Translate

  • Latest News

    24, మే 2019, శుక్రవారం

    జగన్ ముందున్న సవాళ్లు


    రాష్ట్ర ప్ర‌జ‌లు సుస్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చేశారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ఈ నెల 30వ‌తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు త‌న పాల‌న ఉంటుంద‌ని, రానున్న కాలంలో మంచి ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు దుర్మాగ‌పు పాల‌న‌పై విసిగి వేసారిన ప్ర‌జ‌లు జ‌గ‌న్ పై  న‌మ్మ‌కం పెట్టుకొని ఉన్నారు. మంచి చేయాల‌న్న సంక్ప‌లం ఉంటే స‌రిపోదు. అందుకు త‌గ్గ వ‌న‌రులు ఉండాలి. అధికారులు, పార్టీ నేతలు క‌లిసిరావాలి. అతి పిన్న వ‌య‌స్సులోనే సీఎం పీఠం ఎక్కిన జ‌గ‌న్ ముందు అనేక స‌వాళ్లు ఉన్నాయి. వీటిని జ‌గ‌న్ ఎలా అధిగ‌మిస్తారు...? అన్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌.
    సమస్యల సుడిగుండంలో..  
    రాష్ట్ర పాల‌న‌ను పూర్తిస్థాయిలో అట‌కెక్కించి నిత్యం త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం, వ్య‌క్తి పూజ కోసం చంద్ర‌బాబు కోట్లు వెచ్చించారు. రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు విల‌య‌తాండ‌వం చేస్తున్నాయి. మండుటెండ‌ల్లో ప్ర‌జ‌లు పిట్టల్లా రాలిపోతున్నారు. గుక్కెడు నీటి కోసం ప్ర‌జ‌లు అల‌మ‌టిస్తున్నారు. ప్ర‌జారోగ్యం అట‌కెక్క‌టంతో అనేక వ్యాధుల‌తో ఆసుప‌త్రు పాలౌతున్నారు. ఎన్నిక‌ల ముందు ప్ర‌భుత్వ డ‌బ్బుతో ఓట్లు కొన‌టానికి నిదులన్నీ దారి మళ్లించి  ఖ‌జానా ఖాళీ చేశారు. దీంతో కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌భుత్వానికి ఆర్ధిక వ‌న‌రులు పెద్ద స‌మ‌స్య‌గా మారే అవ‌కాశం ఉంది. 
    ఇదిలా ఉంటే పోల‌వ‌రం నిర్మాణం, ఆ నిర్మాణంలో తెలంగాణా, ఒడిస్సా ప్ర‌భుత్వాల నుంచి ఉన్న అడ్డంకులు, రాజ‌ధాని నిర్మాణం త‌దితర అంశాల‌పై జ‌గ‌న్ ఆచితూచి నిర్ణ‌యం తీసుకోవ‌ల్సి ఉంటుంది. మ‌రోవైపు ప్ర‌భుత్వంలో కార్య‌నిర్వాహ‌క వ‌ర్గంలో ఉన్న అధికారులు ఇప్ప‌టికే  ప‌లు గ్రూపులుగా మారి పాల‌న‌ను విస్మ‌రించారు.వీరిని గాడిన పెట్ట‌డం కూడా త‌ల‌కు మించిన ప‌నే. వీటితో పాటు పార్టీలో అనేక మంది సీనియ‌ర్లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. వీరికి మంత్రి వ‌ర్గంలో స‌రైన ప్రాతినిధ్యం క‌ల్పించ‌టం కూడా ఇప్పుడు జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌ర‌మైన అంశ‌మే. పార్టీ విజ‌యానికి కార‌ణ‌మైన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కం అమ‌లు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు పాద‌యాత్ర స‌మ‌యంలో చేసిన హామీల అమ‌లు ఇవన్నీ జ‌గ‌న్ ముందున్న స‌వాళ్లు . వీటిని జ‌గ‌న్ ఎలా అధిగ‌మిస్తారు.. స‌మ‌ర్ద‌వంత‌మైన పాల‌న ఎలా అందిస్తారు. ఇవే ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌లు. వీటికి జ‌గ‌న్ ఎలా స‌మాధానం చెప్తారో వేచిచూద్దాం.
    భజన బృందాన్ని పక్కన పెట్టండి... 
    వీటన్నిటికీ తోడు పార్టీలో కొంతమంది నోటి దురుసు ఉన్న నాయకులను కంట్రోల్ లో పెట్టాలి. లేకపోతే వారు జగన్ కు అనవసరంగా సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అలాగే కొంతమంది నాయకులు 30 ఏళ్ళు,  ముఖ్యమంత్రి  అంటూ భజన మొదలెట్టారు... అలాంటి ప్రకటనలు కట్టిపెట్టి వాస్తవంగా ఆలోచించాలి. కళ్ళు,  కాళ్ళు భూమ్మీద ఉండాలి కానీ... ఆకాశంలో కాదు... 30 ఏళ్ళు, 40 ఏళ్ల సంగతి గురించి ఇప్పుడే ఆలోచించొద్దు... ముందు వాళ్ళ నాన్న లాగా మొదటి ఐదేళ్లు అద్వితీయంగా పరిపాలిస్తే... రెండోసారి జనమే గెలిపిస్తారు... పక్క రాష్ట్రమైన ఒడిశా లో చూడండి... బిజు పట్నాయక్ 2 సార్లు (మొదటి సారి 2 ఏళ్ల 4 నెలలు, రెండో సారి ఇదేళ్ల్లు), ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ 2000 నుంచి వరుసగా 4 టర్మ్స్ అంటే 20 ఏళ్ళు పూర్తి చేసుకుని, ఇప్పుడు ఐదోసారి గెలిచి 25 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవిలో ఉండి చరిత్ర సృష్టించబోతున్నాడు. తండ్రి కొడుకులు కలసి 32 ఏళ్లకు పైగా ఒక రాష్ట్రాన్ని ఏలడం బహుశా మన దేశంలో వారి రికార్డు ఇంకా ఎవరూ బద్దలు కొట్టలేరేమో... పక్కనున్న తెలంగాణ లో చూడండి ఐదు నెలల కిందటే తిరుగులేదనుకున్న టి.ఆర్.ఎస్ కి అప్పుడే ఊహించని షాక్ తగిలింది. అందుకే ప్రజలిచ్చిన ఈ మహత్తర అవకాశాన్ని అందిపుచ్చుకుని, భజన బృందం మైకంలో పడి కొట్టుకుపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగురూకతతో... అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముంది.
    ఏది ఏమైనా ఆరు నూరైనా... నూరు ఆరైనా జగన్ సి.ఎం కావడం ఖాయం అని భిన్నస్వరం పోలింగ్ కు వారం రోజుల ముందే ప్రకటించింది. జగన్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసింది. కౌంటింగ్ కు ముందే యెడుగూరి సందింటి జగన్మోహన రెడ్డి అను నేను...  అంటూ ఆయన త్వరలో సి.ఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు కూడా ముందే ప్రకటించింది. జగన్ ను గెలిపించనున్న బి.సి లు... అంటూ కౌంటింగ్ కు రెండు రోజుల ముందు మరో కధనం ప్రచురించాం. మేము చెప్పినట్టే జరిగింది. భిన్నస్వరం మరోసారి మన నూతన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. జగన్ తాను చెప్పినట్టుగానే మొదటి ఆరు నెలలు, సంవత్సరం లోపే మంచి ముఖ్య మంత్రి అనిపించుకుంటారని ఆశిద్దాం... 




    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ ముందున్న సవాళ్లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top