Translate

  • Latest News

    16, ఆగస్టు 2019, శుక్రవారం

    ఉపన్యాసం ఒక కళ-1



    ఉఫన్యాసం ఒక కళ. కొందరు ఉపన్యాసం పెద్దగా చేయకున్నా సభాసరస్వతులుగా చలామణి అవుతారు. ఇంకొందరు ఏమీ మాట్లాడడం రాదు అంటూ ‘నేను సభాధ్యక్షుణ్ణి’అని గర్వంగా మురిసిపోతారు. కొందరికి సభతో సంబంధం లేకున్నా, ఏమీ మాట్లాడడం రాకున్నా సభావేదికపైకి ఎక్కి తమకు తోచింది చెప్పి తమనుతామే గొప్ప వక్తలుగా భావించుకొని మురిసిపోతుంటారు. 
    కేవలం ఉపన్యాసంతో శ్రీమతి ఇందిరాగాంధీ, అటల్‌బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అద్వానీ, దీనదయాల్ ఉపాధ్యాయ, నందమూరి తారక రామారావులు ప్రముఖ రాజకీయ నాయకులుగా మన్ననలు పొందారు. మనకు సమీపంలో ఉన్న  ప్రస్తుత తెలంగాణ సీఎం కెసిఆర్, ఏపీ సీఎం జగన్ ఉపన్యాసాలతో పాటు ప్రధాని మోడీ ఉపన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.. ఆధ్యాత్మిక, సామాజిక క్షేత్రాల్లో అనేకమంది గొప్ప వక్తలుగా రాణించారు. ఒక్క ఉపన్యాసంతోనే స్వామి వివేకానంద ప్రపంచ సర్వమత మహాసభల్లో భారతీయత స్థానం నిలిపి, ఈ దేశ ఆధ్యాత్మిక క్షేత్రంలో సుస్థిరస్థానం సంపాదించారు. ఆచార్య రజనీష్ ఉపన్యాసం వింటుంటే కొన్ని లక్షల పుస్తకాల సారాంశం మనకు ఇట్టే అర్థమవుతుంది. ఆనంద్‌మార్గ్ సంస్థను స్థాపించిన శ్రీ ఆనందమూర్తి (ప్రభాత్‌రంజన్ సర్కార్) ఉపన్యాసం విన్న ఎందరో సామాన్యులు ఆనందమార్గ్‌లో సన్యాసులుగా మారిపోయారు. అదీ ఆయన ఉపన్యాస ఆధ్యాత్మిక శక్తి. తీవ్రవాద మార్గాల్లో యువకుల్ని నడిపించే వ్యక్తులు కూడా ఉపన్యాసాల ద్వారానే జనాన్ని ప్రోగుచేస్తుంటారు.

    ఉప అనగా సమీపం, న్యాసం అనగా పెట్టడం అని అర్థం. అంటే విషయాన్ని హృదయానికి సమీపంగా పెట్టడం అనేది ఇందులోని భావన. వినే శ్రోత హృదయాన్ని వక్త పసిగట్టాలి. మనస్సును, హృదయాన్ని రంజింపజేయాలి. మన వెంబడి శ్రోతను నడిపించాలి. ఉపన్యాసకుడు తన ఉపన్యాసంలో ప్రస్తావించిన పది అంశాలు ఎలా ఒక దాన్నుండి ఇంకో దాంట్లోకి ప్రవేశించాడో, పూర్తిచేశాడో అర్థం కాకూడదు. అంత సులభంగా శ్రోతను మంత్రముగ్ధుణ్ణి చేయాలి.

    ఉపన్యాసకుడు మొదట ఎక్కడ, ఎలాంటి చోట ప్రసంగం చేయాలో పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలి. దానికి అనుగుణంగా విషయ పరిజ్ఞానం సంపాదించుకోవాలి. వెళ్లాల్సిన తేదీని దినచర్య పుస్తకంలో రాసి పెట్టుకోవాలి. కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడి ఫోను నెంబర్ మొ.వి రాసిపెట్టుకోవాలి. వీలైతే కార్యక్రమ కరపత్రం (ఆహ్వానపత్రం) పంపించాలని కోరాలి. కార్యక్రమం జరగాల్సిన చోటుకు వెళ్ళే రవాణా సౌకర్యం, ప్రయాణానికి పట్టే కాలం విచారించి నిర్ణయం చేసి పెట్టుకోవాలి. కార్యక్రమ స్వరూప స్వభావం తెలుసుకోవాలి. వీలైతే కార్యక్రమంలో ఎలాంటి శ్రోతలుంటారో, సభాస్వరూపం తెలుసుకోవాలి. ఉపన్యాసం చేయడానికి ముందు దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం బాగా పెంపొందించుకోవాలి. నేడు సమాజంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్గియుండాలి. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఉపన్యాసం ఒక కళ-1 Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top