Translate

  • Latest News

    30, మే 2018, బుధవారం

    వేదాంత సారం ఇంతేనయా...



    13 మంది ప్రజలు ప్రాణ త్యాగం చేస్తే తప్ప తమిళనాడులో వేదాంత గ్రూప్ కు చెందిన  స్టెరిలైట్ కర్మాగారం మూత పడలేదు. ఇరవై ఏళ్ల కిందట తూత్తుకుడి లో నెలకొల్పిన ఈ కర్మాగారం దేశంలో ఉత్పత్తి చేసే మొత్తం రాగిలో 40 శాతం ఇక్కడే ఉత్పత్తి చేస్తోంది. ఆ ఫ్యాక్టరీ పుణ్యమా అని 800 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నిజమే ఇంత మేలు కన్నా... ఇంతకు వెయ్యి రేట్లు కీడు చేస్తోందనే అక్కడి ప్రజల ఆవేదన. ఆ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న విష వాయువుల కారణంగా చుట్టూ పక్కల పది గ్రామాల ప్రజలు  కళ్ళు మండడం శ్వాస సంబంధమైన రోగాలు, చర్మ రోగాలతో బాధపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ విషయం గురించి మొత్తుకుంటున్నా పట్టించుకునే నాధుడు లేకపోవడంతో చివరకు ఆందోళనకు దిగారు. తమ ఆందోళనలో భాగంగా 99 రోజుల పాటు శాంతియుతంగా వివిధ రూపాల్లో ఆందోళన చేసారు. ఆందోళన 100 వ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ రోజే మారణ కాండ జరిగింది. ఆందోళనకారులు కూడా రెచ్చిపోయి దాదాపు 30 ద్విచక్ర వాహనాలు తగులపెట్టారు. కలెక్టర్ కార్యాలయం లో రికార్డులకు నిప్పు పెట్టారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్టుగా  పోలీసులు వెంటనే తమ తుపాకులకు పని పెట్టి 13 మంది ప్రజల ప్రాణాలు తీశారు... ఈ మాట ఎందుకు అంటున్నానంటే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టాలంటే భాష్ప వాయువు ప్రయోగించవచ్చు. ఫైర్ ఇంజెన్లతో వాటర్ ప్రయోగించవచ్చు. రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించవచ్చు. గాలి లోకి కాల్పులు కాల్చవచ్చు. ఇవేమీ చేయకుండా... నేరుగా ప్రజలపై కాల్పులు కాల్చారంటేనే ప్రభుత్వ , పోలీసుల పైశాచిక ధోరణి అర్ధమవుతోంది. 
    ఏళ్ల తరబడి ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం చివరకు 13 మంది ప్రాణాలు బలిస్తే కానీ ఆ ఫ్యాక్టరీని మూయించలేదు. ఇవి తోలు మందం ప్రభుత్వాలు కదా. అందుకే ప్రజలు కూడా శాంతియుతంగా ఆందోళన చేస్తే వాటి చెవికి ఎక్కవని హింసాయుత ఆందోళన వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు విప్లవ కారుల పట్ల ఆకర్షితులవుతున్నారంటే అందుకు కారణం ముమ్మాటికీ ప్రభుత్వ వైఖరే...అందుకే 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత దేశంలో దాదాపు కోటి మంది ప్రజలు (అంటే దేశ  జనాభాలో సుమారు 8 శాతం) జనతన సర్కార్ పేరుతొ దండకారణ్యంలో మావోయిస్టుల సమాంతర పాలనలో జీవిస్తున్నారు. గ్రీన్ బెల్ట్ పేరుతొ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ధోరణులపై ఉద్యమిస్తున్నారు.  ప్రభుత్వం నియంతృత్వ పోకడలు విడనాడి, కార్పొరేట్ల కౌగిళ్ళ నుంచి బయట పడితే తప్ప దానికి పేద ప్రజల ఆక్రందనలు వినపడవు. ఇవాళ తమిళనాడులో జరిగిందే రేపు ఆంధ్ర లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా పార్క్ ఆందోళనలో జరగొచ్చు. లేదా శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కావచ్చు... లేదా అదే జిల్లాలో సోంపేట, కాకరాపల్లి పవర్ ప్లాంట్ వద్ద జరగొచ్చు. ప్రభుత్వాల అనాలోచిత, స్వార్ధ ధోరణులే ఈ అనర్ధాలకు కారణం.  

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వేదాంత సారం ఇంతేనయా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top