వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. ఎదురు దెబ్బలు తింటేనే ఎవరైనా రాటు దేలేది. అలాగే నంద్యాల ఘోర పరాజయం నుంచి జగన్ కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నట్టే కనపడుతున్నారు. 2019 ఎన్నికల దిశగా ముందుచూపుతో వ్యవహరిస్తూ దూకుడు పెంచారు. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించి పార్టీ నాయకులను ఇంటింటికి తిప్పుతున్న జగన్ 6 వ తేదీ నుంచి తన పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తాను పాదయాత్రలో ఉండగా మిగతా జిల్లాల్లో నాయకులూ ఖాళీగా కూర్చోకుండా వారికి వారం వారం హోమ్ వర్క్ ఇచ్చారు. పల్లె నిద్ర పేరుతొ నాయకులకు విరామం లేకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా ఒక పని అప్పగించాడు. పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నా ఎన్నికలల్లో ఆ అభిమానం ఓట్లుగా మార్చుకోవడంలో పార్టీ విఫలమవడానికి కారణం పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోవడమే... ఈ నిజాన్ని ఆలస్యంగా అయినా గుర్తించిన జగన్ కింది స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లాల కమిటీలు వేశారు. 25 లోకసభ నియోజకవర్గాలకూ 25 మంది జిల్లా పార్టీ అధ్యక్షులను ప్రకటించి ఇంకో అడుగు ముందుకేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచారు. అంతేకాక తాము అధికారంలోకి రాగానే ఇదే ప్రాతిపదికన 25 జిల్లాలు ప్రకటిస్తామని ప్రజలకు చెప్పకనే చెప్పినట్టయింది. ఈ విషయంలో జగన్ చంద్రబాబు మీద ఒక మెట్టు పైనే ఉన్నారని చెప్పాలి. చంద్రబాబు ఎంతసేపు ఫిరాయింపు ఎం.ఎల్.ఏ లకు చోటు కల్పించడంకోసమని అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచమని కేంద్రాన్ని అభ్యర్ధించడమే సరిపోయింది గాని... పక్క రాష్ట్రంలో కె.సి.ఆర్ లాగ తన చేతిలో ఉన్న పని... జిల్లాలు పెంచుకుని ఉండాల్సింది. చంద్రబాబు విస్మరించిన ఆ అంశాన్ని జగన్ అందిపుచ్చుకున్నాడు. ఇది ఆ పార్టీ అభిమానులకు శుభపరిణామం. జగన్ రాజకీయ భవిష్యత్తుకు విజయ సంకేతం...
-మానవేంద్ర
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి