Translate

  • Latest News

    15, మార్చి 2018, గురువారం

    రసకందాయంలో ఏపీ రాజకీయం


    ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఏపీ రాజకీయం  రసకందాయంగా మారింది. బుధ, గురువారాల్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటిదాకా చంద్రబాబు జేబులో మనిషి అని విమర్శలు ఎదుర్కొన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ పైన, చంద్రబాబు పైన, ఆయన తనయుడు లోకేష్ పైనా నేరుగా విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. ఇప్పటివరకు మిత్రుడుగా ఉన్న పవన్ తమపై ఈ విధంగా విరుచుకుపడతారని వారు సైతం ఊహించి ఉండరు. ఒక రకంగా అధికార టీడీపీలో ప్రకంపనలు సృష్టించారనే  చెప్పాలి. పవన్ మాట్లాడుతున్న మాటలు ఆయన పరిణితికి నిదర్శనంగా భావించాలా... లేక వెనుక ఎవరైన అదృశ్యశక్తి ఉండి నడిపిస్తుందా అన్నది ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో నడుస్తున్న చర్చ. మరోవైపు పవన్ ప్రసంగ పాఠం ఉండవల్లి అరుణకుమార్ దని కూడా టీడీపీ నాయకులు భావిస్తున్నారు.
    ఆత్మరక్షణలో పడిపోయిన టీడీపీ 
    ఇన్నాళ్లు జగన్ నోటి వెంట వచ్చిన విమర్శలు ప్రత్యర్థి పార్టీ కువిమర్శలు అని కొట్టిపారేసి టీడీపీ నాయకులు  జనాల్ని మభ్యపెట్టారు. ఇప్పడు నిన్నటి దాకా వారి అడుగులో అడుగు వేసిన మనిషి అదే విమర్శలు చేయడం టీడీపీని ఆత్మరక్షణలో పడేసింది. ఇప్పడు వారు బురద అంతా బీ.జె.పీ పై చల్లడం మొదలెట్టారు... పవన్ ను, జగన్ ని కూడా బీ.జె.పీ వెనక ఉండి నడిపిస్తూ మా మీద దాడి చేయిస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్రంలో టీడీపీని అణగదొక్కడానికి పెద్ద కుట్ర జరుగుతోందని వాపోతున్నారు. మరి నిన్నటిదాకా భుజాలు, భుజాలు పూసుకుని తిరిగిన వారే ఇప్పుడు ఒకరి కాళ్ళ కింద ఒకరు గోతులు తవ్వుకుంటున్నారేమో.
    పవన్ వలన నష్టం ఎవరికి..?
    ఇదిలా ఉంటె పవన్ ఈ నెల 19 దాకా విజయవాడ లోనే మకాం వేసి తన పార్టీ నిర్మాణంపై సీరియస్ గా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం విజయవాడలో ఎన్.ఆర్,ఐ లతో సమావేశమై తమ పార్టీకి సహకరించమని కోరడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పవన్ పోటీ చేస్తామని చెప్పటం వలన రానున్న ఎన్నికల్లో టీడీపీకి నష్టమా,వైసీపీకి నష్టమా అనే చర్చలు ఊపందుకున్నాయి. పవన్ వెనుక ఎవరు ఉన్నా జనసేన  రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ పార్టీగా రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చిందనడంలో ఎటువంటి  సందేహం లేదు.
    రేపే అవిశ్వాస తీర్మానం పెట్టనున్న వై.సి.పీ 
    మరో పక్కబుధవారం 1500 కి.మీ. పాదయాత్ర పూర్తిచేసిన  జగన్ రాజకీయంగా మరో అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నాడు. మొదట ప్రకటించినట్టు ఈ నెల 21 న కాకుండా రేపే (మార్చ్16) పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తమకు సహకరించవలసిందిగా టీడీపీ తో సహా పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. మరి అవిశ్వాసం పెట్టండి మద్దతు నేను సమీకరిస్తా అన్న పవన్ ఈ పార్టీల నుంచి ఎంతమంది మద్దతు తీసుకొస్తారో చూడాలి.
    మరి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మాటలు మార్చే నాయకులకు ఓటేస్తారో... మొదటి నుంచి ఒకే మాట మీద నిలబడి వారికి ఓటేస్తారో వేచి చూడాలి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రసకందాయంలో ఏపీ రాజకీయం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top