Translate

  • Latest News

    25, జనవరి 2018, గురువారం

    వివాదాలతో పద్మావత్ కు కావాల్సినంత పబ్లిసిటీ


    ఈ చిత్రానికి వచ్చినన్ని వివాదాలు మరే సినిమాకు రాలేదు. భన్సాలీ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పద్మావత్’. అయితే ఈ సినిమా విడుదలకు ముందే యూనిట్‌పై దాడులు జరిగాయి. సినిమా పూర్తయిన తర్వాత సినిమాను విడుదల చేయకూడదని రాజ్‌పుత్ కర్ణిసేనలు ఆందోళనలు చేపట్టడం సహా కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కొందరు సినిమా విడుదలపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు . కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు పద్మావతి  పై  నిషేధం కూడా విధించాయి. అయితే సెన్సార్ వారు ఐదు కట్స్ విధించి సినిమా విడుదలకు అనుమతి ఇస్తూనే టైటిల్‌ను ‘పద్మావత్’గా మార్చమని సలహా ఇవ్వడం తదితర అంశాలతో పద్మావత్ టైటిల్ ‘పద్మావత్’గా మారి ప్రేక్షకుల ముందకు వచ్చింది.  
    మేవాడ్ రాజు రావల్ రతన్ సింగ్(షాహిద్ కపూర్) తన మొదటి భార్యకు ముత్యాలు తేవడానికి సింహళ దేశానికి వస్తాడు. ఆ దేశ యువరాణి పద్మావత్(దీపికా పదుకొనే) వేటాడే సమయంలో... అనుకోకుండా ఆమె బాణం రతన్ సింగ్‌కు తగిలి ప్రమాదం జరుగుతుంది. అయితే రతన్‌సింగ్‌ను పద్మావత్ కాపాడుతుంది. పద్మావత్ని తొలి చూపులోనే ప్రేమించిన రతన్ సింగ్ ..ఆమె తండ్రి అనుమతితో విహహం చేసుకుని మేవాడ్‌కు మహారాణిని చేస్తాడు. అదే సమయంలో అఫ్ఘనిస్థాన్‌కు చెందిన జలాలుద్ధీన్ ఖిల్జీ ఢిల్లీని తన సైన్యంతో ఆక్రమిస్తాడు. అయితే జలాలుద్ధీన్‌ను అల్లావుద్ధీన్ ఖిల్జీ హతమార్చి ఢిల్లీ సుల్తానుగా అవతరిస్తాడు. దేశద్రోహ శిక్షకు గురైన మేవాడ్ రాజగురువు రాఘవ చింతనుడు ద్వారా పద్మావత్ అందచందాలు గురించి తెలుసుకున్న అల్లావుద్ధీన్ మేవాడ్‌పై దండెత్తుతాడు. తదనంతరం పరిస్థితులు ఏంటి? అల్లావుద్ధీన్ పద్మావత్ని దక్కించుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసు కోవాలంటే సినిమా చూడాల్సిందే..
    సినిమాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీది ప్రత్యేకమైన శైలి. ఆయన సినిమాలు లార్జర్ దేన్ లైఫ్ అనేలా ఉంటాయి. ముఖ్యంగా హిస్టారికల్ సినిమాలు జోథా అక్బర్, బాజీరావ్ మస్తానీ వంటి వాటిని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న సంజయ్ లీలా భన్సాలీ.. అంతే గ్రాండియర్‌గా ‘పద్మావత్’ను తెరకెక్కించారు. మేవాడ్ కోటలు, రాజపుత్రులు, రాజపుత్ర స్త్రీలు వారి వేషధారణ, వారి నృత్యాలు అన్నింటినీ అద్భుతంగా చూపించాడు.
    అయితే రాణి పాత్రలో దీపికా కొన్ని సన్నివేశాల్లో మరీ పీల గా అనిపిస్తుంది. కాస్టూమ్స్ ఆమెకు సూట్ కాలేదు. ఇక అల్లావుద్ధీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ అద్భుతంగా నటించాడు. నెగిటివ్ షేడ్‌లో మంచి నటనను ప్రదర్శించాడు. రతన్ సింగ్ గా షాహిద్ కపూర్ నటన కూడా బావుంది.  ఫస్టాఫ్ కొంచెం  సాగదీతగా అనిపిస్తుంది. సెకండాఫ్ కూడా స్లో నెరేషన్ కారణంగా కాస్త విసుగ్గానే ఉంటుంది. అందుకు కారణం బలమైన కథ లేకపోవడం.. అయితే గ్రాండ్‌నెస్ ప్రేక్షకుడిని సీట్ నుండి కదలనీయదు. మరి సామాన్య ప్రేక్షకుడి సంగతి చెప్పలేం. మేకింగ్ పరంగా సినిమా గ్రాండ్‌గా ఉన్నప్పటికీ సినిమాలో పాత్రలు, సన్నివేశాల మధ్య ఎమోషన్స్ సరిగ్గా పండలేదు. వివాదాలతో సినిమాకు  మాత్రం కావాల్సినంత పబ్లిసిటీ అయితే దక్కింది. సినిమాపై అంచనాలు కూడా మొదలయ్యాయి. అయితే సినిమా చూసిన సగటు ప్రేక్షకుడికి ఈ సినిమాకు ఇంత వివాదం ఎందుకు చేశారనిపించింది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వివాదాలతో పద్మావత్ కు కావాల్సినంత పబ్లిసిటీ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top