Translate

  • Latest News

    8, నవంబర్ 2017, బుధవారం

    బ్లాక్ మనీ నియంత్రణ ఓ బేతాళ ప్రశ్న

    ఈ రోజుతో పెద్ద నోట్ల బంద్‌కు ఏడాది నిండింది.దేశం మొత్తం బ్యాంకుల వద్ద , ఎటిఎం ల వద్ద సాగిలపడి దృశ్యాలు ఇంకా మన మనస్సులో నుంచి చెదిరిపోలేదు. ఇంతకూ నోట్ల రద్దు హిట్టా...ఫట్టా...  ప్రధాని మోదీ ఎత్తుగడ పండిందా? నల్లధనస్వాముల పీక నొక్కటానికే ఈ సాహసోపేత సంస్కరణ తెచ్చామన్న ఆయన మాట ఎంతవరకూ నిజమైంది? అవినీతికి అడ్డుకట్ట వేయాలన్న ధ్యేయం ఎంతవరకూ నెరవేరింది? పన్ను ఎగవేతదారులకు ముకుతాడు వేసే లక్ష్యం సాధించామా? 
    దేశ ప్రజలు  అవాక్కయ్యే రీతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం స్వల్పకాలిక ఫలితాలకన్నా దేశం దానికి చెల్లించిన మూల్యమే ఎక్కువని ఆర్థికవేత్తలు, విశ్లేషకులు భావిస్తున్నారు. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, నకిలీ కరెన్సీ... వగైరాలన్నిటినీ ఒక్కదెబ్బతో నిర్మూలించాలన్న ధ్యేయంతో జాతి ఎన్నడూ ఎరుగని నోట్ల నిషేధం విధించారు. పర్యవసానంగా చలామణీలో ఉన్న 86 శాతం కాగితపు నగదుకు (కరెన్సీ) చిత్తు కాగితాల కింద కాలం చెల్లింది. ముఖ్యంగా నకిలీ కరెన్సీ నిరుపయోగమై ఉగ్రవాదానికి ఊపిరి ఆగిపోతుందని, నల్లధనస్వాములు ఉక్కిరిబిక్కిరై ఉడిగిపోతారని రద్దు ప్రకటన సందర్భంగా ప్రధాని చెప్పారు. కానీ, ఇలాంటి అనూహ్య నిర్ణయంవల్ల పెద్దగా ఫలితం దక్కకపోగా ఆసియా ఖండంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపునకు లోనైంది. ఫలితంగా మునుపటి ప్రభుత్వ హయాంతో పోలిస్తే వృద్ధి మందగించింది. 
    నిరుడు పెద్దనోట్ల నిషేధం తర్వాత సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌మీద విచారణ సందర్భంగా దేశంలో రూ.15.44 లక్షల కోట్ల విలువైన పెద్దనోట్లు చలామణీలో ఉన్నట్లు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వెల్లడించారు. అయితే, ఇందులో మూడోవంతు రూ.4-5 లక్షల కోట్ల మేర బ్యాంకులలో జమ కాకపోవచ్చునని ఆయన చెప్పారు. అంటే... ఆ సొమ్మును వెల్లడించి, ముప్పులో పడటంకన్నా కోల్పోవడానికే భారతీయులు ప్రాధాన్యమిస్తారన్నది ప్రభుత్వ అంచనా. కానీ, సదరు నోట్లలో 99 శాతం బ్యాంకులలో జమకాగా వాటి లెక్కింపు, పరిశీలన ఇంకా పూర్తికాకపోవడం విశేషం. మరోవైపు అక్రమ ధనం దాచినవారిపై దాడులవల్ల రూ.1003 కోట్లు, వెల్లడించని ఆదాయం వెలికితీతద్వారా రూ.17,526 కోట్లు బయటపడినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు 35వేల డొల్ల కంపెనీలు విదేశాలకు తరలించిన రూ.17వేల కోట్ల ఆచూకీ బయటపడిందని తెలిపింది. కానీ, ఇదంతా కలిపినా మొత్తం నోట్ల రద్దులో ఇది 2 శాతానికి మించదు. 
    పెద్దనోట్ల రద్దయిన వెంటనే తిరుగుబాటుదారుల హింసాత్మక చర్యలు చాలావరకూ తగ్గినా వీటిమధ్య ప్రత్యక్ష సంబంధం ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. కాగా, హోంశాఖ వెల్లడించిన సమాచారం మేరకు... నోట్ల రద్దుకు ముందు 10 నెలల కాలంతో పోలిస్తే ఆ తర్వాత 10 నెలల్లో కశ్మీర్‌లో ఉగ్రవాద సంఘటనలో 38 శాతం పెరిగాయి. పౌరుల మరణాలు 2500 శాతం, భద్రత సిబ్బంది అమరులు కావడం 2 శాతం పెరిగింది. ఉగ్రవాదానికి ఊతంగా ఉన్న నకిలీ నోట్ల లెక్కలు చూస్తే... ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం రద్దయిన నోట్లలో నకిలీ నోట్ల విలువ రూ.11.23 కోట్లు. అంటే కేవలం 0.0007 శాతం మాత్రమేనన్న మాట! అయితే, రిజర్వు బ్యాంకు 2016-17కుగాను వెల్లడించిన గణాంకాల ప్రకారం... రూ.43 కోట్ల నకిలీ కరెన్సీ వెలుగుచూసింది. ఇది మరో 0.0002శాతం. ఇక వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో పౌరుల మరణాలు, హింసాత్మక సంఘటనలు 45 శాతం పెరిగితే, భద్రత సిబ్బంది మరణాలు ఏకంగా 82 శాతం పెరిగాయి. ఇంతా చేసి ప్రధాని ఏం సాధించారన్నది బేతాళ ప్రశ్న గానే మిగిలిపోయింది. 
                                                                                                           -ఎడిటోరియల్ డెస్క్ 

                                                                         


        
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బ్లాక్ మనీ నియంత్రణ ఓ బేతాళ ప్రశ్న Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top