ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టింది ఏపీ పోలీసుల పరిస్థితి. ఇటీవలి వరుస విజయాలతో అధికార టీడీపీ తాము మూడున్నర సంవత్సరాల కాలంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించటానికి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించింది. ప్రతి గ్రామం కవర్ అయ్యేలా కార్యక్రమాన్ని రూపోందించారు. ఆయా నియోజకర్గం, గ్రామం, వార్డుల పరిధిలో జరిగిన అభివృద్ధిని కరపత్రాల్లో పొందుపరిచి ఇంటింటికి తిరిగి అందజేయనున్నారు. ఇదే సమయంలో ముందుగా అనుకొన్న ప్రకారం వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్రకు ముందే ప్రజలను సంసిద్ధం చేయటానికి వైఎస్సార్ కుటుంబం పేరుతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రజాబ్యాలెట్ అందజేసి 100 ప్రశ్నలకు ప్రజల చేత పత్రాలు పూరించి , టీడీపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. దీంతో పాటు పార్టీ కేంద్రవిభాగానికి కుటుంబాలకు చెందిన వారిచే మిస్సిడ్ కాల్ చేసి పార్టీ సభ్యత్వాన్ని చేపట్టడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఇదంతా ఆయా పార్టీ నేతలు పేర్కొంటున్న కార్యక్రమం. కాని అసలు వ్యూహం ఏమిటన్నది అందరికి తెలిసిందే. ఒక రకంగా ఇది ముందస్తు ఎన్నికల ప్రచారంగా భావించవచ్చు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తమ కార్యక్రమాల ద్వారా ప్రచారం చేసుకుంటే తప్పేమిలేదు. కాని ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా అన్నది . ప్రశ్న? గతంలో వైకాపా గడపగడపకువైఎస్సార్ కార్యక్రమం పేరుతో కార్యక్రమం చేపట్టినప్పడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. ప్రస్తుతం రెండు పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నప్పడు వివాదాలు చెలరేగకుండా ఉంటాయా అన్నదే నేడు పోలీసులను వేధిస్తున్న ప్రశ్న.అలా అని అధికార పార్టీ కార్యక్రమానికి అనుమతించి , ప్రతిపక్షపార్టీ కార్యక్రమాన్ని నిలుపుదల చేయిస్తే అదో చెడ్డపేరు. గ్రామీణ ప్రాంతాల్లో నాటి ఎన్నికల గొడవలు ఇంకా సద్దుమణగలేదు. అప్పడప్పడు అవి చెలరేగి పలువురిని బలితీసుకుంటూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత కార్యక్రమాల వల్ల వివాదాలు చెలరేగితే రానున్న ఎన్నికల వరకు అవి రావణ కాష్టంగా మండుతునే ఉంటాయి. జరగనున్న రెండు పార్టీల కార్యక్రమాలపై నిఘా వర్గాలు పోలీసుబాస్కు నివేదక అందించినట్లు సమాచారం. ఇంటింటికి తెలుగుదేశం, వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాలు ఎటువంటి వివాదాలు, ఘర్షణలు లేకుండా కొనసాగాలని ఆశిద్దాం.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి