Translate

  • Latest News

    26, సెప్టెంబర్ 2018, బుధవారం

    తుడిచిపెట్టింది మావోయిస్టులనా... ప్రభుత్వ ఆస్తులనా..?


    రాష్ట్రంలో మావోయిస్టులు అనేవారే లేరు...వారిని పూర్తిగా తుడిచిపెట్టేశాం... అంటూ అప్పుడప్పుడు మన పోలీస్ ఉన్నతాధికారులు...రాజకీయ నాయకులు ప్రకటించేస్తూ ఉంటారు. కానీ... మావోయిజం అనేది ఒక భావజాలం. వ్యక్తులను మట్టుపెట్టగలరు కానీ... భావజాలాన్ని తుడిచిపెట్టడం అనేది అసాధ్యం. కొందరు వ్యక్తులను ఎన్కౌంటర్ చేసి... మావోయిస్టులను తుడిచిపెట్టేశామ్  అనుకోవడం అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అణచివేత ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుంది. కానీ... పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే వెనక్కి తగ్గిందని కాదు. అదను కోసం మాటు వేసిందని భావించాలి. నిజానికి రామగుడ ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలిన మాట వాస్తవమే ... రామగూడ దాడిలో మావోయిస్టు అగ్ర నేతలతో పాటు మొత్తం 31 మంది మావోయిస్టులను మట్టుపెట్టి, పోలీసులు సంబరాలు చేసుకున్నారు. దానికి  తోడు గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి అలికిడి లేకపోవడంతో ఇక మావోయిస్టుల పని అయిపోయిందని భావిస్తూ... అతి విశ్వాసంతో... నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలెనే అధికార పార్టీ ఎం.ఎల్.ఏ తో పాటు మాజీ ఎం.ఎల్.ఏ ప్రాణాలు బలయ్యాయి. ఇది నిస్సందేహంగా ప్రభుత్వ వైఫల్యమే... ఆకాశం నుంచి అరగంట తర్వాత పడబోయే పిడుగుల గురించి ముందే సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని, ప్రజలను అప్రమత్తం చేస్తున్న అత్యంత ఆధునిక సమాచార వ్యవస్థ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో  ఒడిశా సరిహద్దుల నుంచి 60 మంది మావోయిస్టులు వచ్చి రెండు రోజుల పాటు లివిటిపుట్టు లో మకాం వేసి ఇద్దరినీ కాల్చి చంపిన తర్వాత కూడా తాపీగా నడుచుకుంటూ ఒడిశా వైపు వెళ్లిపోయారంటే... అసలు ఇక్కడ ప్రభుత్వం అనేది  ఉందా... పోలీస్ వ్యవస్థ అనేది ఉందా... నిఘా వ్యవస్థ ఉందా... అనే అనుమానాలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న పెద్దల దృష్టి అంతా తమ బాక్సీట్ వ్యాపారానికి మావోయిస్టులు అడ్డు లేకుండా చేసుకోవాలని భావించి.. ఎన్కౌంటర్లు చేయించేసి... కొంతమందిని మట్టుపెట్టేసి... ఇక మనకు అడ్డు లేదనుకుంటూ సంబరాలు చేసుకుని, ధన దాహంతో భూములు పారిశ్రామిక వేత్తలకు అప్పగించేసి... వారు విదిలించే ఎంగిలి మెతుకుల కమిషన్ కోసం అంగలార్చే రాజకీయ నాయకులే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. తమ విధి నిర్వహణలో వైఫల్యం చెందిన పోలీసులు ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇక ఎవరో కొంతమంది గిరిజనులనో లేదా మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తుడిచిపెట్టింది మావోయిస్టులనా... ప్రభుత్వ ఆస్తులనా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top