ఏడాదిన్నర కాలంగా ప్రధాని నరేంద్రమోడీ నోటివెంట ‘ఒకే దేశంఒకే ఎన్నికలు’ అనే మాట పదేపదే వినిపిస్తోంది. ఇదే జరిగితే వాస్తవాలను సరైన కోణంలో అంచనా వేయకుండా ఎన్నికలు అనే ప్రజాస్వామ్య ప్రక్రియను మరీ తేలికగా మార్చడం అవుతుంది. ఈ ఆలోచనను వ్యతిరేకించేవారిపై పాలక పార్టీ నేతలు విరుచుకుపడే ప్రమాదం ఉంది. వారిని దేశ ద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి పార్టీ నాయకులకు మరో అవకాశం ఇవ్వడమే ఈ ప్రతిపాదన. ఇంతకీ జమిలీ ఎన్నికలు దేశ ప్రయోజనాలు ఆశించి ప్రతిపాదిస్తే అది వేరే సంగతి. రాజకీయ అవసరార్థం చేస్తున్న ఆలోచన అయితే దీని గురించి లోతు గా చర్చించడం అవసరం. భారతదేశపు రాజకీయాలు, ఎన్నికల గత చరిత్ర జ్ఞానం బొత్తిగా లేకుండా ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనపై ప్రచారం సాగుతోందని చెప్పక తప్పదు.
రాజ్యాంగ సవరణ చేయాల్సిందే!
శాసనసభల పదవీకాలాన్ని పొడిగించాలన్నా, తగ్గించాలన్నా రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. ఆర్టికల్ 83, 172లలో లోక్‌సభ, శాసనసభల గడువులు ఒక ఏడాది పొడిగించడానికి అవకాశం ఉంది. కానీ ముందుగానే రద్దుచేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కచ్చితంగా కావాలి. లేదంటే రాజ్యాంగంలో, ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనేక సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది. ఇంతచేసినా...ఏదైనా ఒక రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తే? కోర్టులనాశ్రయిస్తే ఏం జరుగుతుందన్న దానిపై న్యాయనిపుణులు కూడా అంచనాకు రాలేకపోతున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి మూడు ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగాయి. అయితే ఆ తర్వాత మారిపోయిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏటా ఏదో ఒక శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటం, కేంద్రం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే... ఆ రాష్ట్ర ఎన్నికలు అడ్డుకావడం వంటి పరిణామాల నేపఽథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా పలు సందర్భాల్లో జమిలి ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. అయితే జమిలి ఎన్నికలు నిర్వహించడం అంత తేలికేనా? వాస్తవానికి ఒకేసారి ఎన్నికలు అనేవి చాలా సంక్లిష్టమైన వ్యవహారమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాషా్ట్రలకు ఎన్నికలు జరిగాయి. 2018లో గుజరాత్, కర్ణాటక, నాగాలాండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం రాషా్ట్రలకు, 2019లో ఏపీ, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్థాన్,ఛతీస్ ఘడ్ , సిక్కిం, మధ్యప్రదేశ్ హర్యానా, మహారాష్ట్ర, ఒడిసాలకు ఎన్నికలు జరగాలి. 2021లో అసోం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాష్టాలకు ఎన్నికలు జరగాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఏకకాలంలో ఎన్నికల నిర్వహరణ కొన్ని రాస్ట్రాలకు సమస్య వస్తోంది. 2018లో ఎన్నికలు జరగాల్సిన రాష్టాల శాసనసభలను కొన్ని నెలలపాటు పొడిగిస్తే ఆ ఏడాది నవంబరులో జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చు. అదే సమయంలో 2019లో జరగాల్సిన ఎన్నికలను 2018లో నిర్వహించవచ్చు. మొత్తం మీద 2018 నవంబరులో ఎన్నికలు జరిగితే 17 రాషా్ట్రల్లో పెద్దగా సమస్యలుండవు. కానీ 2021, 2022లో ఎన్నికలు జరగాల్సిన రాష్టాల తోనే ఇబ్బంది. వీటిని మూడు లేదా నాలుగేళ్లకు ముందుకు తీసుకురావడం సాధ్యమా? అన్నది ఇప్పుడు ప్రశ్న. . అస్థిరతలు, రాజకీయ కల్లోలాలు మామూలైన మనదేశంలో జమిలి ఎన్నికలను రుద్దడం అంతమంచి ఆలోచన కాదని ఈ రాజకీయ చరిత్ర చెబుతోంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి