Translate

  • Latest News

    27, సెప్టెంబర్ 2018, గురువారం

    ప్రజా ప్రతినిధులా...దోపిడీ దొంగలా..?


    ఐదేళ్ల కొకసారి మనం ఓట్లు వేసి గెలిపిస్తున్నది మనకు ఐదేళ్లపాటు సేవ చేసే ప్రజా ప్రతినిధులనా... లేక ఐదేళ్లపాటు మన నెత్తి మీద ఎక్కి కూర్చుని ఇష్టారాజ్యంగా ప్రజల ఆస్తులని దోపిడీ చేసే దోపిడీ దొంగలనా... మరో ఐదారు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే... ఒక్కసారి మనం ఓటు వేసి గెలిపించాక ఎం.ఎల్.ఏ అనే మూడక్షరాల స్టిక్కర్ కారు ముందు అద్దంపై వచ్చాక... ఇక అయన గారు లేదా ఆవిడ గారు ఎవ్వరి మాట వినరు. ఆ మూడక్షరాలు దోపిడీకి లైసెన్స్ లా భావించేస్తున్నారు. తమను గెలిపించిన పార్టీ ఒక వేళ అధికారంలో లేకపోతే... అధికారం కోసం... వారిచ్చే కోట్ల కోసం... గనుల తవ్వకాల లైసెన్సుల కోసం అధికార పార్టీకి నిస్సిగ్గుగా అమ్ముడుపోతున్నారు. తమను గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. పైగా తాము చేసే వెధవ పనికి సమర్ధనగా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం... అని ఒక ముసుగు తొడుగుతారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న తంతు ఇదే... ఇది అందరకూ తెలిసిన విషయమే... అయితే గత ఆదివారం ఒక గిరిజన ఎం.ఎల్.ఏ, మరో  మాజీ గిరిజన ఎం.ఎల్.ఏ లను మావోయిస్టులు  హత్య చేసిన నేపథ్యంలో ఒక్కసారి చర్చించుకోవాల్సిన అగత్యం వచ్చి పడింది. హత్య చేయడానికి ముందు మావోయిస్టులకు, హతులకు మధ్య జరిగిన సంభాషణ లో కిడారి సర్వేశ్వరా రావు తెలుగుదేశం పార్టీ లోకి ఫిరాయించడానికి కారణం తనకు గిరిజన కోటా లో మంత్రి పదవి ఇస్తామన్నారని, అది కాక 12 కోట్లు ఇచ్చారని, దాంతో పాటు బాక్సిట్ గనులు తవ్వుకోవడానికి మంత్రి నారా లోకేష్ లైసెన్సులు ఇప్పించారని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆంతేకాక మాజీ ఎం.ఎల్.ఏ సివేరి సోమ కు గనుల తవ్వకాల్లో 25 శాతం వాటా ఇచ్చి ఇద్దరూ కలసి గనులు తవ్వుకుని ఎంచక్కా దోచుకుంటూ  ఐకమత్యంగా ఉండండని తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. మావోయిస్టులు కిడారి మాటలను రికార్డు చేసినట్టు తెలుస్తోంది.  మావోయిస్టులు కనుక ఆ వాయిస్  రికార్డ్ విడుదల చేస్తే ఒక రకంగా చనిపోయే ముందు ఎం.ఎల్.ఏ సర్వేశ్వరరావు చెప్పిన విషయాలు ఆయన  మరణ వాగ్మూలంగా భావించాలి. ఎటొచ్చి ప్రభుత్వం హంతకులైన మావోయిస్టులపై చర్యలు తీసుకుంటుంది.. అది ఓకే... అయితే కిడారికి డబ్బు, పదవి, లైసెన్సులు ఆశ చూపి పార్టీ ఫిరాయింపచేసిన అధికార పార్టీ పెద్దల పైన కూడా ఆ రికార్డు ను ఆధారంగా చేసుకుని కోర్టులే స్వయంగా సుమోటో గా స్వీకరించి విచారణకు ఆదేశించాలి. అఫ్ కోర్స్... నేతలు ఆ వాయిస్ నిజం కాదు. డబ్బింగ్ చెప్పించారు అనొచ్చు. అసలు ఏదో నిరూపించడానికి వాళ్ళు బతికి లేరు. సో... ఆ కేసు వీగి పోతుంది... కానీ... నేతలకు ఒక భయం... హద్దు...అదుపు అనేది ఉండాలి. ఇకపై డబ్బు కోసం గడ్డి తినే నేతలకు ఈ ఉదంతం ఒక గుణపాఠం కావాలి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రజా ప్రతినిధులా...దోపిడీ దొంగలా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top