Translate

  • Latest News

    11, మే 2019, శనివారం

    పేదల చావులే వారికి వరం...



    పేదోళ్ల యాక్సిడెంట్ కేసులు వచ్చాయంటే వారికి వరమే... పేదోడు బతికితే ఎంత... ఛస్తే ఎంత... బతికి ఏం సాధించాలని... అన్నట్టుంటుంది వారి ఆలోచన. పొరపాటునో...గ్రహపాటునో ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదంలో ఖర్మ కాలి ఓ పేదోడికి యాక్సిడెంట్ జరిగితే ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్ళారా... బతికి బట్ట కట్టే ఛాన్సులు తక్కువ. ఎందుకంటే పేదోడిని  బతికిస్తే వారికేమి వస్తుంది... పదో..పరకో తప్ప... అదే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి, బంధువులను పిలిచి అవయవ దానానికి ఒప్పిస్తే... పేపర్లోళ్ళు వారిని గొప్పగా పొగిడేస్తారు... అది చూసి ముచ్చట పడిపోవచ్చు. పోయినోడు ఎలాగూ తిరిగి రాడు. ఆస్పత్రి వాళ్ళు ఎలాగో అతని అవయవాలను కోట్లల్లో అమ్ముకుంటారు కాబట్టి అతని హాస్పిటల్ ఖర్చులు మాఫీ చేసేస్తారు...  కాబట్టి పోయినోడి బంధువులు కూడా  డబుల్ హ్యాపీ. ఈ రకంగా అవయవ దానం పేరుతొ రాష్ట్రంలో అవయవాల వ్యాపారం జోరుగా సాగిపోతోంది. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న మార్క్స్ మహాశయుడి వాక్కు నేటి సమాజంలో అడుగడుగునా నిజమవుతూనే ఉంది. అవయవాల దానం పేరుతొ సామాన్యుల ప్రాణాలను పూచిక పుల్ల కింద తీసిపారేస్తూ కార్పొరేట్ ఆస్పత్రులు యధేశ్చగా అవయవాల వ్యాపారం చేస్తున్నాయి. ఇటీవల నెల్లూరు సింహపురి హాస్పిటల్ ఉదంతం వెలుగు లోకి రావడంతో అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు... కానీ బయటకు రాని దొరలెందరో...
    అవయవ దానం లాంటి  ఒక గొప్ప మానవీయ కార్యక్రమం కూడా కార్పొరేట్ ఆస్పత్రుల పాలిట వరంగా మారింది. నెల్లూరు సింహపురి ఆస్పత్రి ఉదంతం అల్లరి అయ్యాక కూడా ఆ ఆస్పత్రి యాజమాన్యాన్ని కాపాడడానికి పాలకులు, అధికారులు ఇతోధికంగా ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఏవీ కనీసం ఈ ఘోరాన్ని గురించి ప్రశ్నించిన పాపాన పోలేదు. పోయిన ప్రాణాలు ఆఫ్ట్రాల్ ఒక పేద గిరిజనుడివే కదా... ఎవరికి ఏం అవసరం... అందుకే ఎవరికి వారు నోళ్లకు తాళాలు వేసుకుని కూర్చున్నారు. ఈ కేసులో నిజాయితీగా వ్యవహిరించి  సింహపురి ఆస్పత్రికి నోటీసులు ఇచ్చిన జిల్లా వైద్య శాఖాధికారి వర  సుందరం ఈ నెల 17 వ తేదీ లోగా ఆస్పత్రి రిజిస్ట్రేషన్ ఎందుకు రద్దు చేయకూడదో సంజాయిషీ అడిగారు. అయితే ఈ లోగానే  తనపై వచ్చిన ఒత్తిళ్లకు తట్టుకోలేక నెల రోజులు  సెలవుపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో రమాదేవిని ఇంచార్జ్ గా  నియమించారు. ఈ లోగా కామ్ గా ఆ ఆస్పత్రిని హైదరాబాద్ మాక్స్ క్యూర్ ఆస్పత్రి వారు టేకోవర్ చేశారు. ఇంకేముంది కేసు...గీసు... ఏమీ లేకుండా మాఫీ చేసేస్తారు. కథ కంచికి వెళ్ళిపోతుంది. వైద్య వ్యాపారం మళ్ళీ మూడు పువ్వులు...ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది...


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పేదల చావులే వారికి వరం... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top