కర్ణాటకలో నివసించాలనుకునేవారు తప్పనిసరిగా కన్నడ భాష నేర్చుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక రాష్ట్రావతరణ సందర్భంగా నిర్వహించిన ‘కర్ణాటక రాజ్యోత్సవ’ కార్యక్రమంలో సిద్ధరామయ్య ప్రసంగించారు. ఇక్కడ నివసించే ప్రతివారూ కన్నడిగులేనని, ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ కన్నడ భాషనేర్చుకోవాలని, తమ పిల్లలకు ఆ భాష నేర్పించాలని ఆయన అన్నారు. కన్నడ భాషనేర్చుకోకపోవడం ఈ భూమిని అగౌరవపర్చినట్లేనని ఆయన అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో మాత భాష మీద మమకారం బాగా పెరుగుతోంది. నిజానికి అందుకు కొంతవరకు హిందీయే కారణం అవుతోంది. కొన్ని పరీక్షలను తప్పనిసరిగా హిందీలో లేదా ఇంగ్లీషులోనే రాయాలని నిర్దేశించడం వల్ల దక్షిణాది విద్యార్థులు తమకు సబ్జెక్టు బాగా వచ్చినా భాషా సమస్యతో వెనకబడిపోతున్నామన్న భావనలో ఉన్నారు. ఉత్తరాది వారికి చాలావరకు హిందీ మాత భాష లాంటిదే. చిన్న చిన్న తేడాలున్నా, చాలావరకు ఉత్తరాది మొత్తం హిందీ వస్తే చాలు. కానీ దక్షిణాదిలో అలాకాదు. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, ప్రత్యేక భాష ఉంది. కర్ణాటకలో కన్నడ, తమిళనాడులో తమిళం, కేరళలో మళయాళం, ఏపీ, తెలంగాణల్లో తెలుగు.. ఇలా అందరికీ అన్ని భాషలు ఉన్నాయి. ఎవరి కోణంలో చూస్తే వారికి వాళ్ల భాషే ముఖ్యం, అదే గొప్ప.
అలాంటప్పుడు దాన్ని వదులుకోవాలని ఎవరూ అనుకోరు. అందుకే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు మొదలవుతున్నాయి. కర్ణాటకలో నమ్మ మెట్రో బోర్డులను హిందీలో రాయడానికి వీల్లేదంటూ వాటిని పూర్తిగా తీయించేశారు. అసలు ఇక్కడ హిందీ అవసరం లేదని కూడా అన్నారు. ఎవరి భాష వారికి ముఖ్యమే అయినా, జాతీయ భాష, అంతర్జాతీయ భాషలు కూడా నేర్చుకుని ఉండటం కొంతవరకు అవసరం అవుతుంది. అవి వచ్చినవాళ్లు దేశ విదేశాల్లో ఎక్కడైనా వెళ్లి బతకగలరు. లేకపోతే కేవలం మన సొంత రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి