హిందువులంతా సాధుపుంగవులని, ముస్లింలే టెర్రరిస్టులని జరుగుతున్న ప్రచారానికి విరుద్ధంగా సినీనటుడు కమల్ గొంతు విప్పటం పాపమైంది. అది సహించలేని హిందుత్వ శక్తులు కమల్ అవినీతిపరుడని నోరు పారేసుకున్నాయి. ఉలగనాయకన్(లోకనాయకుడు) కమల్‌హాసన్ మరోసారి తన మాటలతో రాజకీయ దుమారం రేపారు. పరోక్షంగా బీజేపీ, అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న ఆయన.. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ సంచలన ప్రకటన చేశారు.
హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవటంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. బి.జె.పి పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆనంద వికటన్ తమిళ మాస పత్రికలో ఆయన రాసిన వ్యాసం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయనెమన్నారంటే‘‘గతంలో హిందూ సంఘాలు హింసకు పాల్పడేవి కావు. కేవలం మాటలతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడేవి. కానీ, పరిస్థితులు ఇప్పుడు దారుణంగా మారాయి. భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరుకున్నారు. వారిని వెనకాల నుంచి కొందరు ప్రోత్సహిస్తున్నారు. అసలు హిందూ టెర్రరిజం లేదన్న కొందరి వాదన నిజం కాదు. అది ఉంది. ఇప్పుడు తారా స్థాయికి చేరింది ’’ అంటూ కమల్ వ్యాఖ్యానించారు.
అయితే హిందూ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేరళ ప్రభుత్వం విజయవంతం అయ్యిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కమల్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో మెర్సల్ వివాదాస్పద డైలాగుల అంశం గురించి కూడా ప్రస్తావించారు. కొత్త పార్టీ ఆలోచనలో ఉన్న కమల్ మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
హిందూ తీవ్రవాదాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు ప్రోత్సహిస్తున్నాయంటూ అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై కమలనాథులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసారు. .ప్రస్తుతం కమల్ వ్యాఖ్యలపై స్వలాభం కోసమే కమల్ రాజకీయ ఎత్తుగడ వేస్తున్నాడని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. కమల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కమల్ ఓ అవినీతి పరుడని.. బీజేపీ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కుట్రలకు తెర లేపుతున్నాడని స్వామి విమర్శించారు.
ముస్లిం తీవ్రవాదుల టెర్రరిజానికి వ్యతిరేకంగా హిందూ టెర్రరిజం అనేది... కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఎవరన్నా చెప్పినా నమ్మేవాళ్ళము కాదు. కానీ... మాలెగాం (మహారాష్ట్ర) బాంబు పేలుళ్ల (2006) కేసులో పోలీసులు అలవాటు ప్రకారం 9మంది ముస్లింలను అరెస్టు చేసినప్పటికీ సిబిఐ కొనసాగించిన దర్యాప్తు హిందూత్వ టెర్రరిజంను బయటపెట్టింది. సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, సీనియర్ ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ సందీప్ డాంగే, రాంజీ కల్‌సంగ్ర బాంబు పేలుళ్లకు మూల కారకులుగా ఆధారాలు దొరికాయి. దర్యాప్తుతో ముందుకు సాగితే అజ్మీర్ షరీఫ్ దర్గా వద్ద, హైదరాబాద్‌లో మక్కామసీదు వద్ద, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లకు హిందూ టెర్రరిస్టులే కారణమని ఆధారాలు దొరికాయి. ఈ టెర్రర్ నెట్‌వర్క్‌లో కీలకమైన వ్యక్తి స్వామి అశీమానంద్‌ను హరిద్వార్ (ఉత్తరాఖండ్)లో అరెస్టు చేయటంతో హిందూ టెర్రరిస్టుల కుట్ర, ఆర్.ఎస్.ఎస్.తో వారి సంబంధాలకు ఆధారాలు దొరికాయి. హింసారాధకులైన టెర్రరిస్టులకు జాతి, మతం లేదు. వారు ముస్లింలైనా, హిందువులైనా, మరొకరైనా జాతిద్రోహుల కిందేలెక్క. వారిని చట్టప్రకారం శిక్షించాలి. అలా కాకుండా హిందువులంతా సాధుపుంగవులని, ముస్లింలే టెర్రరిస్టులని ఇంతకాలంగా సంఘే పరివార్ చేస్తున్న దుష్ప్రచారం తప్పని ఇప్పటికైనా వారు గ్రహిస్తారా? లౌకిక రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తారా?
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి