కూడా ‘అడవి రాముడు’ మూలమైంది. నలభై ఏళ్ళ క్రితం అప్పటి తెలుగు జనాభా, టికెట్‌ రేట్లు, రూపాయి విలువ లెక్కల్ని ఇప్పటి లెక్కలతో పోల్చి చూస్తే, అడవి రాముడు ఇవాళ దాదాపు 500 కోట్ల వసూల్‌ సినిమా అని సినీ వ్యాపారవర్గాల అంచనా. అన్నట్లు సినిమా రిలీజై ముప్ఫై ఏళ్ళు గడిచిన తరువాత కూడా మొన్న మొన్నటిదాకా దాదాపు 15 సరికొత్త ప్రింట్లతో రిపీట్‌ రనలు ఆడిన ఏకైక పాత చిత్రమూ ఇదే. అందుకే, హాలీవుడ్‌ పద్ధతిలో తెగిన టికెట్లు, చూసిన ప్రేక్షకుల సంఖ్యను బట్టి చూస్తే, అత్యధిక వ్యూయర్‌ షిప్‌ సాధించిన సినిమాగా, ‘అడవి రాముడు’ది అభేద్యమైన రికార్డని ట్రేడ్‌ విశ్లేషణ.
    కన్నడ రాజ్ కుమార్ నటంచిన గందద గుడి చిత్రం ఈ చిత్రానికి కొంత ఆధారం. అప్పటి వరకు ఉన్న రామారావు ఇమేజిని మారుస్తూ, ఆహార్యం, దుస్తులు మార్పులు చేసి రాఘవేంద్రరావు కొత్త రామారావును చూపించారు. తొలిసారిగా విజయవాడ యాక్స్ టైలర్స్ రామారావు దుస్తులు రూపకల్పన చేసారు. రామారావు ఇంట్రడక్షన్ నుండి హీరోఇజమ్ ప్రదర్శితమౌతూ వస్తుంది. అప్పటి సూపర్ హిట్ హిందీ చిత్రం షోలే లోని కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉపయోగించుకున్నారు. రోహిణిని విలన్ల చంపడం, రామును గూడెం నుండి వెళ్ళిపొమ్మని శ్రీధర్ బెదిరించే సన్నివేశం, కాకరాల రామారావును అక్కడే ఉండమనడం, జయప్రద రాము కోసం గుడిలో ప్రార్ధించడం, జయసుధ వెనకనుండి మాట్లాడటం, జయసుధ, జయప్రదలను గుర్రపు బండిమీద సత్యనారాయణ వెంటాడటం షోలే నుండి తీసుకున్నవే.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నాటి మేటి చిత్రాలు ..... అడవి రాముడు ప్రభంజనం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top