Translate

  • Latest News

    16, డిసెంబర్ 2017, శనివారం

    ప్రపంచ తెలుగు మహాసభలపై భిన్నస్వరాలు


     ప్రపంచ తెలుగు మహాసభలు నగరంలోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. సభలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లికి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పుష్పాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్ తన గురువు బ్రహ్మశ్రీ వేలేటి మృత్యుంజయ శర్మ గారికి గురువందనం చేసి ఆయనను శాలువాతో సత్కరించారు.  మరోవైపు రాజకీయంగానే తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.సిఎల్పి ఉప నేత టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ మహాసభలు తెలుగు భాషాభివృద్ది కోసం జరుగుతున్నట్లు లేవని,రాజకీయ కోణంలోనే జరుగుతున్నట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మహాసభలకోసం ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం తెలుగు భాష అమలుపై ఆచరణలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు.. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషను పెద్దగా పట్టించుకోరని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
    మరోవైపు రచయితలు వరవరరావు ,వేణుగోపాల్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ముందస్తు అరెస్టులు చేసింది . ప్రజాగాయకుడు గద్దర్,విమలక్కలను  దూరం పెట్టింది 
    ఈ సభలను బహిష్కరించాలని  విప్లవ రచయితల సంఘం పిలుపు నిచ్చింది . తన వైబ్ సైట్ లో ... 


    రచయితలు ప్రభుత్వానికి, వ్యవస్థకు నిరంతర ప్రతిపక్షంగా ఉండాలి

    తెలుగు ప్రజలారా, కవులారా, కళాకారులారా,
    తెలుగు నేల మీద ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నలభై రెండేళ్లలో మూడోసారి జరగబోతున్నాయి. ఈసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. తమ మీద వ్యక్తమవుతున్న ప్రజా నిరసనను దారి మళ్లిండానికే పాలకులు ప్రపంచ తెలుగు మహాసభలను జరుపుతున్నారు. కనుక గత రెండు సందర్భాల్లో వలె ఈసారీ విప్లవ రచయితల సంఘం డిసెంబర్‌ 15 నుంచి 19 దాకా జరగనున్న ఈ సభలను బహిష్కరిస్తున్నది. రచయితలు, కళాకారులు, ప్రజలు ఇందులో భాగం కావాలని పిలుపు ఇస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహిస్తున్నాడు. తెలుగు ప్రజల మాతృభాషను ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అమలు చేస్తామని, తెలంగాణ భాషా, సంస్కృతి, చారిత్రిక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ విస్మరణకు గురైన తెలంగాణ సాహితీ ప్రముఖులను బయటికి తీస్తామనే నినాదంతో ఈ సభలు జరుగుతున్నాడు. చూసే వాళ్లకు, వినే వాళ్లకు మంచిదే కదా! తెలుగు మహాసభలు జరగటమని అనిపించవచ్చు. కానీ ఇదొక నెపం మాత్రమే.

    నిజానికి మాతృభాషగా తెలుగును అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రారంభించవచ్చు. అది జరగలేదు. ప్రభుత్వ పాలన తెలుగులోనే ఉండాలని ఇప్పటికే అనేక జీవోలున్నాయి. కనీసం దీన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ చరిత్రను, సాహిత్యాన్ని బయటికి తీయాలంటే ప్రభుత్వమే దానికోసం కొన్ని సెంటర్లను ప్రారంభించవచ్చు. తెలంగాణలోని ఆరు విశ్వవిద్యాలయాల్లోని చరిత్ర, తెలుగు శాఖలను బలోపేతం చేయడానికి ఖాళీ పోస్టులను నింపి, నిధులు కేటాయించి, పరిశోధనలు ప్రారంభించి ఉండవచ్చు. కానీ విశ్వవిద్యాలయాల్లోని తెలుగు, చరిత్ర శాఖలు ప్రొఫెసర్లు లేక, పరిశోధనలకు నిధులు లేక నిస్సారంగా తయారయ్యాయి. ఏ ఒక్క నిర్మాణాత్మక కృషి చేయకుండా ఎన్నికల ముందు ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి కేవలం ఆడంబరాల కోసమే ప్రభుత్వం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతోంది. 
     ఈ మూడున్నరేళ్ల కాలంలో పౌర, ప్రజాస్వామిక హక్కులను అన్ని రకాలుగా అణచివేసింది. విద్యార్థి ఉద్యమ నాయకుల అరెస్టులు, కేసులు మామూలైపోయాయి. చివరికి నలుగురు కలిసి హాలు మీటింగులు కూడా నిర్వహించుకోలేని నిర్బంధ వాతావరణం అమలవుతోంది. తెలంగాణ వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని అనుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రజలకు నిరాశే మిగిలింది. పైగా వాళ్ల నిరసన మీద తీవ్ర నిర్బంధం అమలవుతోంది. తన ప్రజా వ్యతిరేక పాలనను కవులు, కళాకారులు, రచయితలు ప్రశ్నించకుండా ఉండేందుకు, వాళ్లను భ్రమల్లో ముంచేందుకు, వీలైనంత మంది రచయితలను తన ప్రభుత్వానికి విధేయులుగా మార్చుకునేందుకే కేసీఆర్‌ ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నాడు.రచనకు, కళారూపానికి పాలకులు ఇచ్చే గుర్తింపును తెలంగాణ ..జనశీలురు ఏనాడో అధిగమించారు. ఈ స్ఫూర్తితో మా పిలుపును ఆహ్వానిస్తారనే నమ్మకం ఉంది. శ్రమజీవుల ఆరాట పోరాటాలే మన రచనలకు వస్తువు. ప్రజలు మన రచనను గుండెల్లో దాచుకొని ప్రేమతో గౌరవించుకోవటంలోనే మనకు గుర్తింపు ఉంటుంది. అందుకే... పెట్టుబడిదారుల డబ్బుతో, పాలకుల ఆదేశాలతో, బ్రాహ్మణీయ భూస్వామ్య విలువలతో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకావద్దని ప్రజాపక్షం వహించే రచయితలను కోరుతున్నాం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాషా సాహిత్యాలను మనమే తవ్వితీసి వాటికి సమున్నత గౌరవం ఇద్దాం. .అంటూ ఈ సభలను బహిష్కరించాలని కోరారు .


    మరో వైపు ప్రపంచ మహాసభల చివరి రోజు అయినా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానించాలని తెలుగుదేశం కోరింది.  మొత్తం మీద తెలుగు మహాసభలు రాజకీయ రంగు పులుముకున్నాయి .సభలపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి 
    శ్రీహర్ష 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రపంచ తెలుగు మహాసభలపై భిన్నస్వరాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top