Translate

  • Latest News

    29, జులై 2019, సోమవారం

    జగన్... ఇసుక తుఫాన్...తస్మాత్ జాగ్రత్త...


    ఎమర్జెన్సీ అనంతరం దేశంలో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ దారుణ పరాజయం తర్వాత 1977 లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం కేవలం మూడేళ్లే అధికారంలో ఉన్నప్పటికీ చాలా మంచి పనులు చేసింది. ప్రజల్లో మంచి పేరు సంపాదించింది. అయితే అనేక పార్టీల కలగూర గంపగా ఏర్పడ్డ జనతా ప్రభుత్వం అంతర్గత కలహాలతో మూడేళ్లకే కుప్పకూలింది... అందులో జనతా పార్టీలో భాగమైన జనసంఘ్ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) పాత్ర కూడా ఉంది. అయితే వాటి కలహాల సంగతి అటుంచితే... గోడకు కొట్టిన బంతి తిరిగి అదే స్పీడ్ తో వెనక్కి తిరిగి వచ్చినట్టు ఇందిరా గాంధీ తన రాజకీయ చాణక్యాన్ని అంతా ఉపయోగించి, మూడేళ్ళలోనే తిరిగి ప్రధానమంత్రి పీఠం అధిస్టించడం నిజంగా ఆమె ఘనతే అని చెప్పక తప్పదు.. ఎందుకంటే జనతా ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత సానుకూలత ఉన్నప్పటికీ అందివచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వదులుకోకుండా రచ్చ రచ్చ చేసి, ప్రజాందోళనలతో ప్రజలకు దగ్గర కాగలిగింది. అందులో ప్రధానంగా చెప్పుకోవలసింది ఉల్లిపాయ ధర... సామాన్యుడికి సైతం నిత్యం అవసరమైన ఉల్లిపాయ ధర జనతా ప్రభుత్వ హయాంలో కిలో 5 రూపాయలకు పెరగడంతో ఆ అంశంపైనే ప్రజల్లో ఊదరగొట్టి ప్రచారం చేసి ఓ రకంగా జనతా ప్రభుత్వం పతనానికి ఉల్లిపాయ కారణమయ్యిందని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. ఆ విధంగా ఇందిరా గాంధీ ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషించి... మూడేళ్ళ లోనే తిరిగి ప్రధాని కాగలిగింది.
    ఈ సోదంతా ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే... రాష్ట్రంలో 151 సీట్లతో తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నాటి జనతా ప్రభుత్వం లాగానే సామాన్య ప్రజలకు మేలు చేసే అనేక మంచి పనులు చేస్తూ మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకుంటున్నారు. కేవలం 2 నెలల్లోనే ఎన్నో మంచి పనులు చేశారు... కానీ ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క ఉల్లిపాయ ఊరంతా చెడగొట్టిందన్న సామెత లాగా...సామాన్యులకు అవసరమైన  ఉల్లిపాయ ధర అసామాన్యంగా పెరిగి జనతా ప్రభుత్వ పతనానికి కారణమైనట్టు... నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా... సామాన్యుడితో  ముడిపడి ఉన్న  ఇసుక అందని చందమామ అవడంతో ప్రభుత్వంపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి... ఎందుకంటే ఇసుక అవసరం భవన నిర్మాణాలకే అయినా... ఆ నిర్మాణాలపై ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పూట గడవక... పస్తులు ఉండాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఏ రోజుకా రోజు రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తేనే నాలుగు వేళ్ళు నోట్లో కెళ్లే పేదోళ్లకు ఇసుక సమస్యతో గత రెండు నెలలుగా సరిగా పనులు లేక జీవనమే సమస్యగా మారింది. దీనికి తోడు రాజధానిలో పనులు అన్నీ ఒక్కసారిగా ఆగిపోవడంతో కూడా వేలాదిమందికి పనులు లేకుండా పోయాయి... దీంతో వేలాదిమంది కూలీలు వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
    జనతా ప్రభుత్వం లాగా బొటాబొటి మెజార్టీ ఉన్న ప్రభుత్వం కాదు జగన్ ప్రభుత్వం... పూర్తి స్థాయి మెజార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎటువంటి  ఢోకా లేదు... కానీ... అంత  మాత్రాన ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు... ఎన్ని మంచి పనులు చేసినా  ఇసుక విధానం వలన అట్టడుగు వర్గాలు పడుతున్న ఇబ్బందులు అంత  తేలిగ్గా తీసివేయరాదు... అసెంబ్లీలో వరుస బిల్లుల ప్రతిపాదనలు, చర్చలు, పొగడ్తలతో  మత్తులో కూరుకుపోయిన ప్రభుత్వానికి  ఇసుక సమస్య కనపడకపోవచ్చు... కానీ... ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీనిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ప్రతిపక్షం దానినే బూచిగా చూపిస్తుంది...చాలామందికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. జనతా ప్రభుత్వ పతనానికి ఉల్లిపాయ కూడా ఓ  కారణమైనట్టు... రేపు జగన్ ప్రభుత్వం ఇసుక తుఫాను లో కొట్టుకుపోయే ప్రమాదముంది తస్మాత్ జాగ్రత్త... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్... ఇసుక తుఫాన్...తస్మాత్ జాగ్రత్త... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top