Translate

  • Latest News

    25, ఫిబ్రవరి 2019, సోమవారం

    వామపక్షాల ఓట్లపై టీడీ.పీ కన్ను

     
    వామపక్షాల ఓట్లపై టీడీ.పీ కన్ను వేసింది. ఎన్నికల కురుక్షేత్రంలో త్రిశంకు స్వర్గంలో ఉన్న వామపక్షాలకు నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. వామపక్షాలు గనుక పోటీ చేస్తే ఆ ఓటు బ్యాంకు గంపగుత్తగా వారికే పడతాయి. లేదా వారు ఎవరిని సపోర్ట్ చేస్తే వారికే వేస్తారు. అయితే వేరే పార్టీ కి వేసే క్రమంలో కొంత క్రాస్ ఓటింగ్ జరగవచ్చు. 2019 ఎన్నికల్లో వామపక్షాలు అటు తెలుగుదేశం, ఇటు వై.ఎస్.ఆర్.సి.పీ కి కాకుండా తృతీయ ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చిన జనసేనతో కలసి నడుస్తామని గత రెండేళ్లుగా చెబుతా వస్తున్నాయి.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయవాడలో సి.పీ .ఐ కార్యదర్శి రామకృష్ణ, సి.పీ.ఎం కార్యదర్శి మధు తో  భుజం..భుజం కలిపి నడిచారు. దాంతో ఈసారి ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు కలసి పోటీ చేస్తాయనే అందరూ అనుకునేలా వ్యవహరించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత రెండు, మూడు నెలలుగా పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు వచ్చింది. జనసేన మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తుందని చెబుతూ వస్తున్నారు. అలాగే అంటారులే...చివరకు వచ్చేసరికి మనతోనే పొత్తు పెట్టుకుంటారులే అనుకుని వామపక్షాలు ఇంతవరకూ ఎదురుచూస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు పవన్ తమ పార్టీ నాయకుల నుంచి 175 సీట్లకు టిక్కెట్ల కోసం దరఖాస్తులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో ఇక జనసేన, వామపక్షాల పొత్తు లేనట్టే అని తేలిపోయింది. ప్రస్తుతం వామపక్షాల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా తయారయింది. 
    ఈ దశలో ఎన్నికల మేనేజిమెంట్ లో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఇప్పుడు వామపక్షాల ఓట్లపై కన్నేశారు. గెలుపునకు ప్రతి ఒక్క ఓటు ముఖ్యమేనన్న సూత్రాన్ని బాగా తెలిసిన వ్యక్తి అయిన  చంద్రబాబు గ్యారంటీగా పడే వామపక్షాల ఓట్లను తన వైపు మలచుకుంటే గెలుపు ఖాయం అనే ఉద్దేశంతో వామపక్షాల ఓట్లకు గాలం వేశారు. ఆ వ్యూహంలో భాగంగానే సాధారణ ఎన్నికలకు ముందుగా ప్రస్తుతం జరగనున్న ఎం.ఎల్.సి ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీని ద్వారా  వామపక్షాల అభ్యర్థుల గెలుపునకు పరోక్షంగా దోహదపడి వారు గెలిచేలా చేస్తారు. దీనికి ప్రతిఫలంగా సాధారణ ఎన్నికల్లో వామపక్షాల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశంకు  వేసేటట్టు రహస్యంగా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. చంద్రబాబా... మజాకా... గెలుపు కోసం ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలను సమర్ధవంతంగా వినియోగించుకోగలిగిన నేర్పరి. ఇండియా టుడే చేసిన సర్వేలో చూపించిన గాప్ 9 శాతంను పూడ్చుకోవడానికి ఓ పక్క ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పధకాలను ప్రకటిస్తూ.... డ్వాక్రా మహిళలు, రైతులు, ఇతరత్రా వర్గాల ఓట్లకు గాలం వేస్తూనే, నిర్దిష్ఠమైన ఓటు బ్యాంకు ఉన్న వామపక్షాల ఓట్లపై గురి పెట్టడం ద్వారా గాప్ ను పూడ్చుకుని చంద్రబాబు  విజయ ఢంకా మోగించగలరని తెలుగుదేశం పార్టీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. 
    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    Item Reviewed: వామపక్షాల ఓట్లపై టీడీ.పీ కన్ను Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top